Kajal: మీమ్స్‌ నన్ను బాధపెట్టాయి: కాజల్‌

అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌ తల్లికాబోతున్న విషయం తెలిసిందే. మంగళవారం బేబీ బంప్‌ ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. దీంతో కాజల్‌ శరీరాకృతిని విమర్శిస్తూ పలు మీమ్స్‌ దర్శనమిస్తున్నాయి.....

Published : 09 Feb 2022 22:58 IST

ట్రోల్స్‌కి చెక్‌ పెట్టిన నటి‌.. స్పందించిన సామ్‌

హైదరాబాద్‌: అగ్రకథానాయిక కాజల్‌ అగర్వాల్‌ తల్లికాబోతున్న విషయం తెలిసిందే. మంగళవారం బేబీ బంప్‌ ఫొటోలను ఆమె అభిమానులతో పంచుకున్నారు. దీంతో కాజల్‌ శరీరాకృతిని విమర్శిస్తూ పలు మీమ్స్‌ దర్శనమిస్తున్నాయి. దానిపై తాజాగా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌మీడియాలో వచ్చే పలు పోస్టులు, మీమ్స్‌ తనని బాధపెట్టాయని అన్నారు. గర్భవతిగా ఉన్న సమయంలో ప్రతి మహిళ శరీరాకృతి మారుతుందని ఆమె తెలిపారు.

‘‘నా జీవితంలో చోటుచేసుకుంటున్న కొత్త కొత్త మార్పులను నేను ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నా. కానీ, నా శరీరాకృతిపై వస్తోన్న కొన్ని కామెంట్స్‌, మీమ్స్‌, ట్రోల్స్‌ నన్ను కాస్త బాధపెట్టాయి. అలాంటి మూర్ఖుల కోసమే ఈ పోస్ట్ పెడుతున్నా. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకోవడం సర్వసాధారణం. విపరీతంగా బరువు పెరిగిపోతాం. ఎమోషన్స్‌ ఉన్నట్టుండి మారిపోతాయి. ఒక్కొసారి నెగెటివ్‌ మూడ్‌ వల్ల అనారోగ్యానికీ గురి అవుతాం. డెలవరీ అయ్యాక కూడా సాధారణ స్థితిలోకి రావడానికి చాలా సమయం పడుతోంది. కానీ మేము వాటన్నింటినీ పట్టించుకోం. కేవలం ఈ భూమ్మీదకు రాబోయే చిన్నారి గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటాం. కాబట్టి, ట్రోల్‌ చేసేవాళ్లకు నేను చెప్పేది ఏంటంటే.. ఎదుటివారి పట్ల దయతో వ్యవహరించండి. విమర్శలు చేయడం మానండి’’ అని కాజల్‌ రాసుకొచ్చారు. కాగా, కాజల్‌ పెట్టిన పోస్టుపై నటి సమంత హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇప్పటికీ, ఎప్పటికీ నువ్వు అందగత్తెవే!!’’ అని ప్రశంసిస్తూ కామెంట్‌ పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని