Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?బెనిఫిట్‌ షోలు ఉంటాయా?

ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపిక పదుకొణె, కమల్‌ హాసన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘కల్కి’ సెన్సార్‌ పూర్తి చేసుకుంది.

Published : 20 Jun 2024 19:49 IST

హైదరాబాద్‌: ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.  తాజాగా ఈ మూవీ తెలుగు సెన్సార్‌ పూర్తయింది. సినిమా రన్‌టైన్‌ 180.56 నిమిషాలు. కొన్ని డిస్‌క్లైమర్స్‌ను జత చేయాల్సింది సీబీఎఫ్‌సీ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సర్టిఫికేషన్‌) సూచించింది. మూడు గంటల పాటు ప్రేక్షకులను థియేటర్‌లో కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. ఇటీవల కాలంలో మూడు గంటలకు అటు, ఇటుగా పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడమే కాదు, మంచి విజయాలను అందుకున్నాయి. పైగా ‘కల్కి’లాంటి సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలకు ఇదంత కష్టమేమీ కాదు. ఈ విషయంలో చిత్ర బృందం పూర్తి నమ్మకంతో ఉంది.  తాను అనుకున్న కథ ప్రకారం... దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మూవీని తీయగా, ఫుటేజ్‌ మొత్తం దాదాపు నాలుగున్నర గంటలు వచ్చిందని సమాచారం. ప్రేక్షకులు చూసేందుకు వీలుగా కథ, కథనాలు దెబ్బతినకుండా సినిమా రన్‌టైమ్‌ను 3గంటలకు తీసుకొచ్చారు. ప్రేక్షకుడు థియేటర్‌లో అడుగు పెట్టిన తర్వాత సరికొత్త ఊహా ప్రపంచంలోకి వెళ్లడం ఖాయమని చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

స్పెషల్‌ షోల కోసం ప్లానింగ్‌..

ప్రభాస్‌ అభిమానుల కోసం ‘కల్కి’ బెనిఫిట్‌ షోలను ప్రదర్శించాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతులు తీసుకోనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని రూ.140కోట్లకు విక్రయించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘కల్కి’ సేఫ్‌ జోన్‌లో ఉండాలంటే కనీసం రూ.120కోట్లు వసూలు చేయాలి. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే అదనపు ప్రదర్శనలతో పాటు, మొదటి వారం లేదా, కనీసం వీకెండ్‌ వరకూ టికెట్‌ ధరలను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించాలి. మరోవైపు విదేశాల్లో ‘కల్కి’ టికెట్‌ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. అమెరికా, యూకేలో బుకింగ్స్‌ విషయంలో విశేష ఆదరణ లభిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. ఐమ్యాక్స్‌ 3డీ వెర్షన్‌తో పాటు, యూకేలోని కొన్ని థియేటర్స్‌లో 4డీలోనూ ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ముంబయిలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించగా, త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం సరైన వేదికను అన్వేషిస్తున్నారు. తొలుత ఏపీలో ఈవెంట్‌ను ఏర్పాటు చేయాలని భావించినా, దీనిపై స్పష్టత రాలేదు. ఒకట్రెండు రోజుల్లో దీనిపై తుది నిర్ణయం తీసుకుని ప్రభాస్‌ అభిమానులను అలరించేలా భారీగా ఈవెంట్‌ను ప్లాన్‌ చేసే అవకాశం ఉన్నట్లు చిత్ర వర్గాల సమాచారం. ఈ ఈవెంట్‌లోనే ‘కల్కి’ సెకండ్‌ ట్రైలర్‌ను విడుదల చేయనున్నాను.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని