Nag Ashwin: ఓ చరిత్రగానే ఈ కథను చెప్పా

తెలుగు సినిమా అనగానే చాలా మందికి ‘మాయాబజార్‌’ గుర్తొస్తుంది. అది ఒక రకంగా మహాభారతం స్ఫూర్తితో రూపొందినదే అయినా అందులోని ప్రధాన అంశం కల్పితం.

Published : 06 Jul 2024 01:35 IST

‘మహానటి’తో జాతీయ స్థాయిలో సత్తా చాటారు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. ఇప్పుడాయన మూడో ప్రయత్నంగా ‘కల్కి 2898ఎ.డి’తో ప్రపంచ బాక్సాఫీస్‌ ముందు జోరు చూపిస్తున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నాగ్‌ అశ్విన్‌ శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

‘‘తెలుగు సినిమా అనగానే చాలా మందికి ‘మాయాబజార్‌’ గుర్తొస్తుంది. అది ఒక రకంగా మహాభారతం స్ఫూర్తితో రూపొందినదే అయినా అందులోని ప్రధాన అంశం కల్పితం. నేను దాన్ని స్ఫూర్తిగా తీసుకునే మహాభారత కాలాన్ని.. భవిష్యత్తును ముడిపెట్టి ‘కల్కి..’ కథ అల్లుకున్నా. నేను తొలుత ఈ కథను ఒక్క సినిమాగానే తెరకెక్కించాలనుకున్నా. కొన్ని షెడ్యూల్స్‌ చిత్రీకరణ పూర్తయ్యాక ఇంత పెద్ద కథను ఒక్క భాగంలో చెప్పడం అంత తేలిక కాదనిపించింది. అప్పుడే దీన్ని భాగాలుగా చూపించాలనుకున్నా. చాలా మంది ‘ఇది మైథాలజీనా.. చరిత్రా?’ అని అడుగుతున్నారు. మేమైతే ఈ కథను చరిత్రగానే చెప్పాం. కానీ, అతీత శక్తులపైనా నాకు నమ్మకం ఉంది’’. 

రెండో భాగం చకచకా పరుగులు

‘‘ఈ చిత్రంలో ప్రభాస్‌ పాత్ర నిడివి తక్కువుందనే అభిప్రాయాలొచ్చాయి. నిజానికి ఇది చాలా పెద్ద కథ. ఆ ప్రపంచాన్ని.. అందులోని పాత్రల్ని.. అన్నింటినీ జాగ్రత్తగా పరిచయం చేయాలి. ఇప్పుడీ తొలి భాగంతో అందరికీ ‘కల్కి..’ ప్రపంచం పరిచయమైపోయింది. కాబట్టి రెండో భాగం చాలా బిగితో చకచకా నడిచిపోతుంది. ఈ కథకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే అమితాబ్, ప్రభాస్, కమల్‌ లాంటి అగ్రతారల్ని తీసుకున్నాం. అంతే తప్ప మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని కాదు’’. 

అందుకే ప్రభాస్‌ పాత్రను అలా చూపించాం.. 

‘‘మన దగ్గర ఇతిహాసాల రూపంలో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. ఇప్పుడీ సినిమా ద్వారా పిల్లలు మహాభారతంతో పాటు మన నిజమైన సూపర్‌ హీరోల గురించి తెలుసుకుంటారనే ఉద్దేశం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని నేను పూర్తిగా డార్క్‌గా చూపించాలని అనుకోలేదు. ఆ ఉద్దేశంతోనే ప్రభాస్‌ పాత్రను కూడా సీరియస్‌గా కాకుండా వినోదాత్మకంగా తీర్చిదిద్దా. ఇక ఇందులో ఆయన పోషించిన కర్ణుడి పాత్ర కూడా ఎక్కడా నెగటివ్‌గా ఉండదు. మన దేశంలో కర్ణుడి పాత్రను అందరూ ప్రేమిస్తారు. ఆయన పాత్ర రెండో భాగంలోనూ కథకు న్యాయం చేసేలా సానుకూలంగానే ఉంటుంది. ఈ సినిమా రెండోసారి చూస్తున్నప్పుడు కర్ణుడికి సంబంధించిన చాలా విషయాలు కొత్తగా అనిపిస్తాయి’’. 

నిర్మాతలే ఎక్కువ రిస్క్‌ తీసుకున్నారు.. 

‘‘కమల్‌హాసన్‌ తనదైన నటనతో యాస్కిన్‌ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో ఆయన పాత్రతో శ్రీశ్రీ కవిత్వం చెప్పించడానికి ఓ కారణం ఉంది. ఆ యాస్కిన్‌ ఫిలాసఫీ కూడా అదే కావడం వల్లే ఆ కవిత్వం తను చెప్పడం బాగా కుదిరింది. తొలి భాగంలో యాస్కిన్‌ పూర్తి కథను చూపించలేదు. దాన్ని రెండో భాగంలోనే చూపించనున్నాం.  ఆ పాత్రతో మరో సినిమా చేయాలన్న ఆలోచనైతే లేదు. కాకపోతే ఈ సినిమాలోని ప్రతి పాత్రతోనూ ఓ సినిమా చేయగలిగేంత బలం ఆ పాత్రల్లో ఉంది. ఈ చిత్ర విషయంలో నా కన్నా నిర్మాతలే ఎక్కువ రిస్క్‌ తీసుకున్నారు. నేను ఒక లెక్క చెబితే దాని కంటే ఎక్కువే ఖర్చు పెట్టారు’.

అదే నాకు సవాల్‌గా అనిపించింది.. 

‘‘ఒక సినిమాని నాలుగున్నరేళ్లు పట్టుకుని ఉండాలంటే బలమైన  జడ్జిమెంట్‌ ఉండాలి. 2019లో రాసిన సీన్‌ను 2024లో ఎడిట్‌ చేస్తున్నప్పుడు అదే జడ్జిమెంట్‌ పెట్టుకుని పని చేయడం చాలా కష్టమైన విషయం. దీనికి డిఫరెంట్‌ సెట్‌ కావాలి. ఈ చిత్ర విషయంలో అది కష్టమనిపించింది. నాకు ఈ రెండో భాగం విషయంలో స్క్రిప్టే ఓ పెద్ద సవాల్‌గా ఉంది. మళ్లీ ప్రతిదీ కొత్తగా సృష్టించాలి. కల్కిగా ఎవరు చేస్తే బాగుంటుందన్నది ఇంకా ఆలోచించలేదు. ప్రస్తుతానికైతే ఆయన ఇంకా సుమతి (దీపిక పాత్ర) పొట్టలోనే ఉన్నారు కదా (నవ్వుతూ)’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని