Kalki 2898 AD: ‘కల్కి’కి అవార్డు.. ఫొటో పంచుకున్న నాగ్‌ అశ్విన్‌

తమ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి తొలి అవార్డు వచ్చిందంటూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

Published : 30 Jun 2024 16:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్: అంచనాలకు తగ్గట్టే బాక్సాఫీసు వద్ద ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) దూసుకెళ్తోంది. సూపర్‌హిట్‌ టాక్‌తో రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. ‘ఈ సినిమాకి అంతర్జాతీయ అవార్డులు రావడం ఖాయం’ అనే మాట ప్రభాస్‌ (Prabhas) అభిమానులు, సినీ ప్రియుల నోట వినిపించిన సంగతి తెలిసిందే. ప్రచార చిత్రాలు ఆ స్థాయిలో ఆసక్తి రేకెత్తించాయి. మూవీ రిలీజ్‌ తర్వాత కూడా అదే టాక్‌. ఇంటర్నేషనల్‌ అవార్డులకు ఇంకా సమయం ఉందనే ఉద్దేశమో ఏమోగానీ టాలీవుడ్‌ హీరో ఒకరు ‘కల్కి’కి అవార్డు ఇచ్చారు. సంబంధిత ఫొటో షేర్‌ చేస్తూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) సోషల్‌ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. ‘ఇది కల్కికి వచ్చిన తొలి అవార్డు’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టారు. ఆ అవార్డు ఇచ్చిన నటుడు ఎవరో కాదు.. రానా దగ్గుబాటి. డైరెక్టర్‌ పోస్ట్‌పై స్పందించిన రానా (Rana Daggubati).. ‘కల్కి’కి మరిన్ని పురస్కారాలు వస్తాయని పేర్కొన్నారు.

వసూళ్లు ఎంతంటే?

గురువారం విడుదలైన ఈ మైథాలజీ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ మూడు రోజుల్లో రూ. 415 కోట్లుకుపైగా వసూళ్లు (Kalki 2898 AD Collections) రాబట్టిందని చిత్ర బృందం ప్రకటించింది. రిలీజైన రోజు నుంచే సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమా టీమ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్‌, మోహన్‌ బాబు, అల్లు అర్జున్‌ తదితరులు ‘కల్కి’ ఓ అద్భుతమని పేర్కొన్నారు. విజువల్స్‌ పరంగానే కాదు అతిథి పాత్రలతోనూ ఈ మూవీ ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేసింది. హీరోలు విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, దర్శకులు రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ తదితరులు ఈ సినిమాలో చిన్న పాత్రల్లో కనిపించడం విశేషం.

ఎల్లలు దాటిన అభిమానం

జపాన్‌లోనూ అభిమానులను కలిగిన టాలీవుడ్‌ హీరోల్లో ప్రభాస్‌ ఒకరు. జపాన్‌కు చెందిన ముగ్గురు మహిళలు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో ‘కల్కి’ సినిమాని చూసి ప్రభాస్‌పై అభిమానాన్ని చాటుకున్నారు. ఐమ్యాక్స్‌ వద్ద ప్రదర్శనకు ఉంచిన రెబల్‌ ట్రక్‌ (సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందించింది) వద్ద ఫొటోకు పోజిచ్చారు. ఆ పిక్‌ను ‘కల్కి’ టీమ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌ అవుతోంది.

‘కల్కి’.. నా పాత్రంతా రెండో భాగంలోనే..: కమల్ హాసన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని