kalki 2898 ad collection worldwide: ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు వసూళ్లు ఎంతంటే?

ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద మంచిటాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

Published : 28 Jun 2024 15:32 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ (Director Nag Ashwin) దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). తాజాగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ తొలిరోజు రూ.191.5 కోట్లు వసూలుచేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. గురువారం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ ఈ వారాంతానికి రూ.500 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఈ చిత్రం ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌ల మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే, ఆ సీన్స్‌ కోసం అమితాబ్‌ ఎంతో కష్టపడ్డారు. 81 ఏళ్ల వయసులోనూ అశ్వత్థామగా మేకప్‌ వేసుకుని కర్రతో ఫైట్స్‌ చేశారు. ఇందుకు సంబంధించి సెట్స్‌లో అమితాబ్‌, ప్రభాస్‌ యాక్షన్‌ సీన్‌ కోసం సన్నద్ధమవుతున్న వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. నటనపై అమితాబ్‌కు ఉన్న నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకప్పుడు బాలీవుడ్‌లో యాంగ్రీ యాక్షన్‌ హీరోగా గుర్తింపుతెచ్చుకున్న ఆయన 2000 తర్వాత నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల వైపే మొగ్గు చూపారు. దర్శక-రచయితలు కూడా అలాంటి పాత్రలనే ఆఫర్‌ చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు నాగ్‌అశ్విన్‌ మాత్రం పాత అమితాబ్‌ను చూపించారని అంటున్నారు.

మరిన్ని పెద్ద కథలకు ‘కల్కి’ స్ఫూర్తి

‘కల్కి 2898 ఏడీ’ చిత్ర బృందం విజువల్‌ వండర్‌ను క్రియేట్‌ చేసిందని ‘కె.జి.యఫ్‌’ హీరో యశ్‌ (Yash) అన్నారు. సినిమాను చూసిన ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. మరింత సృజనాత్మకంగా కథ చెప్పేందుకు ఈ చిత్రం మార్గం చూపిందన్నారు. నాగ్‌ అశ్విన్‌, వైజయంతీ మూవీస్‌ విజన్‌, ధైర్యం స్ఫూర్తిదాయకమన్నారు. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణెల నటనతో పాటు, కథకు అనుగుణంగా అతిథి పాత్రలను జోడించిన తీరు బాగుందన్నారు. ‘కల్కి’ మూవీ కోసం పనిచేసిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని