Kalki 2898 AD Part 2: ‘కల్కి’ పార్ట్‌-2 రిలీజ్‌ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్‌

kalki part 2 release date: ప్రభాస్‌, నాగ్‌ అశ్విన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విజయపథంలో దూసుకుపోతోంది. ఈసందర్భంగా నిర్మాత అశ్వనీదత్‌ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Updated : 29 Jun 2024 16:00 IST

Kalki 2898 AD Part 2: ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు సృష్టిస్తోంది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.298.5 కోట్లు వసూలుచేసింది. రూ.500 కోట్లు నేడో, రేపో దాటడం ఖాయమైపోగా, రూ.1000 కోట్ల వైపు వడివడిగా అడుగులు వేస్తుందని సినీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ‘కల్కి’ విజయపథంలో నడుస్తున్న సందర్భంగా చిత్ర నిర్మాత అశ్వనీదత్‌ (Ashwini Dutt interview) మీడియాతో మాట్లాడారు. ప్రభాస్‌, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణె వంటి అగ్రతారలపై ఉన్న నమ్మకంతోనే ‘కల్కి’ప్రాజెక్ట్‌ మొదలుపెట్టడానికి కారణమని తెలిపారు. ముఖ్యంగా నాగ్‌ అశ్విన్‌ విజువలైజేషన్‌కు హ్యాట్సాఫ్‌ చెప్పాలన్నారు.

నాగీ ఏ సబ్జెక్ట్‌ అడిగినా నో చెప్పొద్దని చెప్పా!

‘‘మహానటి’ చేసిన తర్వాత ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడన్న నమ్మకం కలిగింది. అదే మా అమ్మాయిలకు చెప్పా. అతడు ఏ సబ్జెక్ట్‌ చెప్పినా వద్దని చెప్పకుండా ముందుకువెళ్లమని చెప్పా. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు దాటిపోయింది. నా మొదటి సినిమా నుంచి దర్శకుడు చెప్పింది విని, అతడి విజన్‌కు ఏం కావాలో అదే ఇస్తూ వచ్చాం. ‘ఇది ఎందుకు’ అని ఎప్పుడూ దర్శకుడితో చర్చ పెట్టలేదు’’

యాస్కిన్‌ పాత్రకు కమల్‌హాసన్‌ను అనుకోలేదు!

‘‘కల్కి’ చూసిన సినీ పెద్దలంతా నాగ్‌ అశ్విన్‌ టేకింగ్‌ను మెచ్చుకుంటున్నారు. అమితాబ్‌ పాత్ర విషయంలోనూ నాగీ అనుకున్నది అనుకున్నట్లుగా తీశాడు. ప్రచార కార్యక్రమాల్లో ఆయన నా కాళ్లకు నమస్కారం పెట్టడంతో ఒక్కసారిగా షాకయ్యా. ఇక కృష్ణుడి పాత్రకు ముందుగా ఎవరినీ అనుకోలేదు. అందుకే సినిమాలోనూ ఆ పాత్ర ముఖాన్ని రివీల్‌ చేయలేదు. ఈ మూవీ మొదలుపెట్టే ముందు లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో మాట్లాడాం. ఆయన కొన్ని చక్కటి సూచనలు చేశారు. అవి సినిమాకు హెల్ప్‌ అయ్యాయి. ఇక బుజ్జి కాన్సెప్ట్‌ అంతా నాగ్‌ అశ్విన్‌దే. సుప్రీం యాస్కిన్‌ పాత్ర కోసం తొలుత కమల్‌హాసన్‌ను అనుకోలేదు. అర్జునుడిగా విజయ్‌ దేవరకొండ సహా మిగిలిన వాళ్లందరినీ మొదటినుంచే అనుకున్నాం’’

రెండో భాగం ఎప్పుడంటే?

‘‘సినిమా కథా చర్చల్లో ఉండగానే రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచన వచ్చింది. ఎప్పుడైతే కమల్‌హాసన్‌ ఇందులో భాగం అయ్యారో అప్పుడే రెండు భాగాలు చేయాలని కచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం. కల్కి పార్ట్‌-2కు (kalki 2898 ad part 2 shooting) సంబంధించి కొంతమేర చిత్రీకరణ పూర్తయింది. కొన్ని కీలక సన్నివేశాలు, వీఎఫ్‌ఎక్స్‌ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అందుకు ఏడాదిపైనే పట్టొచ్చు. రెండో భాగం విడుదలపై ప్రస్తుతానికి ఎలాంటి తేదీ అనుకోలేదు. వచ్చే ఏడాది ఇదే సమయానికి రావచ్చు. ‘కల్కి2’ వరకే కథ అనుకున్నాం. పార్ట్‌-3గురించి ఇంకా ఏమీ అనుకోలేదు ’’

వాళ్లే ధైర్యం ఇచ్చారు

‘‘వైజయంతీ మూవీస్‌ స్థాపించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ సినిమా చేయాలని అనుకోలేదు. ఇది అనుకోకుండా జరిగింది. పురాణ పాత్రలను కలుపుతూ నాగ్‌ అశ్విన్‌ చాలా పకడ్బందీగా ఈ కథను తయారు చేసుకున్నాడు. ఈ మూవీ ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందోనని ప్రత్యేకంగా ఎదురు చూడటం లేదు. మా టీమ్‌ అంతా విజయాన్ని ఆస్వాదిస్తోంది. సినిమా షూటింగ్‌ సమయంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ పడలేదు.  సినిమా కోసం రూ.600 కోట్లు పెట్టే ధైర్యం ఇచ్చింది ప్రభాస్‌, కమల్‌, అమితాబ్‌ బచ్చన్‌లే. సెకండాఫ్‌లో కమల్‌హాసన్‌ పాత్ర కచ్చితంగా బీభత్సం సృష్టిస్తుంది. ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో నాతో కలిసి పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్‌లకు ఎప్పటికీ రుణపడి ఉంటా’’

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తా

‘‘ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి మా వంతు కృషి చేస్తాం. గత ఐదేళ్లుగా రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారు. రాష్ట్రంతో పాటు, సినీ పరిశ్రమను కచ్చితంగా అభివృద్ధి చేస్తారు. నాకు ఎలాంటి పదవులు అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వడం మంచి నిర్ణయం. దీనివల్ల బ్లాక్‌ టికెటింగ్‌ తగ్గుతుంది. సినీ పరిశ్రమకు మంచి జరుగుతుంది. టికెట్‌ రేట్లు పెంచి నిర్మాతలు దండుకుంటున్నారని ఆరోపణలు చేయడం సరైనది కాదు. వారం రోజుల తర్వాత టికెట్‌ ధరలు సాధారణమైపోతాయి కదా. వైజయంతీ మూవీస్‌, సప్న మూవీస్‌ నుంచి ‘కల్కి పార్ట్‌-2’ కాకుండా రెండు సినిమాలు వస్తాయి. ఓ చిత్రాన్ని శ్రీకాంత్‌ కుమారుడుతో ‘ఛాంపియన్‌’ అని తీస్తున్నాం. మరొక చిత్రంలో దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని