Kalki 2898 AD: ‘కల్కి’ మరో రికార్డు.. కమల్‌హాసన్‌ డైలాగ్‌పై సాయిమాధవ్‌ ఏమన్నారంటే?

పాన్‌ ఇండియా మూవీ ‘కల్కి’ మరో రికార్డును సృష్టించింది. అత్యంత వేగంగా 10 మిలియన్‌ టికెట్లు విక్రయమైన చిత్రంగా నిలిచింది.

Published : 07 Jul 2024 18:37 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు చిత్ర బృందం ప్రకటించింది. థియేటర్‌లో మరో వారం పాటు ‘కల్కి’ హవా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొడుతున్న ఈ చిత్రం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. బుక్‌ మై షోలో 10మిలియన్‌ టికెట్లకు పైగా విక్రయమైన చిత్రంగా నిలిచింది. అతి తక్కువ సమయంలో ఈ రికార్డును సాధించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు షారుఖ్‌ నటించిన ‘జవాన్‌’ 10 మిలియన్‌ టికెట్లు విక్రయమైన తొలి చిత్రంగా రికార్డులకెక్కింది.

తాజాగా ‘కల్కి’ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్‌ మాట్లాడారు. ‘‘నాగ్‌అశ్విన్‌ ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఏ పాత్ర నుంచి ఏం కోరుకుంటున్నారు? అది ఎలా ప్రవర్తిస్తుంది? చాలా వివరణాత్మకంగా చెప్పారు. అమితాబ్‌గారికి సంభాషణలు రాసే అవకాశం నాకు లభించింది. ఆయన నోటి వెంట నేను రాసిన మాటలు వస్తుంటే, నా ఒళ్లు గగుర్పొడిచింది. ప్రభాస్‌, కమల్‌హాసన్‌లకు తొలిసారి మాటలు రాశా. ‘జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి’ అని కమల్‌ ఎందుకు అన్నారంటూ చాలా మంది ప్రశ్నించారు. భగవంతుడు వస్తున్నాడని దానర్థం. సుమతి పాత్ర ఆ భగవంతుడిని మోసుకొస్తున్న రథం. ‘నేను వెళ్లి ఆ రథ చక్రాన్ని ఆపేస్తా. భూకంపం పుట్టిస్తా.. భూ మార్గం పట్టిస్తా’ అర్థంలో యాస్కిన్‌ పాత్ర చెబుతుంది. కలియుగంలో స్వార్థం ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికైనా మార్పు వస్తుంది. ఎవరివల్ల అయితే కాలం మారిందో అతడే భగవత్‌ స్వరూపుడు’’ అని సాయిమాధవ్‌ చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని