kalki: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డును బ్రేక్‌ చేసిన ‘కల్కి’.. సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న విశేషాలివే

‘కల్కి 2898 ఏడీ’ విడుదల దగ్గరపడుతుండడంతో దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Updated : 14 Jun 2024 17:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగ్‌ అశ్విన్‌-ప్రభాస్‌ల (Prabhas) కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). జూన్‌ 27న విడుదల కానుంది. దీని కోసం సినీ ప్రియులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులు బ్రేక్‌..

‘కల్కి’ రిలీజ్‌కు ముందే రికార్డులను బ్రేక్ చేస్తోంది. తాజాగా ఓవర్సీస్‌లో దీని ప్రీ బుకింగ్స్‌ ఓపెన్‌ చేయగా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. ప్రీ సేల్స్‌ విషయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డులను బ్రేక్ చేసింది. అమెరికాలో ఇప్పటికే మిలియన్‌ డాలర్ల ప్రీ సేల్‌ బిజినెస్‌ జరిగింది. ప్రీ బుకింగ్స్‌లో అత్యంత వేగంగా మిలియన్‌ డాలర్ల మార్కును అందుకున్న ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఇదే తరహాలో బుకింగ్స్‌ కొనసాగితే విడుదలకు ముందే రెండు మిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 9 లొకేషన్లలో ప్రీ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా అక్కడ కూడా టికెట్స్‌ భారీగా అమ్ముడవుతున్నాయి.

ఐమ్యాక్స్‌ ప్రదర్శనల్లోనూ..

విదేశాల్లో ఎక్కువ ఐమ్యాక్స్‌ల్లో విడుదల కానున్న చిత్రంగా కల్కి (Kalki 2898 AD) మరో రికార్డును సొంతం చేసుకుంది. జూన్‌ 26న ఈ చిత్రం అక్కడ రిలీజ్‌ కానుంది. ఏకంగా 90 కంటే ఎక్కువ ఐమ్యాక్స్‌ల్లో దీన్ని ప్రదర్శించనున్నారు. ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రం ఇన్ని ఐమ్యాక్స్‌ థియేటర్లలో విడుదల కాలేదు. రిలీజ్‌కు ఇంకా సమయం ఉండడంతో ఈ సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్‌ నటుడు.. అధికారికంగా ప్రకటించిన టీమ్

‘కల్కి’లో రెండే పాటలు..!

ఈ చిత్రంలో ఒక్క పాటే ఉంటుందని ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి. తాజాగా మరో పాటను జోడిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమా విడుదలకు ముందే ఆ పాటను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అమితాబ్‌ కూడా తన బ్లాగ్‌లో పోస్ట్‌ పెడుతూ.. ‘త్వరలో విడుదల కానున్న సినిమాలోని పాట చిత్రీకరణలో బిజీగా ఉన్నాను’ అని తెలిపారు. దీంతో అది ‘కల్కి’లోని పాటే అని కొందరు భావిస్తున్నారు. ఈ పాటను ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ అర్జీత్‌ సింగ్ పాడినట్లు తెలుస్తోంది.

ప్రమోషన్స్‌ జోరు..

పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కింది. తాజాగా దీని ప్రచారం జోరు పెంచారు. వినూత్న రీతిలో ప్రమోషన్‌ మొదలు పెట్టారు. ‘కల్కి’ అని పేరు రాసున్న ప్రచార వాహనాలు రోడ్లపై కనిపిస్తున్నాయి. గతంలోనూ ఫ్యాన్స్‌ కార్‌ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. కార్లను ‘ప్రాజెక్ట్‌- కె’ (కల్కి వర్కింగ్‌ టైటిల్‌) లోగో రూపంలో పార్క్‌ చేసి ఇదే పేరుతో ఉన్న ప్రత్యేక టీ షర్ట్‌ ధరించి సందడి చేశారు. 

అమరావతిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌..

జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను అమరావతిలో ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. భారీగా దీన్ని నిర్వహించనున్నట్లు టాక్‌. సినీ, రాజకీయ ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించాలని చిత్రబృందం భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని కొన్ని పోస్ట్‌లు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి.

అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas) సరసన దీపిక పదుకొణె (Deepika Padukone) నటిస్తుండగా.. సీనియర్‌ హీరో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) విలన్‌ పాత్ర పోషిస్తున్నారు. అలాగే అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామగా నటించారు. పశుపతి, రాజేంద్రప్రసాద్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని