Kalyan Ram: ‘బింబిసార2’కి రంగం సిద్ధం

కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు శుక్రవారం. ఈ సందర్భంగా ఆయన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. విజయవంతమైన  ‘బింబిసార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఆ చిత్రం రూపొందనుంది.

Published : 06 Jul 2024 01:32 IST

కథానాయకుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజు శుక్రవారం. ఈ సందర్భంగా ఆయన 22వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. విజయవంతమైన  ‘బింబిసార’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఆ చిత్రం రూపొందనుంది. అంటే ‘బింబిసార’ కంటే ముందు జరిగిన కథ అన్నమాట. అనిల్‌ పాదూరి దర్శకత్వం వహిస్తారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కొసరాజు హరికృష్ణ నిర్మిస్తారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ని విడుదల చేస్తూ... ‘బింబిసార కన్నా యుగాల ముందు త్రిగర్తల రాజ్యాన్ని ఏలిన చక్రవర్తిని చూడటానికి సిద్ధంగా ఉండండి’ అంటూ అందులో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అనిల్‌ పాదూరి గతంలో ‘రొమాంటిక్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌ నిపుణుడైన ఆయన ‘బింబిసార’ చిత్రానికీ పనిచేశారు. తెరపైన ఇప్పటివరకూ చూడని దృశ్య సౌందర్యంతో త్రిగర్తల రాజ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ‘బింబిసార 2’ పేరుతో రూపొందనున్న ఈ సినిమా పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని సినీ వర్గాలు తెలిపాయి. 

21వ చిత్రం పోస్టర్‌ విడుదల

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ఆయన 21వ చిత్రం ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌తో కలిసి అశోక్‌ క్రియేషన్స్‌ పతాకంపై  అశోక్‌వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పకులు. ఐపీఎస్‌ అధికారిగా సీనియర్‌ నటి విజయశాంతి చిత్రంలోని కీలకమైన పాత్రని పోషిస్తున్నారు. సోహైల్‌ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోన్న ఈ సినిమాలోని పోస్టర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాంప్రసాద్, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్, స్క్రీన్‌ప్లే: శ్రీకాంత్‌ విస్సా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని