Kalyan Ram: విలన్‌గా కొత్తగా అనిపించింది!

ప్రయోగాలకు పెట్టింది పేరు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram). కొత్త కథలు భుజానికెత్తుకుంటూ.. కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తూ.. నటుడిగా, నిర్మాతగా వైవిధ్యభరితమైన చిత్రాలు రుచి చూపిస్తున్నారాయన.

Updated : 09 Feb 2023 06:54 IST

ప్రయోగాలకు పెట్టింది పేరు కల్యాణ్‌రామ్‌ (Kalyan Ram). కొత్త కథలు భుజానికెత్తుకుంటూ.. కొత్త దర్శకుల్ని ప్రోత్సహిస్తూ.. నటుడిగా, నిర్మాతగా వైవిధ్యభరితమైన చిత్రాలు రుచి చూపిస్తున్నారాయన. గతేడాది ‘బింబిసార’ (Bimbisara)తో భారీ విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు ‘అమిగోస్‌’(Amigos)తో అలరించేందుకు సిద్ధమయ్యారు. రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు కల్యాణ్‌రామ్‌.

ఈ చిత్ర విషయంలో మీకెదురైన సవాళ్లేంటి? బాలకృష్ణ పాట రీమేక్‌ చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చింది?

‘‘అమిగోస్‌’ మేకింగ్‌ ప్రాసెస్‌ కొంచెం కష్టంగా అనిపించింది. దీంట్లో నేను మంజునాథ్‌, సిద్ధార్థ్‌, మైఖేల్‌ అనే మూడు పాత్రల్లో కనిపిస్తా. ఈ మూడు నాకు చాలా నచ్చాయి. సిద్ధార్థ్‌ చాలా సరదాగా ఉంటాడు. మంజునాథ్‌ సైలెంట్‌ అండ్‌ సాఫ్ట్‌. మైఖేల్‌ మాత్రం పూర్తి భిన్నమైన వాడు. తను గ్యాంగ్‌స్టర్‌. ఈ మూడు పాత్రలు ఒకేసారి చేయడం సవాల్‌గానే అనిపించేది. ద్వితీయార్ధంలో కథ ఆసక్తికరంగా సాగుతున్నప్పుడు పాట వస్తే ప్రేక్షకులు నిరాశపడతారు. అలా జరగకుండా ఉండాలంటే ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నాం. అందుకే రీమేక్‌ పాట పెట్టాం. ఆ గీతాన్ని తెరపై చూసినప్పుడు అందరూ షాకవుతారు’’.

మీ కెరీర్‌లో ఇదొక భిన్నమైన ప్రయోగం అనుకోవచ్చా?

‘‘నేనిప్పటి వరకు చేసిన చిత్రాల్లో ‘118’ మాత్రమే ప్రయోగాత్మక చిత్రం. మిగిలినవన్నీ కమర్షియల్‌ సినిమాలే. ఈ ‘అమిగోస్‌’ కూడా అంతే. ఇదేమీ ప్రయోగాత్మక చిత్రం కాదు. నేను ఏ సినిమా చేసినా అందులో కథను కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తామంతే. ‘బింబిసార’ లాంటి టైమ్‌ ట్రావెల్‌, ఫాంటసీ చిత్రాలు గతంలో చాలా వచ్చాయి. కానీ, మేము ఆ కథను ఓ కొత్త కోణంలో ఆసక్తికరంగా చెప్పి, విజయం సాధించాం’’.

‘బింబిసార’ విజయం ఎలాంటి అనుభూతిని అందించింది?

‘‘ఏదైనా సినిమా విజయవంతమైతే మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. దానితో పాటే బాధ్యత కూడా రెట్టింపవుతుంది. మరింత కొత్తగా ప్రయత్నించాలని తపన పడతాం. నేను ‘బింబిసార’ హిట్‌ జోష్‌లోనే ‘అమిగోస్‌’, ‘డెవిల్‌’ చిత్రాల కోసం రంగంలోకి దిగా. ఇవన్నీ 2020లోనే ఓకే చేసిన కథలు. వేటికవే పూర్తి భిన్నంగా ఉంటాయి’’.

‘బింబిసార’ తర్వాత మీ కథల ఎంపికలో ఏమైనా మార్పొచ్చిందా?

‘‘నేను ‘బింబిసార’కు ముందు ఎలా ఉన్నానో.. ఇప్పుడూ అలాగే ఉన్నా. ఏ చిత్రం అంగీకరించినా.. ఆ పాత్ర గతంలో ఏ హీరో చేయనిదై ఉండాలనుకుంటా. కథ వింటున్నప్పుడల్లా ఈ ఒక్క విషయాన్ని కచ్చితంగా గమనించుకుంటా. ‘అమిగోస్‌’లో విలన్‌లా నటించడమన్నది చాలా కొత్తగా అనిపించింది. కొవిడ్‌ టైమ్‌లో నన్ను నేను బాగా తెలుసుకున్నా. నా గత చిత్రాలు చూసుకొని వాటిలో కొన్ని ఎందుకు ఫెయిలయ్యాయో విశ్లేషించుకున్నా. నేను చేసిన తప్పులేంటన్నది తెలుసుకున్నా’’.

‘అమిగోస్‌’ చేయాలని మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేంటి?

‘‘మనుషుల్ని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని ఇంట్లో పెద్దవాళ్లు చెబుతుంటారు. అదే పాయింట్‌తో అల్లుకున్న కథ అనగానే నాకు చాలా కొత్తగా అనిపించింది. దీన్ని దర్శకుడు రాజేంద్ర చక్కగా తీర్చిదిద్దుకున్నారు. అందుకే కథ వినగానే చేస్తానని చెప్పేశా. సాధారణంగా మన సినిమాల్లో హీరోని పూర్తిస్థాయి విలన్‌గా చూపించడమన్నది జరగదు. ఒకవేళ అలా చూపించాల్సి వచ్చినా ఆ పాత్రను కాస్త గ్రే షేడ్‌లో చూపించి.. చివరికి మంచిగా మారినట్లు చూపిస్తారు. కానీ, ‘అమిగోస్‌’ దీనికి భిన్నమైంది. ఇందులో హీరోనే విలన్‌. అతని లక్ష్యమేంటి? తన పోలికలతోనే ఉన్న మిగతా ఇద్దర్ని ఎందుకు కలుసుకున్నాడు? చివరికి వాళ్లు ఏం చేశారు? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ఇందులో ముగ్గురు హీరోలు కనిపించినా.. ఒక్క కథానాయికే ఉంటుంది. అవకాశముంది కదాని అనవసరమైన కమర్షియల్‌ హంగులు జోడించలేదు. ఇలాంటి స్క్రిప్ట్‌ దొరకడం ఒక అదృష్టం’’.

‘డెవిల్‌’, ‘బింబిసార 2’ విశేషాలేంటి?

‘‘బింబిసార2’ (Bimbisara 2) చిత్రీకరణ ఈ ఏడాది చివరిలో మొదలయ్యే అవకాశముంది. ‘డెవిల్‌’ (Devil) 70శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మరో మూడు నెలల్లో సినిమా పూర్తవుతుంది’’.


‘అమిగోస్‌’నే టైటిల్‌గా పెట్టాలని ఎందుకనిపించింది?

‘‘టైటిల్‌ విషయంలో తప్పు జరగకూడదని నా గట్టి అభిప్రాయం. ఈ సినిమాలో హీరో మూడు పాత్రలు ముఖ్యమైనవే. వాటిలో ఓ పాత్ర పేరును టైటిల్‌గా పెట్టలేం. వాళ్లు స్నేహితులు కాబట్టి ‘ముగ్గురు మిత్రులు, స్నేహం’ అనే రొటీన్‌ పేర్లు పెట్టలేం. అందుకే స్నేహితులు అనే అర్థం వచ్చేలా పరభాషలో ఎలాంటి క్యాచీ పదాలున్నాయో చూశాం. అప్పుడే ‘అమిగోస్‌’ తట్టింది. శేఖర్‌ కమ్ముల బ్యానర్‌ పేరు కూడా ఇదే. క్యాచీగా, కొత్తగా ఉందని పెట్టాం. మొదట్లో ఈ పేరుకు ఎవరికీ అర్థం తెలియకపోవచ్చు కానీ, ఆ తర్వాత ‘స్నేహితుల’ని అర్థం చేసుకున్నారు. ‘కాంతార’ టైటిల్‌ పెట్టినప్పుడు కూడా అసలు ఆ పేరుకు అర్థం ఎవరికీ తెలియదు. ఆ తర్వాత ‘దట్టమైన అడవి’ అని తెలుసుకున్నారు’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు