Kalyanam Kamaneeyam review: రివ్యూ: కళ్యాణం కమనీయం

Kalyanam Kamaneeyam review: సంతోష్‌ శోభన్‌, ప్రియాభవానీ శంకర్‌ కీలక పాత్రల్లో నటించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 14 Jan 2023 16:47 IST

Kalyanam Kamaneeyam review; చిత్రం: కళ్యాణం కమనీయం; నటీనటులు: సంతోష్‌ శోభన్‌, ప్రియా భవానీ శంకర్‌, దేవి ప్రసాద్‌, పవిత్రా లోకేశ్‌, కేదార్‌ శంకర్‌, సత్యం రాజేశ్‌, సప్తగిరి తదితరులు; సంగీతం: శ్రవణ్‌ భరద్వాజ్‌; సినిమాటోగ్రఫీ: కార్తిక్‌ ఘట్టమనేని; ఎడిటింగ్‌: సత్య.జి; నిర్మాత: యు.వి. కాన్సెప్ట్స్‌; రచన, దర్శకత్వం: అనిల్‌కుమార్‌ ఆళ్ల; విడుదల: 14-01-2023

సంక్రాంతికి అగ్ర తార‌ల హంగామాకి తోడు... ఓ చిన్న సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం కొన్నేళ్లుగా ఓ ఆనవాయితీగా మారింది.  పండ‌గ‌కి ఎన్ని సినిమాలొచ్చినా చూడ‌టానికి ప్రేక్ష‌కులు సిద్ధంగా ఉంటారు. అందుకే అగ్ర తార‌ల సినిమాల స్థాయిలోనే చిన్న సినిమాలూ విజ‌యాల్ని సొంతం చేసుకుంటుంటాయి. ఈసారి పండ‌గ‌కి విడుద‌లైన చిన్న సినిమా...  ‘క‌ళ్యాణం క‌మ‌నీయం’. యు.వి.కాన్సెప్ట్స్ సంస్థలో రూపొందడం... ప్ర‌చార చిత్రాలు ఆక‌ట్టుకోవ‌డంతో సినిమాపై ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి ఏర్ప‌డింది. (Kalyanam Kamaneeyam review) మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమా ఉందా?

క‌థేంటంటే: శివ (సంతోష్ శోభ‌న్‌) ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువ‌కుడు. ఉద్యోగం లేక ఇంట్లో రోజూ తండ్రితో చివాట్లు ప‌డుతుంటాడు.  మ‌రోవైపు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న శ్రుతి (ప్రియ భ‌వానీ శంక‌ర్‌)తో ప్రేమ‌లో ఉంటాడు.  ఇంట్లో పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఉద్యోగం చేసే భార్య‌, అవ‌స‌రాలు తీర్చే అత్త‌మామ‌లు... ఆరంభంలో జీవితం  అంతా సాఫీగానే సాగిపోతుంది. కానీ, ఆ త‌ర్వాతే అస‌లు క‌ష్టాలు మొద‌ల‌వుతాయి. ఉద్యోగం చేయాల్సిందేనని పట్టుబడుతుంది శ్రుతి. ప‌లు ప్ర‌య‌త్నాల త‌ర్వాత కూడా ఉద్యోగం రాక‌, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ఓ అబ‌ద్ధం ఆడతాడు. ఆ అబద్ధం ఎన్ని కష్టాలను తెచ్చింది? శ‌్రుతితో అత‌ని పెళ్లి జీవితం నిల‌బ‌డిందా లేదా?  శివ త‌న భార్య‌తో ఏ ప‌రిస్థితుల్లో అబ‌ద్ధం ఆడాల్సి వ‌చ్చింది? 

ఎలా ఉందంటే: శివ‌... శ్రుతిల పెళ్లి త‌ర్వాత క‌థ ఇది. వాళ్లిద్ద‌రి జీవితాల్లో ఎదురైన సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో సినిమా సాగుతుంది.  జీవితం క‌లిసొస్తే స్వ‌ర్గం, లేదంటే యుద్ధమే.  జీవితంలో ఎదుర‌య్యే ప్ర‌తి సంఘ‌ట‌న‌ని అనుభ‌వాలుగా స్వీక‌రించి ఒక‌రినొక‌రు అర్థం చేసుకుంటూ ముందుకు సాగితే ప్ర‌తి జంట ప్రయాణం ‘క‌ళ్యాణం క‌మ‌నీయమే’ (Kalyanam Kamaneeyam review) అని ద‌ర్శ‌కుడు  ఈ క‌థ‌తో చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. మంచి అంశ‌మే. పెళ్లి త‌ర్వాత మొద‌ల‌య్యే క‌థ‌లు తెర‌పైకి రావడం కూడా అరుదే. ఓ యువ జంట పెళ్లి జీవితం చుట్టూ సాగే ఈ క‌థని ఆస‌క్తిక‌రంగానే ఆరంభించాడు ద‌ర్శ‌కుడు. ‘నాన్నా నేను పెళ్లి చేసుకుంటా’న‌ని నిరుద్యోగైన క‌థానాయ‌కుడు తండ్రిని అడ‌గ‌డం, అత‌ను  ప్ర‌తిస్పందించే విధానంతో సినిమా స‌ర‌దాగా మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాతే ద‌ర్శ‌కుడు స‌రైన ప‌రిణ‌తిని ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు.  పాత్ర‌ల నిర్మాణంలోనే స‌మ‌స్య‌లు క‌నిపిస్తాయి.  క‌థ‌లోని  కీల‌క‌మైన మ‌లుపుల్లో  స‌రైన సంఘ‌ర్ష‌ణ లేకుండా  స‌న్నివేశాల్ని తీర్చిదిద్దడంతో సినిమా తేలిపోయింది.  క‌థ‌, క‌థ‌నాలు ఏమాత్రం ఆస‌క్తిని రేకెత్తించ‌వు.  భ‌ర్త ఒక‌ట్రెండు ఇంట‌ర్వ్యూల్లో ఫెయిల్ అవ్వ‌గానే ‘ఉద్యోగం రాలేదా’ అంటూ రెచ్చిపోయే క‌థానాయిక.. ప‌ట్ట‌ప‌గ‌లు రూ.10ల‌క్ష‌ల్ని రోడ్డుపై ఎవ‌రో లాక్కుపోతే ‘పోలీసులు ప‌ట్టించుకోలేద‌’ని ఆ విష‌యాన్ని అక్క‌డితో వ‌దిలేసే క‌థానాయ‌కుడు... ఇలా పాత్ర‌ల న‌డ‌వ‌డిక‌లోనే వాస్త‌విక‌త లోపించింది. (Kalyanam Kamaneeyam review) క‌థానాయ‌కుడు, అతడి స్నేహితుడి పాత్ర‌ల‌తో  అక్క‌డ‌క్క‌డా ఫ‌న్‌ని సృష్టించారు కానీ, కొన్నిచోట్ల మాత్రం ఆ స‌న్నివేశాలు మ‌రీ నాట‌కీయంగా అనిపిస్తాయి.  త‌ర్వాత ఏం జ‌రుగుతుందో అనే ఉత్సుక‌త‌ని రేకెత్తించ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యాడు. ప‌తాక స‌న్నివేశాలు  ప‌ర్వాలేద‌నిపిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: సంతోష్ శోభ‌న్‌, ప్రియ భవానీ శంక‌ర్ జోడీ శివ, శ్రుతి పాత్ర‌ల్లో ఒదిగిపోయే ప్ర‌య‌త్నం చేసింది.  కానీ పెళ్లి చేసుకున్న ఓ యువ‌ జంటకి త‌గ్గ‌ట్టుగా ఇద్ద‌రి మ‌ధ్య స‌న్నివేశాల్లో కెమిస్ట్రీ  అంత‌గా పండ‌లేదు.  స‌ద్దాంతో క‌లిసి క‌థానాయ‌కుడు అక్క‌డ‌క్క‌డా న‌వ్వించాడు. క‌థానాయిక‌ని వేధించే స‌హోద్యోగిగా  స‌త్యం రాజేష్ పాత్ర ప‌రిధి మేర‌కు న‌టించాడు. స‌ప్త‌గిరి క‌నిపించే స‌న్నివేశాలు న‌వ్విస్తాయి. దేవి ప్ర‌సాద్‌, కేదార్ శంక‌ర్‌, ప‌విత్ర లోకేశ్, రూపాల‌క్ష్మి  త‌దిత‌రులు నాయికా నాయ‌క‌ల త‌ల్లిదండ్రులుగా పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.  సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని  కెమెరాప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. ర‌వీంద‌ర్ క‌ళా ప్ర‌తిభ మెప్పిస్తుంది.  శ్రావ‌ణ్ భ‌ర‌ద్వాజ్ పాట‌ల‌పై ప్ర‌భావం చూపిస్తారు. ద‌ర్శ‌కుడు అనిల్ కుమార్ ఆళ్ళ ప్ర‌తిభ  మాట‌లు, కాన్సెప్ట్ వ‌ర‌కు మెప్పించినా...  క‌థ‌నాన్ని న‌డిపించ‌డంలోనూ, పాత్ర‌ల్ని మ‌ల‌చ‌డంతోనూ ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోయారు. నిర్మాణంలో నాణ్య‌త క‌నిపిస్తుంది. 

బ‌లాలు: 👍 కాన్సెప్ట్, ఛాయాగ్ర‌హ‌ణం 👍 అక్క‌డ‌క్క‌డా హాస్యం

బ‌ల‌హీన‌త‌లు: 👎 భావోద్వేగాలు కొర‌వ‌డటం, 👎 ఆస‌క్తి రేకెత్తించని క‌థ‌నం

చివ‌రిగా: క‌ళ్యాణం క‌మ‌నీయం... మెరుపుల్లేని పెళ్లి  క‌థ (Kalyanam Kamaneeyam review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు