Kamal Haasan: ‘భారతీయుడు 2’.. నేను అలా అనలేదు: కమల్‌ హాసన్‌ క్లారిటీ

‘భారతీయుడు 2’ గురించి తాను ఒకలా అంటే పలువురు నెటిజన్లు మరో విధంగా అర్థం చేసుకున్నారని నటుడు కమల్‌ హాసన్‌ అన్నారు. నెట్టింట జరిగిన చర్చపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

Published : 07 Jul 2024 13:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఇటీవల సింగపూర్‌ వెళ్లారు. అక్కడ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. తనకు ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) కంటే ‘భారతీయుడు 3’ (Bharateeydu 3) ఎక్కువగా నచ్చిందని చెప్పారు. కొందరు నెటిజన్లు ఆ కామెంట్లను మరోలా అర్థం చేసుకున్నారు. ‘భారతీయుడు 2’ (Indian 2) బాగోదేమో అంటూ నెట్టింట చర్చ మొదలుపెట్టారు. దీనిపై కమల్‌ స్పందించారు. చెన్నైలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ హీరోతోపాటు దర్శకుడు శంకర్‌ (Director Shankar), నటుడు సిద్ధార్థ్‌ (Siddharth) పాల్గొన్నారు.

కమల్‌ మాట్లాడుతూ.. ‘‘నేను చెప్పిన విషయాన్ని కొందరు మరో కోణంలో అర్థం చేసుకున్నారు. భారతీయుడు రెండో పార్ట్‌ కంటే మూడో పార్ట్‌ బాగా నచ్చిందని చెప్పా. అలా అని రెండో భాగం బాగోలేదని కాదు. సాంబారు, రసంతో కూడిన భోజనాన్ని ఇష్టంగా తింటాం. పాయసం ఉంటే మరింత ఆసక్తి చూపిస్తాం కదా. అలానే పలు అంశాల్లో భారతీయుడు మూడో భాగం నన్ను ఆకట్టుకుంది’’ అని క్లారిటీ ఇచ్చారు.

‘‘నా కెరీర్‌లో ‘భారతీయుడు 2’ కోసమే ఎక్కువ శ్రమించా. ఈ సినిమా కోసం ఆరేళ్లపాటు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. కొవిడ్‌/లాక్‌డౌన్‌, సెట్స్‌లో ప్రమాదం, అనారోగ్యం కారణంగా కొందరు నటులు మరణించడం.. ఇలా ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. సేనాపతి క్యారెక్టర్‌కు సంబంధించి వేసుకునే దుస్తులు నుంచి వాడే పెన్ను వరకు అన్నింటిలోనూ దర్శకుడు శంకర్‌ జాగ్రత్త తీసుకున్నారు’’ అని కమల్‌ తెలిపారు. హిట్‌ సినిమా ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా రూపొందడంతో ‘భారతీయుడు 2’పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అధునాతన టెక్నాలజీ సాయంతో దివంగత నటులు నెడుముడి వేణు, వివేక్‌ల రూపాలను ఈ సీక్వెల్స్‌లో చూపించనున్నారు. 3:04 గంటల రన్‌టైమ్‌తో ఈ నెల 12న విడుదల కానుంది. మరో ఆరు నెలల్లో పార్ట్‌ 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని