Kamal Haasan: అలా అనుకుని ఉంటే ఎప్పుడో రిటైరయ్యేవాణ్ని: కమల్‌

కమల్‌ హాసన్‌ పుట్టిన రోజు నేడు. 1954 నవంబరు 7న  జన్మించిన కమల్‌ సినీ ప్రయాణం ఎలా సాగిందంటే..?

Updated : 07 Nov 2022 13:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నటనంటే ఆయనే.. ఆయనే నటుడంటే’ అని కొన్ని కోట్లమంది ప్రేక్షకులతో అనిపించుకున్న నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan). ‘హే రామ్‌’ సినిమాతో కట్టిపడేసిన దర్శకుడు కమల్‌ హాసన్‌. ‘మత్తుగ.. మత్తుగ.. కొత్త బీటును కొట్టండ్రా’ అని ఉర్రూతలూగించిన గాయకుడు కమల్‌ హాసన్‌.. ఇలా ఒకటా రెండా కమల్‌ హాసన్‌లోని కోణాలెన్నో. ఆయన చేసిన ప్రయోగాలు ఇంకెన్నో. పదో తరగతి కూడా చదవని ఈ వ్యక్తి ప్రపంచమంతా గుర్తించే స్థాయికి ఎదిగారు. అలాంటి ‘లోకనాయకుడి’ ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది? నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తెలుసుకుందాం.. (Happy Birthday Kamal Haasan)

మరో నటి స్థానంలో..

కమల్‌ ఎప్పుడు, ఎక్కడ జన్మించారు? అనే వివరాలు తెలుసుకునే ముందు ఆయన నట ప్రయాణాన్ని చూద్దాం. మూడేన్నరేళ్ల వయసులో కమల్‌ ఓ పార్టీకి వెళ్లారు. అదే వేడుకలో ఉన్న ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఏవీఎం చెట్టియార్‌ దృష్టి కమల్‌పై పడింది. ‘ఈ బాలుడు ఎవరో చాలా బాగున్నాడు’ అనుకుంటూ వివరాలు తెలుసుకుని, తాను నిర్మించిన ‘కలాతూర్‌ కన్నమ్మ’ (తమిళం) అనే చిత్రంలో కమల్‌కు అవకాశం ఇచ్చారు. అలా చిన్నప్పుడే ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నిల్చొన్నారు కమల్‌. ఆయన పోషించిన పాత్రను డైసీ ఇరానీ (ప్రముఖ నటి.. బాల నటిగానూ విశేష గుర్తింపు పొందారు) నటించాల్సింది. కానీ, కమల్‌కు ఫిదా అయినా చెట్టియార్‌ ఆయన్నే ఎంపిక చేసుకున్నారు. ఆ పాత్రలో నటించినందుకు కమల్‌ అందుకున్న పారితోషికం రూ. 2 వేలు. ఆ రోజుల్లో అంతటి రెమ్యునరేషన్‌ అంటే చాలా గొప్ప. ‘మూడున్నరేళ్ల వయసు అంటే మాట్లాడటమే కష్టం. కానీ, నేను ‘ఎంత ఇస్తారు? నటిస్తున్నందుకు’ అని అడిగా అంటూ ఓ ఇంటర్వ్యూలో కమల్‌ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.

తొలి ప్రయత్నంలోనే జాతీయ అవార్డు

‘కలాతూర్‌ కన్నమ్మ’లోని సెల్వం అనే పాత్రతో ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు అందుకున్న కమల్‌ వరుస సినిమాలతో బిజీగా గడిపేవారు. అయినా పెద్దయ్యాక నటనవైపు వెళ్లాలని ఆయన అనుకోలేదు. క్లాసికల్‌ డ్యాన్స్‌, సంగీతంలో శిక్షణ తీసుకున్న కమల్‌ డ్యాన్స్‌ అసిస్టెంట్‌గా మళ్లీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఓ టెక్నిషియన్‌గా ఆయన పనిచేసిన తొలి చిత్రం ‘శ్రీమంతుడు’ (అక్కినేని నాగేశ్వరరావు హీరో). కమల్‌లోని నటుడిని చెట్టియార్‌ గుర్తిస్తే రచయితను కమల్‌ స్నేహితుడు ఆర్‌. సి. సత్యన్‌ గుర్తించారు. స్నేహితుడి ప్రోత్సాహంతో కమల్‌కు స్క్రీన్‌ప్లే రాయడంపై ఆసక్తి పెరిగింది. అటు కొరియోగ్రఫీ, ఇటు రైటింగ్‌ స్కిల్‌ ఉండటంతో ఆయన ఆ దారుల్లోనే నడవాలనుకున్నారు. మధ్యలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కావాలనుకున్నప్పుడు.. కమల్‌ను ఓ ఆడిషన్‌ ఆహ్వానించింది. అది ప్రముఖ దర్శకుడు కె. బాల చందర్‌ తీయబోతున్న సినిమా అని లొకేషన్‌కు వెళ్లాక కమల్‌కు అర్థమైంది. కమల్‌ను ఫొటో ఇవ్వమని అక్కడున్న వారు అడగ్గా ‘నేను యాక్టింగ్‌ చేయటానికి రాలేదు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అవకాశం లేదా?’ అని ప్రశ్నించారట. ‘సినిమా స్టూడియోలకు ఆటోలో వెళ్లాలనుందా, కారులో తిరగాలనుందా? నువ్వు ఎంత గొప్ప నటుడివి అవుతావో నాకు తెలుసు. డైరెక్షన్‌ ఎప్పుడైనా చేయొచ్చు. ముందు నటించు’ అని బాల చందర్‌.. కమల్‌ను యువనటుడిగా పరిచయం చేశారు. ‘అరంగేట్రం’తో ప్రారంభమైన ఈ కాంబినేషన్‌లో 35కిపైగా చిత్రాలొచ్చాయి.

హెచ్చుతగ్గులు లేని నటుడు..

‘హెచ్చుతగ్గులు కనిపించకుండా నటిస్తున్నాడు’ అని ఎంతోమంది కమల్‌ను ప్రశంసించారు. ‘16 వయదినిలే’, ‘మరో చరిత్ర’ చిత్రాలు కమల్‌ కెరీర్‌ను మార్చాయి. ‘16 వయదినిలే’లో అంద విహీనుడిగా, ‘అపూర్వ సహోదరర్గల్‌’లో మరగుజ్జుగా, ‘గుణ’లో అమాయకుడిగా, ‘ఆకలిరాజ్యం’లో నిరుద్యోగిగా.. ఇలా కమల్‌ చేసిన సాహసాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ‘నేను తెలుగులో నేరుగా కొన్ని సినిమాలే చేశా. కానీ, అవి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఓరకంగా చెప్పాలంటే నా తమిళ సినిమాలకంటే ఇవే రికార్డు సాధించాయి’ అని కమల్‌ చెప్పటం ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యారో తెలియజేస్తుంది. ‘భారతీయుడు’, ‘నాయకుడు’ వంటి పవర్‌ఫుల్‌ కథలతో మెప్పించిన కమల్‌ ‘స్వాతిముత్యం’, ‘సాగర సంగమం’ వంటి క్లాసిక్‌ చిత్రాలతోనూ తనదైన ముద్ర వేశారు. కమల్‌కు సినిమా అంటే ఎంత పిచ్చో, దాని కోసం ఎంతగా కష్టపడతారో.. ‘దశావతారం’ చూస్తే అర్థమవుతుంది. ‘విశ్వరూపం 2’ తర్వాత కొంత విరామం తీసుకున్న కమల్‌ ఈ ఏడాది వచ్చిన ‘విక్రమ్‌’ సినిమాతో మరోసారి తన సత్తా చాటారు. ప్రస్తుతం ‘ఇండియన్‌ 2’ చిత్రంతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత ‘విక్రమ్‌’ సిరీస్‌తో పాటు, మణిరత్నం దర్శకత్వంలోనూ కమల్‌ నటించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చేఏడాది ఈ కమల్‌-మణి కలిసి పనిచేయనున్నారు.

ఆ కల నెరవేరింది..

తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలి, ఫ్రెంచ్‌, ఆంగ్లం తదితర భాషలను అనర్గళంగా మాట్లాడ గలిగే కమల్‌ దర్శకుడవ్వాలనే తన కలను 1997లో నెరవేర్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చాచీ 420’. అది ఈయన హీరోగా నటించిన ‘అవ్వై షన్ముగి’ (తమిళం) సినిమాకి రీమేక్‌. ‘హేరామ్‌’, ‘విరుమాండి’, ‘విశ్వరూపం’ తదితర చిత్రాలు కమల్‌ దర్శకత్వ ప్రతిభకు ప్రతీకలు. నిర్మాత, గాయకుడు, వ్యాఖ్యాతగానూ కమల్‌ తన హవా కొనసాగించారు. వాటికే పరిమితంకాకుండా కెమెరా, సౌండింగ్‌, గ్రాఫిక్స్‌.. ఇలా ప్రతి విభాగంలోనూ పుంజుకున్న సాంకేతికతపైనా ఆయనకు పట్టుంది. స్వతహాగా హేతువాది అయిన కమల్‌ ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ అనే రాజకీయ పార్టీని నెలకొల్పిన సంగతి తెలిసిందే.

అందరూ లాయర్లే..

230కిపైగా చిత్రాల్లో నటించిన కమల్‌ది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం అని అనుకుంటే పొరపాటే. తన తండ్రి సహా బంధువుల్లో 12 మంది లాయర్లు. కమల్‌ 8వ తరగతిలోనే చదువుకు స్వస్తి పలికారు. కమల్‌ ఏం చేయాలనుకున్నా దానికి తన తండ్రి పార్థసారథి శ్రీనివాసన్‌ ఎప్పుడూ అడ్డుచెప్పేవారు కాదు. 1954 నవంబరు 7న తమిళనాడులోని పరమకుడి అనే గ్రామంలో జన్మించిన కమల్‌కు చారు హాసన్‌ (నటుడు, దర్శకుడు), చంద్రహాసన్‌ (నటుడు, నిర్మాత) సోదరులు. కమల్‌ కుమార్తెలు శ్రుతి హాసన్‌, అక్షర హాసన్‌లు కథానాయికలుగా రాణిస్తున్నారు.

కమల్‌ అంతరంగం ఇదీ..

పద్మశ్రీ, పద్మ భూషణ్‌ కమల్‌ హాసన్‌.. ‘‘ప్రతి మనిషిలో ఓ హీరో, ఓ విలన్‌ ఉంటారు. ఏం జరిగినా విలన్‌ను బయటకు తీసుకురాకుండా చేయటమే అసలైన జీవితం. ఇతిహాసాల్లోనూ మంచీ చెడూ ఉన్నాయి. అది చూసే వారి దృష్టిని బట్టి ఉంటుంది. ఇన్నేళ్ల నా ప్రయాణంలో ‘చేసింది చాలు.. ఇకపై సినిమాలు ఆపేద్దాం’ అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే నేను నటనను ప్రొఫెషన్‌గా భావించలేదు. అలా అనుకుని ఉంటే ఎప్పుడో రిటైర్‌ అయ్యేవాణ్ని. యాక్టింగ్‌ నా ప్యాషన్‌. అందుకే ఇంకా కొనసాగుతున్నా. నేను పనిని ప్రేమిస్తా. హాలీడే ట్రిప్‌లా ఎంజాయ్‌ చేస్తా. కొంతమంది విహార యాత్రకు వెళ్లిన సమయంలో ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కొండలు ఎక్కుతారు.. స్విమ్మింగ్‌ చేస్తారు. అదే తమ పని విషయానికొస్తే బద్ధకంగా ఉంటారు. లోపం ఎక్కడుందో గ్రహించుకోవాలి. పనిని ప్రేమిస్తే విజయం తప్పక వరిస్తుంది’’ అని చెబుతుంటారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని