Indian 2: ‘భారతీయుడు2’ సెన్సార్‌ పూర్తి.. రన్‌టైమ్‌ ఎంతంటే?

‘భారతీయుడు 2’ సెన్సార్‌ పూర్తిచేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్‌ వచ్చినట్లు చిత్రబృందం తెలిపింది.

Updated : 05 Jul 2024 09:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భారతీయుడు 2’ (Indian 2). వీళ్లిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన హిట్‌ సినిమా ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా ఇది రానుంది. తాజాగా ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. కొన్ని సూచనలు ఇస్తూ సెన్సార్‌ బోర్డు దీనికి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. ‘భారతీయుడు 2’ రన్‌టైమ్‌ ఏకంగా 3.04 గంటలు ఉంది. కొన్ని సన్నివేశాల్లో ఉపయోగించిన పదాలను మ్యూట్ చేయాలని సెన్సార్‌ బోర్డ్‌ చిత్రబృందాన్ని సూచించింది. ఇంత నిడివి ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే అందుకు తగిన కథ, కథనాలు ఉండాలి. అయితే శంకర్‌ ఈ విషయంలో పూర్తి విశ్వాసంతో ఉన్నారు. దీని గురించి ఆయన ఇటీవల మాట్లాడుతూ అన్ని సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయన్నారు. జులై 12న ఈ సినిమా విడుదల కానుంది.

అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్‌పై స్పందించిన నాగ్‌ అశ్విన్‌

ఇటీవల వచ్చిన ‘యానిమల్‌’, ‘సలార్‌’, ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాలు మూడు గంటలకు పైగా రన్‌టైమ్‌తో విడుదలయ్యాయి. ఇప్పుడు వీటి జాబితాలో కమల్‌ హాసన్ ‘భారతీయుడు 2’ చేరింది. ఆ సినిమాలన్నీ విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పటికే ‘భారతీయుడు 2’పై భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా మంచి వసూళ్లు సాధించడం ఖాయమని సినీప్రియులు అభిప్రాయపడుతున్నారు.  ‘భారతీయుడు’ 1996లో శంకర్‌ దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించింది. సేనాపతి పాత్రలో కమల్‌ (Kamal Haasan) ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని