Kamal Haasan: రజనీకాంత్‌ హీరోగా కమల్‌ హాసన్‌ సినిమా.. ఆసక్తిగా ఉన్న అభిమానులు

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా దీని గురించి కమల్‌ హాసన్‌ మాట్లాడారు.

Published : 30 May 2023 17:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రజనీకాంత్‌ - కమల్‌ హాసన్‌ (Kamal Haasan) వీళ్లిద్దరూ సినీ ఇండస్ట్రీలో ఎందరికో ఆదర్శం. ఒకరేమో తన స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. మరొకరేమో విభిన్నమైన పాత్రలు చేస్తూ మల్టీ టాలెంటెడ్‌ అని నిరూపించుకున్నారు. వీళ్లిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే అభిమానులే కాదు ప్రేక్షకులంతా ఎదురుచూస్తారు. కాకపోతే చిన్న మార్పు.. వీళ్లిద్దరూ హీరోలుగా కాదు ఒకరు హీరోగా మరొకరు నిర్మాతగా ఒక సినిమా రానుంది. 

ఇటీవల జరిగిన ఓ వేడుకలో కమల్‌ హాసన్‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడారు. ‘మీరు రజనీకాంత్‌ సినిమాను నిర్మించనున్నారట నిజమేనా’ అని కమల్‌ హాసన్‌ను అడగ్గా.. అవునంటూ సమాధానం చెప్పారు. ప్రస్తుతం అది చర్చల దశలో ఉంది అని అన్నారు. ఇక రజనీకాంత్‌ (Rajinikanth) ప్రముఖ దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌తో ఓ సినిమా తీయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ కన్ఫామ్‌ అయిపోయింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమానే కమల్‌ హాసన్‌ నిర్మించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇక రజనీకాంత్‌ త్వరలోనే ‘జైలర్‌’(Jailer)తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. దీని తర్వాత ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వంలో ‘లాల్‌ సలాం’ (Lal Salaam)లో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఈ రెండు చిత్రాల తర్వాత లోకేశ్‌ కనకరాజ్‌ (Lokesh Kangaraj) చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది.

మరోవైపు కమల్‌ హాసన్‌ కూడా ‘ఇండియన్‌2’ (Indian 2) తో బిజీగా ఉన్నారు. శంకర్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత మణిరత్నం దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ‘KH234’గా ఇది ప్రచారంలో ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత రజనీకాంత్‌తో ప్రాజక్ట్‌ పనులు చూడనున్నారు. ఏదేమైనా సినీ ప్రియులు మాత్రం వీళ్లిద్దరి సినిమాలతో పాటు వీళ్ల కాంబోలో రానున్న చిత్రంపై కూడా ఆసక్తిగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని