Bharateeyudu 2 Pre Release Event: జనాల గురించే ‘భారతీయుడు 2’ మాట్లాడుతుంది.. కమల్‌ హాసన్‌

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌, అగ్ర దర్శకుడు శంకర్‌ కాంబోలో భారతీయుడు 2 (Bharateeyudu 2) రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. 

Updated : 08 Jul 2024 07:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- అగ్ర దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన హిట్‌ చిత్రం ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా భారతీయుడు-2 (bharateeyudu 2) రూపుదిద్దుకుంటోంది. లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం జులై 12న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘‘నేను చెప్పాల్సిన మాటలన్నీ నా వాయిస్‌లో బ్రహ్మానందం చెప్పేశారు. 52 ఏళ్ల క్రితం టెక్నీషియన్‌గా నా ప్రయాణం మొదలైంది. ఇన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మూడు తరాలుగా నన్ను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. భారతీయుడు రిలీజ్ అయినప్పుడు ఈ సీక్వెల్ గురించి ఆలోచించలేదు. ఆ చిత్రం భారీ హిట్ అయింది. డబ్బులు వస్తాయా? అని అందరూ అన్నారు. కానీ ఇప్పుడు ఒక షెడ్యూల్‌కి పెట్టే ఖర్చే చాలా ఎక్కువగా ఉంది. శంకర్ గారి విజన్ చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇప్పుడు ఇండియాలో తెలుగు సినిమాకు గొప్పస్థానం ఉంది. నా జీవితంలోనూ ఈ భాషతో ఎంతో అనుబంధం ఉంది. మరో చరిత్ర, స్వాతిముత్యం, సాగర సంగమం వంటివి గొప్ప చిత్రాల్లో నటించాను. బాలచందర్, విశ్వనాథ్ వంటి వారు భాషాభేదాలను తుడిచిపారేశారు. భారతీయుడు 2 ఇప్పటి తరానికి సరిపోయేవిధంగా ఉంటుంది. జనాల గురించే ఈ చిత్రం మాట్లాడుతుంది. ఇది ప్రజల సినిమా. 28 ఏళ్ల తరువాత మళ్లీ అదే దర్శకుడు, అదే పాత్ర నాకు రావడం అదృష్టం. ఇన్నేళ్లు నన్ను స్టార్‌గా నిలబెట్టారు. ఈ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను. ప్రతిభను పట్టుకొచ్చి అందరికీ పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. సినిమానే మీ అందరితో మాట్లాడుతుంది. ఈ మూవీ సెట్‌లో కమల్ హాసన్ ఎక్కడా కనిపించలేదు. నాలో సేనాపతి వచ్చాడు. ఈ చిత్రం జులై 12న రాబోతోంది. అందరూ చూడండి. ఈ మూవీకి నేను అభిమానిని. చిత్రాన్ని పెద్ద హిట్ చేయండి. మంచి క్వాలిటీతో సినిమాను తీశాం. ఈ చిత్రానికి ఆరుగురు టాప్ స్టంట్ మాస్టర్స్ పని చేశారు. ఏసియన్ సురేష్, శ్రీలక్ష్మీ మూవీస్ మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. జూలై 12 కోసం నేను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను’’ అని కమల్‌ హాసన్‌ అన్నారు.

సెట్‌లో కమల్‌ను చూసి గూస్‌బంప్స్ వచ్చాయి: శంకర్‌

డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘భారతీయుడు తరువాత చాలా సినిమాలు తీశాను. లంచం తీసుకునే వార్తలు చూస్తూనే ఉంటున్నాను. ఆ వార్తలు చూసినప్పుడల్లా నాకు సేనాపతి గుర్తుకు వస్తుంటాడు. కానీ స్టోరీ సెట్ అవ్వలేదు. రోబో 2.ఓ తరువాత నాకు స్టోరీ సెట్ అయింది. ఆ కథను కమల్ సర్‌కి చెప్పాను. ఆయనకు కూడా బాగా నచ్చింది. భారతీయుడు సినిమాకు గెటప్ కోసం తోట తరణి గారికి కమల్ హాసన్ గారి ఫాదర్, బ్రదర్స్ ఫోటోలన్నీ ఇచ్చాను. ఆయనిచ్చిన లుక్ చూసి షాక్ అయ్యాను. భారతీయుడు 2 సినిమా సెట్‌లోకి సేనాపతిగా కమల్ హాసన్ గారిని చూసి నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. ఆడియెన్స్‌కి కూడా అలాంటి అనుభూతే వస్తుంది. నేను రాసిన దాని కంటే.. ఆయన నటించిన తరువాత ఆ సీన్ స్థాయి పదింతలు పెరుగుతుంది. అలాంటి నటులు దొరకడం అదృష్టం. రోప్‌ మీద ప్రోస్థటిక్ మేకప్‌తో నాలుగు రోజులు షూట్ చేశాం. ఆయనలా నటించే వారు ఈ ప్రపంచంలోనే లేరు.

ఈ చిత్రంలో సిద్దార్థ్‌ అద్భుతంగా నటించాడు. సిద్దార్థ్‌ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది. రకుల్ ప్రతీ సీన్‌ను తెలుసుకుని, అర్థం చేసుకుని నటించింది. ఎస్ జే సూర్య ఎంత నటించినా సంతృప్తి అవ్వరు. బాబీ సింహా గారు ప్రాణం పెట్టి నటించారు. సముద్రఖని గారి వాయిస్ నాకు చాలా ఇష్టం. ఆయనలో ఓ డిగ్నిటీ కనిపిస్తుంటుంది. నేను బ్రహ్మానందం గారికి అభిమానిని. ఇందులో కేమియో రోల్‌లో కనిపిస్తారు. అడగ్గానే చేశారు. గేమ్ చేంజర్‌లోనూ ఓ చిన్నకేమియోలో కనిపిస్తారు. కాజల్ పార్ట్ 3లో కనిపిస్తారు. నేను వంద శాతం సంతృప్తి అయ్యేవరకు అనిరుధ్‌ ట్యూన్లు ఇస్తూనే ఉంటారు. ముత్తు రాజ్ అద్భుతమైన సెట్స్ వేశారు. శ్రీకర్ ప్రసాద్ గారితో మొదటి సారిగా పని చేశాను. సీన్‌లోని ఆత్మ పోకుండా కట్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా వచ్చాయి. తెలుగులో పాటలు అనుకున్నదాని కంటే బాగా ఇచ్చారు. నేను అనుకున్నది అనుకున్నట్టుగా తీసేలా సహకారం అందించిన లైకా సుభాస్కరణ్, రెడ్ జెయింట్‌లకు థాంక్స్. ఇంత వరకు నేను తెలుగులో నేరుగా ఒక్క సినిమా చేయలేదు. ఏఎం రత్నం వల్లే నా సినిమాలన్నీ ఇక్కడకు వచ్చాయి. ఇక్కడ నన్ను ఎంతో ఆదరించారు. ఇక్కడి ఆడియెన్స్ కోసం ఒక తెలుగు సినిమాను చేయాలని అనుకున్నాను. అదే గేమ్ చేంజర్. ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ పోర్షన్ అయిపోయింది. రామ్ చరణ్‌ది ఎక్స్‌లెంట్ స్క్రీన్ ప్రజెన్స్. ఆయనలో ఒక కంట్రోల్డ్ పవర్ ఉంటుంది. ఎప్పుడు బ్లాస్ట్ అవుతుందా? అని అనిపిస్తుంది. గేమ్ చేంజర్ సినిమా చూస్తే మీకు అది తెలుస్తుంది’ అని అన్నారు.

ఎస్‌.జె.సూర్య మాట్లాడుతూ ఎప్పుడెప్పుడు సినిమా వస్తే చూద్దామా? అనే ఆత్రుతలో అందరూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. భారతీయుడు 2, గేమ్ చేంజర్, భారతీయుడు 3లో నటించాను. నాకు ఎంతో అదృష్టం ఉందనిపిస్తుందన్నారు. హీరో సిద్దార్థ్ మాట్లాడుతూ.. ‘‘20 ఏళ్ల క్రితం బాయ్స్ సినిమా ఆడియో లాంచ్ కోసం హైదరబాద్‌కు వచ్చాను. ప్రతీ యూత్‌కి బాయ్స్ సినిమా నచ్చుతుందని నన్ను హీరోగా పెట్టి శంకర్ గారు ఈ సినిమా తీశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ప్రతీ భారతీయుడికి ఈ ‘భారతీయుడు 2’ నచ్చుతుందని నన్ను మళ్లీ హీరోగా తీసుకొచ్చారు. ఇంత వరకు నేను ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా నాకు ఇష్టమైన హీరో ఎవరంటే కమల్ హాసన్ అని చెబుతూనే వచ్చాను. శంకర్ గారిని తెలుగు దర్శకుడే అని ఇక్కడి ప్రేక్షకులు భావిస్తుంటారు’’ అని అన్నారు. 

రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. శంకర్ గారు, కమల్ హాసన్ గారి సినిమాలో నటించడం గర్వంగా ఉంది. సిద్దార్థ్ అద్భుతమైన నటుడు. ఆయనతో మళ్లీ నటించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘‘నేను చదువుకునే రోజుల నుంచీ కమల్ హాసన్ గారిని చూస్తున్నాను. ఆయన శరీరంలోని ప్రతీ అణువణువు నటిస్తుంది. ఎంత కావాలో అంతే నటించగలిగే సత్తా ఉన్న నటులు. తాజ్ మహల్‌ను చూస్తే ఎంత అందంగా ఉందో అని అంటాం.. అలానే కమల్ హాసన్ గారు మన ముందుంటే.. ఆయన గొప్ప నటులు అని అనాల్సిందే. కమల్ హాసన్ గారు తన జీవితాన్ని సినిమాలకే అంకితం చేశారు. ఆర్టిస్టుల నుంచి ఎంత నటన కావాలో రాబట్టుకునే దర్శకుడు శంకర్. కమల్ హాసన్ గారి సమకాలీకుడనని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతుంటాను’’ అని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు