Kangana: ‘బ్రహ్మాస్త్ర’ దర్శకుడిని మెచ్చుకున్న వారందర్నీ జైల్లో పెట్టాలి

భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో రూపుదిద్దుకున్న ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) టీమ్‌పై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) వ్యంగ్యాస్త్రాలు విసిరారు.....

Updated : 29 Jun 2023 16:44 IST

చిత్రబృందంపై కంగన కామెంట్స్‌

ముంబయి: భారీ బడ్జెట్‌తో బాలీవుడ్‌లో రూపుదిద్దుకున్న ‘బ్రహ్మాస్త్ర’ (Brahmastra) టీమ్‌పై నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ చిత్రదర్శకుడు అయాన్‌ ముఖర్జీని (Ayan Mukerji) మేధావి అంటూ మెచ్చుకున్న వారందర్నీ జైల్లో పెట్టాలని అన్నారు. ‘బ్రహ్మాస్త్ర’ తెరకెక్కించడంలో ఆయన విఫలమయ్యాడని.. సినిమా అసలేం బాలేదని పేర్కొంటూ ఈ చిత్రానికి పలు మీడియా సంస్థలు ఇచ్చిన రేటింగ్స్‌ని ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

‘‘అయాన్‌ ముఖర్జీని జీనియస్‌ అంటూ మెచ్చుకున్న వారందర్నీ జైలులో పెట్టాలి. ‘బ్రహ్మాస్త్ర’ తెరకెక్కించడానికి అతడికి 12 ఏళ్లు పట్టింది. 12 మంది సినిమాటోగ్రాఫర్లను, 85 మంది అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ని మార్చాడు. ప్రొడక్షన్‌ ఖర్చుల రూపంలో రూ.600 కోట్లను కాల్చి బూడిద చేశాడు. ఇలాంటి వ్యక్తిని మేధావి అని పిలవడం హాస్యాస్పదంగా ఉంది. ఇక, కరణ్‌ జోహార్‌ తన సినిమా స్క్రిప్ట్‌లపై కంటే ఇతరుల శృంగార జీవితాలపైనే ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటాడు. రివ్యూలు, రేటింగ్స్‌, కలెక్షన్స్‌ వివరాలు.. ఇలా ప్రతిదాన్నీ డబ్బుతో కొనుగోలు చేసి తన సినిమాలకు ఇప్పించుకుంటాడు. ఈసారి అయితే దక్షిణాది వారి దృష్టి సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తాను తెరకెక్కించే సినిమాలో మంచి కథ, కథనం, టాలెంట్‌ ఉన్న నటీనటులను పెట్టుకోవడం మానేసి తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేయాలని దక్షిణాది నటీనటులు, దర్శకులు, రచయితల్ని  కోరుకున్నాడు. ఇలా అక్కడి వారిని కోరుకునే బదులు మంచి టాలెంట్‌తో సినిమాలు చేస్తే సరిపోతుంది కదా’’ అని కంగన రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని