Kangana:షారుఖ్‌తో ప్రియాంక క్లోజ్‌గా ఉండటం కరణ్ తట్టుకోలేకపోయాడు: కంగన సంచలన ఆరోపణలు

నటి ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) కు మద్దతు తెలిపారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut). బాలీవుడ్‌లోని పలువురు వ్యక్తులు ప్రియాంకను మానసికంగా వేధింపులకు గురి చేశారని ఆమె ఆరోపించారు.

Updated : 29 Mar 2023 10:45 IST

ముంబయి: బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌జోహార్‌ (Karan Johar)పై నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) సంచలన ఆరోపణలు చేసింది. తన స్నేహితురాలు, నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ను కరణ్‌ జోహార్ బ్యాన్‌ చేశాడని ఆమె ఆరోపించింది. నటుడు షారుఖ్‌తో ప్రియాంక క్లోజ్‌గా ఉండటం ఆయన తట్టుకోలేకపోయాడని.. అందుకే ఆమెను మానసికంగా వేధించాడని వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లలో రాసుకొచ్చింది. బాలీవుడ్‌ పరిశ్రమపై ప్రియాంక తాజాగా చేసిన సంచలన కామెంట్స్‌పై స్పందిస్తూ కంగన ఈ ఆరోపణలు చేసింది.

ప్రియాంకను వేధించారు..! 

‘‘బాలీవుడ్‌ గురించి ప్రియాంక ఇదే చెప్పాలనుకుంది. పరిశ్రమలోని కొందరు గ్యాంగ్‌గా మారి ఆమెను అవమానించారు. ఆమె పరిశ్రమ నుంచి పారిపోయేలా చేశారు. స్వయంకృషితో ఎదిగిన మహిళను భారత్‌ వదిలి వెళ్లిపోయేలా చేశారు. కరణ్‌ జోహార్‌ ఆమెను బ్యాన్‌ చేశాడనే విషయం అందరికీ తెలుసు. షారుఖ్‌తో ప్రియాంక స్నేహం చేయడం కరణ్‌కు నచ్చలేదు. దాంతో కరణ్‌తో ఆమెకు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ విషయంపై అప్పట్లో మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. వీలైనంతవరకూ బయటవాళ్లకు (ఎలాంటి సినీ నేపథ్యంలో లేకుండా ఇండస్ట్రీకి వచ్చేవారు) హాని కలిగించేందుకు ఎదురుచూసే మూవీ మాఫియాకు ప్రియాంక దొరికింది. ఆమె దేశం వదిలి వెళ్లిపోయే వరకు వేధించారు. సినీ పరిశ్రమ వాతావరణాన్ని, సంస్కృతిని నాశనం చేసినందుకు  ఆ వ్యక్తి (కరణ్‌ను ఉద్దేశిస్తూ) బాధ్యత వహించాలి. అమితాబ్‌బచ్చన్‌, షారుక్‌ వంటివారు సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు అస్సలు లేవు’’ అని కంగన (Kangana Ranaut) వివరించారు.

ప్రియాంక ఏం చెప్పిందంటే..

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించి ఉన్నట్టుండి హాలీవుడ్‌కు వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా (Priyanka Chopra) తాజాగా ఓ అమెరికన్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆమె బాలీవుడ్‌కు దూరం కావడంపై సంచలన ఆరోపణలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువని, వాటిని తట్టుకోలేకే తాను హాలీవుడ్‌కు వచ్చేశానని అన్నారు. తాను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు అంతటా వైరల్‌గా మారాయి. కంగన, వివేక్‌ అగ్నిహోత్రి వంటి సినీ ప్రముఖులు ఆమెకు సపోర్ట్‌ చేస్తుంటే మరికొంతమంది మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు. ప్రియాంక కావాలనే.. బాధితురాలినని చెబుతూ అందరి మన్ననలు పొందాలని చూస్తున్నారని కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రియాంక వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని