Kangana Ranaut: వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల దాదాపు రూ.40కోట్లు పోయాయి: కంగనా

Kangana Ranaut: తన వ్యాఖ్యలు, అభిప్రాయాల వల్ల వివిధ ప్రకటనలను చేసే అవకాశాన్ని కోల్పోయినట్లు సినీ నటి కంగనా రనౌత్‌ అన్నారు.

Updated : 17 May 2023 17:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తనదైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut). తన సహజ వ్యక్తిత్వం, వ్యాఖ్యల వల్ల దాదాపు రూ.30 నుంచి 40 కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోయినట్లు ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా కొందరు రాజకీయ నాయకులు, దేశ వ్యతిరేక శక్తులపై వ్యతిరేక స్వరాన్ని వినిపించడం వల్ల ప్రకటనల్లో నటించే అవకాశం లేకుండా చేశారని ఆరోపించారు. ఈ క్రమంలో 20-25 ప్రకటనలు తాను కోల్పోయినట్లు తెలిపారు. ‘నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అదే చెబుతాను. ఒకవేళ దాని వల్ల డబ్బు కోల్పోతే అలాగే జరగనీయండి’ అంటూ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ తాజాగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలను ఉద్దేశించి ఇన్‌స్టా వేదిక కంగన పోస్ట్‌ పెట్టారు.

‘‘ఇదే నిజమైన వ్యక్తిత్వం. నిజమైన స్వేచ్ఛ, విజయం. హిందూయిజం గురించి అనుకూలంగా మాట్లాడటం, కొందరు రాజకీయ నాయకులను విమర్శించటం, దేశవ్యతిరేక శక్తులపై గళమెత్తడం వల్ల 20-25 ప్రకటనల్లో నటించే అవకాశాన్ని నేను కోల్పోయా. రాత్రికి రాత్రే కొందరు ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. వీటి ద్వారా ఏడాదికి రూ.30-40 కోట్ల ఆదాయం వచ్చేది. కానీ, ఇప్పుడు నేను స్వేచ్ఛ జీవిని. నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఎవరూ ఆపలేరు. అలాగని పనిగట్టుకుని ఒక అజెండా పెట్టుకుని మాట్లాడతానని కాదు. భారతదేశ సంస్కృతి, సమగ్రతను వ్యతిరేకించే బహుళజాతి సంస్థల అధినేతలపై కచ్చితంగా మాట్లాడతా. ఈ విషయంలో ఎలన్‌ మస్క్‌ను అభినందించకుండా ఉండలేను. ప్రతి ఒక్కరూ తమ బలహీనతలను ప్రదర్శిస్తారు. కనీసం ధనవంతులైనా డబ్బు గురించి ఆలోచించకూడదు’’ అని కంగనా రనౌత్‌ (Kangana Ranaut) అన్నారు. 

2020 జులైలో కంగనా రనౌత్‌ ట్వీట్‌ చేస్తూ మహారాష్ట్రలో పరిస్థితి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత జేఎన్‌యూ విద్యార్థులకు మద్దతుగా దీపిక పదుకొణె నిలవడంపైనా కంగనా విమర్శలు గుప్పించారు. ‘తుక్డే గ్యాంగ్‌’కు  మద్దతు తెలిపారంటూ వ్యాఖ్యానించారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కంగనా ట్విటర్‌ ఖాతాను ఆ సంస్థ నిలిపివేసింది. ఇటీవలే మళ్లీ పునరుద్ధరించింది. ప్రస్తుతం కంగనా ‘ఎమర్జెన్సీ’ (Emergency) చిత్రంలో నటిస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో ఆమె కనిపించనున్నారు. అనుపమ్‌ఖేర్‌, సతీష్‌ కౌశిక్‌, మిలింద్‌ సోమన్‌ కీలక పాత్రధారులు. ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కంగనా రనౌత్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు