Kangana Ranaut: రాజమౌళి సర్‌ను ఏమైనా అంటే ఊరుకునేది లేదు: కంగనా రనౌత్‌

Kangana Ranaut: అగ్ర దర్శకుడు రాజమౌళిపై సోషల్‌మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ఖండించారు. రాజమౌళి జాతీయవాదిగా, యోగిగా అభివర్ణించారు. ఆయనపై విమర్శలు చేయటం ఇకనైనా మానుకోవాలని హెచ్చరించారు.

Updated : 18 Feb 2023 16:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (Rajamouli) గురించి సోషల్‌మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) మండిపడ్డారు. ఆయనను ఏమైనా అంటే ఊరుకునేది లేదని అన్నారు. రాజమౌళి వర్షంలోనూ కణకణ మండే అగ్నిలాంటివారని ప్రశంసించారు. అంతేకాదు, రాజమౌళిని జాతీయవాది అన్న ఆమె, ఆయనను ఒక యోగిగా అభివర్ణించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘బాహుబలి’తో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తం చేసిన, రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్’తో మరింత ఇనుమడింపజేశారు. అంతేకాదు, చాలా సంవత్సరాల తర్వాత భారతీయ సినిమా ‘ఆస్కార్‌’ రేసులో నిలిచేలా చేశారు. ఈ క్రమంలో పలు ఆంగ్ల పత్రికలు, మ్యాగజైన్‌లకు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇందులో భాగంగా ‘ది న్యూయార్కర్‌’ మ్యాగజైన్‌తో ఆయన మాట్లాడుతూ.. ‘‘మాది చాలా పెద్ద కుటుంబం. అందరూ మత విశ్వాసాలను నమ్ముతారు. నా బాల్యంలో హిందూ దేవతల కథలు చదువుతుంటే అనేక సందేహాలు వచ్చేవి. అవన్నీ నిజం కావేమోనని అనుకునేవాడిని. మా కుటుంబ సభ్యులు అనుసరించే ధార్మిక మార్గంలో నేనూ నడిచా. ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, తీర్థయాత్రలు చేయటం, కాషాయం ధరించి సన్యాసిలా జీవించా. కొందరు స్నేహితుల వల్ల క్రైస్తవ మతాన్ని కూడా అనుసరించా. బైబిల్‌ చదివా. చర్చికి వెళ్లా. ఇవన్నీ చూసిన తర్వాత ‘స్వలాభం కోసమే మతం’ అన్న విషయం అర్థమైంది. నా కజిన్‌ ద్వారా అయాన్‌ రాండ్‌ ‘ది ఫౌంటెన్‌ హెడ్‌’, ‘అట్లాస్‌ ష్రగ్డ్‌’ చదివాను. వాటి నుంచి ఎంతో స్ఫూర్తి పొందా. ఆమె నిగూఢమైన ఫిలాసఫీ నాకు అర్థం కాలేదు కానీ, అందులోని ప్రాథమిక విషయాలు అర్థమయ్యాయి. అప్పటి నుంచి మతానికి దూరంగా జరుగుతూ వచ్చా. కానీ, మన ఇతిహాసలైన రామాయణ, మహాభారతాలపై ప్రేమను ఏ మాత్రం కోల్పోలేదు. వాటిని మతవిశ్వాసాల కోణం నుంచి చూడటం మానేసి,  గొప్ప కథలుగా ఆవిష్కరించిన తీరును ఆకళింపు చేసుకున్నా’’ అని అన్నారు.

సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌.. కంగనా ఫైర్‌..

మతంపై రాజమౌళి అభిప్రాయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు విమర్శలు చేయటం మొదలు పెట్టారు. ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన ఎన్నో విషయాలను పక్కన పెట్టి, దీన్ని పట్టుకుని హైలైట్‌ చేయటం మొదలు పెట్టడంతో రాజమౌళికి సపోర్ట్‌ చేస్తూ కంగనా వరుస ట్వీట్లు చేశారు. ‘‘మరీ అంత అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. దేవుడు ప్రతి చోటా ఉన్నాడు. మాటల కన్నా చేతలే కనిపించాలి. మేము అందరి కోసం సినిమాలు చేస్తాం. నటులు కావడం వల్లే ప్రతి ఒక్కరూ మాపై దాడి చేసేందుకు చూస్తారు. మాకు ఎవరి సాయం ఉండదు. మాకు మేమే సాయం చేసుకోవాలి. అండగా నిలవాలి. రాజమౌళి సర్‌ని ఎవరైనా ఏమైనా ఉంటే ఊరుకోను. ఆయన వర్షంలో మండే నిప్పు. ఒక జీనియస్‌. జాతీయవాది. యోగి. రాజమౌళిలాంటి వ్యక్తి మనకు ఉండటం మనం చేసుకున్న అదృష్టం’’

‘‘ఈ ప్రపంచం రాజమౌళిని వివాదాస్పద వ్యక్తిగా ముద్రవేస్తోంది ఎందుకు?ఆయన సృష్టించిన వివాదం ఏంటి? ‘బాహుబలి’తో మన ఖ్యాతిని పెంచడమా? దేశం గర్వించే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తీయడమా?అంతర్జాతీయ వేదికలపై ధోతి ధరించడమా? చెప్పండి . ఆయన ఎందుకు వివాదాస్పద వ్యక్తి అయ్యారు? దేశాన్ని ప్రేమించి, ప్రాంతీయ సినిమాను ప్రపంచవ్యాప్తం చేయడమేనా ఆయన చేసిన వివాదం. దేశం పట్ల ఆయన ఎంతో అంకితభావంతో ఉన్నారు. ఇందుకేనా ఆయన్ను వివాదాస్పదుడిని చేస్తున్నారు. రాజమౌళి చిత్తశుద్ధిని, వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడానికి మీకెంత ధైర్యం. అందరూ సిగ్గు పడాలి’’ అంటూ కంగనా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ వరుస ట్వీట్‌లు చేశారు.

ఎన్టీఆర్‌ (NTR), రామ్‌చరణ్‌ (Ram charan) కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌ బస్టర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) హాలీవుడ్‌ప్రేక్షకులను సైతం మెప్పించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్‌ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా 95వ ఆస్కార్‌ పురస్కారాల రేసులో నిలిచింది. ఈ సినిమాలో ‘నాటు నాటు’ పాట ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో నామినేషన్‌ దక్కించుకుంది. అంతకన్నా ముందే ప్రతిష్టాత్మక గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సొంతం చేసుకుంది. కీరవాణి ఈ సినిమాకు స్వరకర్త.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని