డబ్బు కోసమే సినిమా చేశా: కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తాజాగా కొన్ని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఆమె కథానాయికగా నటించిన ‘క్వీన్‌’ విడుదలై నేటితో ఏడేళ్లు అవుతున్న సందర్భంగా కంగన..

Published : 07 Mar 2021 23:31 IST

లాస్‌ ఏంజెల్స్‌లో చిన్న ఇల్లు కొనుగోలు చేశా..!

ముంబయి: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తాజాగా కొన్ని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఆమె కథానాయికగా నటించిన ‘క్వీన్‌’ విడుదలై నేటితో ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కంగన.. తన కెరీర్‌కు సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను బయటపెట్టారు. ‘క్వీన్‌’కి సంతకం చేసినప్పుడు ఆ సినిమా విడుదలవుతుందనే నమ్మకం తనకు లేదని ఆమె తెలిపారు. ‘‘పదేళ్ల నిరంతర శ్రమ తర్వాత ఒక మంచి నటిగా, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్నా. అయితే, ఏడేళ్ల క్రితం ‘క్వీన్‌’ ఆఫర్‌ వచ్చినప్పుడు.. ఆ సినిమా అస్సలు రిలీజ్ కాదనుకున్నా. కేవలం డబ్బు కోసమే ఆ ప్రాజెక్ట్‌పై సంతకం చేశా. ‘క్వీన్‌’ షూట్‌ పూర్తి కాగానే న్యూయార్క్‌ వెళ్లి ఫిల్మ్‌ స్కూల్‌లో చేరా.’’

‘‘స్క్రీన్‌రైటింగ్‌ నేర్చుకుని 24 ఏళ్ల వయసులో ఓ చిన్న సినిమా తెరకెక్కించాను. ఆ చిత్రంతో హాలీవుడ్‌లో దర్శకురాలిగా అవకాశం లభించింది. నేను తెరకెక్కించిన చిన్న చిత్రాన్ని చూసి.. ఓ పెద్ద ఏజెన్సీ దర్శకురాలిగా అవకాశమిచ్చింది. నటనపై నాకున్న కలలన్నింటినీ కాల్చివేశాను. భారత్‌కు వచ్చే ధైర్యం లేదు. లాస్‌ ఏంజెల్స్‌ సరిహద్దుల్లో చిన్న ఇల్లు కొనుగోలు చేశా. అలా, నా కలల్ని వదులుకున్న సమయంలో ‘క్వీన్‌’ విడుదలయ్యింది. నా జీవితం మారిపోయింది. మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు ఆదరణ పెరిగింది.’’ అని కంగన ట్వీట్‌ చేశారు. వికాశ్‌ బల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2013లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఉత్తమ నటిగా కంగన జాతీయ అవార్డును సైతం అందుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని