corona:అంబులెన్స్‌ డ్రైవర్‌గా మారిన నటుడు

సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు కొందరు నటీనటులు. ఇప్పటికే ప్రముఖ నటుడు సోనూసూద్‌ కరోనా కష్టసమయంలో ఎంతోమందికి

Published : 30 Apr 2021 18:00 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు కొందరు నటీనటులు. ఇప్పటికే ప్రముఖ నటుడు సోనూసూద్‌ కరోనా కష్టసమయంలో ఎంతోమందికి సాయం చేస్తూ రియల్‌ హీరో అయ్యారు. తాజాగా ప్రముఖ కన్నడ నటుడు అర్జున్‌ గౌడ కూడా కొవిడ్‌ బాధితుల కోసం తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం ఆయన ఏకంగా అంబులెన్స్‌ డ్రైవర్‌గా మారారు.
 
కర్ణాటకలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ వైరస్‌ బాధితుల పరిస్థితులను తెలుసుకుని అర్జున్‌ గౌడ ఎంతగానో చలించిపోయారు. తన వంతుగా ఏదో ఒక సాయం చేయాలని భావించిన ఆయన.. తన వద్ద ఉన్న అంబులెన్స్‌కు స్వయంగా డ్రైవర్‌గా మారి కొవిడ్‌ బాధితులను ఆసుపత్రులకు చేరుస్తున్నారు. అంతేగాక, వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన వారి అంతిమ సంస్కరాల్లో ఆ కుటుంబాలకు అండగా ఉంటున్నారు. మరో రెండు నెలల పాటు తాను డ్రైవర్‌గా ఉంటానని ఆయన చెబుతున్నారు. ‘‘సాయం చేయడానికి ఎంత దూరమైన వెళ్లేందుకు నేను సిద్ధమే. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఆపదలో ఉన్నవారి కోసం నా వంతు సాయం చేయాలనుకుంటున్నా’’ అని హీరో చెప్పుకొచ్చారు. అంబులెన్స్‌ డ్రైవర్‌గా తాను అవసరమైన శిక్షణ తీసుకున్నానని, కరోనా జాగ్రత్తలతోనే నడుపుతున్నానని తెలిపారు. 

యువరత్న, రుస్తుమ్‌, ఆ దృశ్య వంటి సినిమాలతో మెప్పించిన అర్జున్‌ గౌడ.. కన్నడ చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. కొవిడ్‌ రోగులకు వైద్య సహాయం అందించేందుకు స్మైల్‌ ట్రస్ట్‌ పేరుతో ఓ ప్రాజెక్టును కూడా ప్రారంభించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని