Kannappa: ‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్‌తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్‌బాబు

మంచు విష్ణు నటిస్తోన్న ‘కన్నప్ప’ టీజర్‌ తాజాగా విడుదలైంది. ఈసందర్భంగా మీడియాతో టీమ్‌ ముచ్చటించింది.

Published : 14 Jun 2024 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మంచు విష్ణు (Mohan babu) ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఫాంటసీ డ్రామా ‘కన్నప్ప’ (Kannappa). ముకేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకుడు. తాజాగా దీని టీజర్‌ను విడుదల చేశారు. ఈసందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించింది. 

‘‘ఇది ప్రజల సినిమా. ఏ తరానికైనా కొత్తగా అనిపించే చిత్రమిది. భక్తిభావం.. ఆ భక్తి ఎలా వస్తుంది. ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్యం అంటే ఏంటి? వంటి ఎన్నో ప్రశ్నలకు ఇందులో సమాధానం దొరుకుతుంది. ఒక సినిమా నిర్మించాలంటే దానివెనక ఎంతోమంది కష్టం దాగి ఉంటుంది. ‘కన్నప్ప’లో దేశంలోని గొప్ప నటీనటులు భాగమయ్యారు. వారంతా అద్భుతంగా నటించారు. శరత్‌కుమార్‌ నాకు సోదరుడితో సమానం. ఏ పాత్రనైనా అలవోకగా చేస్తారు. ఇది కేవలం భక్తి చిత్రం మాత్రమే కాదు. ఇది ఓ చరిత్ర. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని అంటుంటారు. ఆయన ఆశీస్సులతోనే కన్నప్పను తీశాం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు కూడా ఉండాలని కోరుకుంటున్నా’’ అని మోహన్‌బాబు అన్నారు. 

మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఎంతోమంది సపోర్ట్‌ చేస్తున్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఇన్‌స్టాలో మీరందరూ పెట్టిన కామెంట్స్‌ ఎంతో బలాన్నిచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌ తీయాలని 2014లోనే అనుకున్నాను. దీని లొకేషన్స్‌ కోసం నాలుగు సంవత్సరాలు ఎన్నో దేశాలు తిరిగాను. రీసెర్చ్‌ చేశాను. ఇది నిజంగా జరిగిన కథ. నా కలల ప్రాజెక్ట్‌. నా బిడ్డతో సమానం. మీరు అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు.

కన్నప్పలో ప్రభాస్‌ ఏ పాత్రలో కనిపించనున్నారు? హింట్ ఏమైనా ఇస్తారా?

విష్ణు: వచ్చే నెల నుంచి ప్రతీ సోమవారం ఒక అప్‌డేట్‌ వస్తుంది. అప్పుడే అందరి గురించి వెల్లడిస్తాం. ప్రభాస్‌కు ఇందులోని అందరితో కాంబినేషన్‌ సీన్స్‌ ఉంటాయి. ఈ సినిమా విడుదలకు ముందు చాలా ఈవెంట్స్‌ జరుగుతాయి.

ప్రభాస్‌ గురించి ఒక్కమాటలో చెప్పండి?

విష్ణు:  రక్తసంబంధం కాకపోయినా.. ప్రభాస్‌ నాకు తమ్ముడితో సమానం.

ఇంతమందిని తీసుకోవడానికి కారణం?

విష్ణు:  సినిమా చూశాక ఆ విషయం అందరికీ అర్థమవుతుంది.

ఈ సినిమా షూటింగ్‌ సమయంలో ఏమైనా నియమాలు పాటించారా?
విష్ణు:  మోహన్‌బాబు గారు, మరికొందరు నటులు నియమాలు పాటించారు. నేను మనసుతో శివుడికి కనెక్ట్‌ అయ్యాను. 

ఈ ప్రాజెక్ట్‌లో నటించడం ఎలా అనిపించింది?
మధుబాల: ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో చేయడం చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. విష్ణుకు సినిమాలపై ఎంత ప్రేమ ఉందో కన్నప్పతో తెలిసింది. సెట్‌ అంతా దేవాలయంలా అనిపించింది.

కన్నప్ప కృష్ణంరాజుకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్‌. ప్రభాస్‌ కోసం ఆయన ఈ కథను సిద్ధం చేశారు. దాన్ని మీరు రిఫరెన్స్‌గా తీసుకున్నారా?

మోహన్‌బాబు: కృష్ణంరాజు నాకు మంచి స్నేహితుడు. ఆయన నటించిన ‘కన్నప్ప’ 25 వారాలు ఆడింది. ఆయన ప్రభాస్‌తో ఈ సినిమా తీయాలని అనుకున్నారు. స్క్రిప్ట్‌ కూడా సిద్ధం చేసుకున్నారు. నేను విష్ణుతో తీయాలని అనుకుంటున్నా అని చెప్పగానే ఆయన రాసుకున్న స్క్రిప్ట్‌ నాకు ఇచ్చారు. విష్ణు కూడా ప్రభాస్‌తో సమానమన్నారు.

అనుకున్నదానికంటే బడ్జెట్‌ ఎక్కువైందా? 

విష్ణు:  మేము ఎప్పుడూ బడ్జెట్‌ గురించి ఆలోచించలేదు. మంచి సినిమా తీయాలని భావించాం. దీనికి సీక్వెల్‌ లేదు. దీనికోసం ఇండస్ట్రీలో చాలామంది నాకు సాయం చేశారు. కన్నప్ప కెరీర్‌పరంగా నా జీవితాన్ని మార్చేస్తుంది.

ఈ పాత్ర చేసేటప్పుడు సవాళ్లు ఎదుర్కొన్నారా?
విష్ణు:  ఒక నటుడిగా ఈ సినిమా నాకు గౌరవాన్ని పెంచుతుంది. ఇందులో చాలామంది అగ్ర నటీనటులు ఉన్నారు. వాళ్లందరితో కలిసి నటించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. భక్తుడు కాక ముందు కన్నప్ప ఎలా ఉండేవారో అలా నటించడం సవాలుగా అనిపించింది. శరత్‌కుమార్‌ గారితో చేసేటప్పుడు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాను. 

హీరోయిన్‌ గురించి చెప్పండి?
విష్ణు:  ప్రీతి ముకుందన్‌. క్లాసికల్‌ డ్యాన్సర్‌. ఆమె ఈ సినిమాలో నెమలి పాత్రలో కనిపించనుంది. మొదటి సినిమానే అయినా అద్భుతంగా నటించింది. 

దర్శకుడిగా ముకేశ్‌ కుమార్‌సింగ్‌ని ఎంచుకోడానికి కారణం?

విష్ణు:  ఈ సినిమా తీయడానికి రెండేళ్లు పడుతుంది. అంత సమయం కేటాయించడానికి ఎవరు అంగీకరిస్తారు అని అనుకున్నాం. అప్పుడు నాన్నగారు ముకేశ్‌ గురించి చెప్పారు. మహాభారతం సీరియల్‌ను అద్భుతంగా తీశారు. ఆయన్ని సంప్రదించు అన్నారు. అడగ్గానే అంగీకరించారు. 

‘మహాభారతం’ సినిమాగా తీస్తే ఏ పాత్రల్లో నటిస్తారు?

విష్ణు: కర్ణుడు, దుర్యోధనుడు పాత్రల్లో నటిస్తాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని