Kantara: ‘కాంతార’కు అరుదైన గౌరవం.. ఐరాసలో ప్రదర్శన

స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి (Rishab Shetty) నటించిన చిత్రం ‘కాంతార’ (Kantara). ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ సినిమా అరుదైన గౌరవం దక్కించుకుంది.

Published : 17 Mar 2023 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది విడుదలై, పలు రికార్డులు సృష్టించిన ‘కాంతార’ చిత్రానికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. జెనీవా (స్విట్జర్లాండ్)లోని ఐక్యరాజ్య సమితి (United Nations) కార్యాలయంలో మార్చి 17న ఈ సినిమా ప్రదర్శించనున్నారు. ఈ మేరకు చిత్ర హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) ఇప్పటికే స్విట్జర్లాండ్ చేరుకున్నారు. సినిమా స్క్రీనింగ్‌ పూర్తైన అనంతరం రిషబ్‌శెట్టి ప్రసంగిస్తారు. పర్యావరణ పరిరక్షణలో భారతీయ సినిమాల పాత్ర గురించి ఆయన మాట్లాడనున్నారు. తన చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించనుండడం పట్ల రిషబ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.

‘పలు భారతీయ చిత్రాలు పర్యావరణ పరిక్షణపై అవగాహన పెంచాయి. నా తాజా సినిమా ‘కాంతార’లోనూ ఆ అంశాన్ని ప్రస్తావించాం. ప్రకృతితో మనకున్న కనెక్షన్‌ ఏంటో ఆ చిత్రం తెలియజేస్తుంది. ఇలాంటి సినిమాలు ఎన్విరాన్‌మెంటల్‌ ఛాలెంజ్‌లను స్వీకరించి, సంబంధిత సమస్యలను పరిష్కరించగల స్ఫూర్తినిస్తాయి’’ అని తెలిపారు. రూ. 16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ కన్నడ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ. 400 కోట్లు వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఐరాసలో ప్రదర్శితమయ్యే తొలి కన్నడ సినిమాగా ఇప్పుడు రికార్డు సృష్టించింది. త్వరలోనే ఈ సినిమాకి ప్రీక్వెల్‌ రూపొందనుంది. రిషబ్‌.. ఆ స్క్రిప్టు పనుల్లోనే ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని