Kantara on OTT: ఓటీటీలో ‘కాంతార’.. వస్తుందా? ఆలస్యమవుతుందా?

ఓటీటీలో ‘కాంతార’ వచ్చేస్తోందంటూ ఇటీవల పలు పోస్టులు కనిపించాయి. దీనిపై ఇటు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, అటు హోంబాలే ఫిల్మ్స్‌ ఎక్కడా మాట్లాడటం లేదు. ఇంతకీ ‘కాంతార’ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది?

Updated : 21 Nov 2022 16:53 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాక్సాఫీస్‌ వద్ద ‘కాంతార’ (Kantara) వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. సినిమా విడుదలై 50 రోజులు అయినా, థియేటర్‌లో తగ్గని క్రేజ్‌. గత కొద్ది రోజులుగా ‘కాంతార’ మూవీ గురించి వస్తున్న వార్తలివి. వాటన్నింటికన్నా ‘ఓటీటీలో కాంతార ఎప్పుడు’ ఈ వార్తే ఎక్కువగా ట్రెండ్‌ అవుతోంది. ఇటీవల నవంబరు 24న ‘కాంతార’ వచ్చేస్తుందంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్టర్లు వెలిశాయి. డిజిటల్‌ స్ట్రీమింగ్‌ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో స్వయంగా ప్రకటించినట్లు వాటిని డిజైన్‌ చేసి, వదిలారు. కానీ, అధికారిక సోషల్‌మీడియా ఖాతాల్లో మాత్రం ఒక్క ప్రకటన కూడా కనిపించలేదు. మరోవైపు చిత్ర నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్‌ కూడా దీనిపై ఎక్కడా మాట్లాడటం లేదు. ఇంతకీ ‘కాంతార’ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది?

గత కొన్ని రోజులుగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో చందాదారులకు సర్‌ప్రైజ్‌ ఇస్తోంది. సరిగ్గా ఒక్కరోజు ముందు కొత్త సినిమాల గురించి ప్రకటన చేస్తోంది. అంతేకాదు, మొదట కొన్ని రోజులు పాటు అద్దె ప్రాతిపదికన వాటిని తీసుకొస్తోంది. ‘కాంతార’ విషయంలోనూ ఇదే పద్ధతి అవలంబించే అవకాశం ఉందట. ఎందుకంటే మూవీ స్ట్రీమింగ్‌ గురించి ‘అమెజాన్‌ హెల్ప్‌’ను అడగ్గా నవంబరు 24న అంటూ చెప్పింది. అయితే, అధికారిక పేజీలో మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ వారం ఇందుకు సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రకటన చేయకపోవడానికి కారణం అదేనా?

‘కాంతార’మూవీ అంతా ఒక ఎత్తయితే, క్లైమాక్స్‌లో ‘వరాహరూపం’ పాట, రిషబ్‌శెట్టి నటన మరొక ఎత్తు. ఆ పాట లేకుండా సినిమాను ఊహించలేం. కానీ, మలయాళ బ్యాండ్‌ ‘తెయ్యికుడుం బ్రిడ్జ్‌’ ‘కాంతార’లోని పాటపై న్యాయపోరాటానికి దిగింది. తమ అనుమతి లేకుండా మలయాళ పాటను తీసుకుని, ‘వరాహరూపం’ తీశారన్నది వాళ్ల ఆరోపణ. ప్రస్తుతం ఈ వివాదం న్యాయస్థానంలో ఉంది. దీంతో యూట్యూబ్‌లోనూ ‘వరాహరూపం’ పాటను హోంబాలే ఫిల్మ్స్‌ తొలగించింది. ఈ వివాదం ఓ కొలిక్కి రావాల్సి ఉంది. మరోవైపు ‘తెయ్యికుడుం బ్రిడ్జ్’ బృంద సభ్యులు గతవారం బెంగళూరులో ‘నవరసం’ పాటను ప్రదర్శించారు. కాగా, ‘కాంతార’ను నవంబరు 24న ఓటీటీలో విడుదల చేస్తున్నారా? అని హోంబాలే ఫిల్మ్స్‌ కార్తిక్‌ గౌడను కొందరు న్యూస్‌ ప్రతినిధులు సంప్రదించగా, ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాలేదట. ఇందుకు సంబంధించిన అప్‌డేట్‌లు తమ సోషల్‌మీడియా ఖాతాల్లో చూసుకోవచ్చని అన్నారట. ఓటీటీ విషయంలో స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఒకవేళ విడుదల చేస్తే మాత్రం హిందీ మినహా మిగిలిన భాషల్లో అందుబాటులో తెచ్చే అవకాశం ఉందంటున్నారు.

‘కేజీయఫ్‌2’ రికార్డు బద్దలైంది!

కాంతార ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, కర్ణాటకలో ‘కేజీయఫ్‌2’ రికార్డు (రూ.155కోట్లు)ను అధిగమించి, రూ.160.50కోట్ల వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘కాంతార’ నిలిచింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని