Karan Johar: ఆమిర్‌.. బాలీవుడ్‌లో ఆ స్టైల్‌ మిస్‌ కావడానికి కారణం మీరే..!

బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ప్రేక్షకుల్లో ఒకప్పటి క్రేజ్‌ని కోల్పోవడానికి అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖానే (Aamir Khan) కారణమని దర్శకుడు కరణ్‌జోహార్‌ (Karan Johar) నిందించారు. హిందీ సినిమాల్లో ఎంతోకాలం క్రితం చూసిన ఆ స్టైల్‌ ఇప్పుడ.....

Published : 04 Aug 2022 13:11 IST

రియాల్టీ షోలో అగ్రకథానాయకుడ్ని తప్పుపట్టిన దర్శకుడు

ముంబయి: బాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ప్రేక్షకుల్లో ఒకప్పటి క్రేజ్‌ను కోల్పోవడానికి అగ్ర కథానాయకుడు ఆమిర్‌ఖానే (Aamir Khan) కారణమని దర్శకుడు కరణ్‌జోహార్‌ (Karan Johar) నిందించారు. హిందీ సినిమాల్లో ఎంతోకాలం క్రితం చూసిన ఆ స్టైల్‌ ఇప్పుడు దక్షిణాది చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ మేరకు ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan) షోలో పాల్గొన్న ఆమిర్‌ని ఉద్దేశిస్తూ.. ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘బాహుబలి’, ‘కేజీయఫ్‌’, ‘పుష్ప’తో బాక్సాఫీస్‌ వద్ద దక్షిణాది చిత్రాలు భారీ విజయాలు సొంతం చేసుకోగా.. మన సినిమాలు సరిగ్గా ఆడలేదు. మన సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఆ టోనాలిటీని ఇప్పుడు ‘పుష్ప’, ‘కేజీయఫ్‌’లో చూశాం. దానికి బాధ్యులు మీరే. ఎందుకంటే 2001లో మీరు ‘దిల్ చాహతా హై’, ‘లగాన్‌’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. 2006లో ‘రంగ్‌దే బసంతి’ ఆ తర్వాత ‘తారే జమీన్‌ పర్‌’ వీటన్నింటితో నిర్దిష్టమైన ప్రేక్షకుల్ని, ఫిల్మ్‌మేకర్స్‌ని మీరు సృష్టించారు’’ అని కరణ్‌ అన్నారు.

కరణ్‌ వ్యాఖ్యలపై స్పందించిన ఆమిర్‌.. ‘‘కరణ్‌.. మీరు తప్పుగా చెబుతున్నారు. అవన్నీ హృదయాలను హత్తుకునే చిత్రాలు. భావోద్వేగాలతో కూడుకున్నవి. ఆ చిత్రాలు సామాన్య ప్రేక్షకుల్ని కూడా చేరువయ్యాయి. యాక్షన్‌, భయానక చిత్రాలు చేయమని నేను చెప్పను. ఎక్కువమందికి చేరువయ్యే అంశాలతో అందరి మనస్సులు సొంతం చేసుకునేలా సినిమాలు చేయండి. ఎలాంటి సినిమాలు తెరకెక్కించాలనే విషయంలో ప్రతి ఫిల్మ్స్‌ మేకర్‌కు స్వేచ్ఛ ఉంది. భారతదేశంలోని అధికశాతం మంది ఆసక్తి చూపని అంశాలను సినిమాలు చేస్తే అవి ఎక్కువమంది ప్రేక్షకులకు ఎలా చేరువవుతాయి? ఈ విషయాన్ని మనంలో చాలామంది గుర్తించలేకపోతున్నాం’’ అని ఆయన వివరించారు.

ఇదే షోలో తన మాజీ భార్యల గురించి ఆమిర్‌ మాట్లాడుతూ.. ‘‘రీనా దత్తా, కిరణ్‌ రావుతోపాటు మా కుటుంబం మొత్తం వారంలో తప్పకుండా ఒక్కసారైనా కలుస్తాం. మేం ఏ పనుల్లో బిజీగా ఉన్నాసరే.. వారంలో ఓ రోజు కుటుంబానికి కేటాయిస్తాం. వాళ్లిద్దరూ, పిల్లలపై నాకెప్పటికీ అమితమైన ప్రేమ, గౌరవం, బాధ్యత ఉంటాయి’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని