karate kalyani: ‘మా’ నుంచి సస్పెండ్‌.. చాలా బాధగా ఉంది: కరాటే కళ్యాణి

karate kalyani: ‘మా’ అసోసియేషన్‌ నుంచి తనని సస్పెండ్‌ చేయడంపై సినీ నటి కరాటే కళ్యాణి స్పందించారు.

Published : 26 May 2023 16:34 IST

హైదరాబాద్‌: సినీ నటి కరాటే కళ్యాణి(karate kalyani)ని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (MAA) నుంచి సస్పెండ్‌ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్‌పై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ‘మా’ తనని సస్పెండ్‌ చేయడం చాలా బాధగా ఉందని కళ్యాణి అన్నారు. ‘మా’పై ఎవరు బురద జల్లే ప్రయత్నం చేసినా, తాను పోరాటం చేశానని, తిట్లు కూడా తిన్నానని అన్నారు. తన నిజాయతీకి ఇచ్చిన బహుమతి ఇదా? అంటూ వాపోయారు.

‘‘నేను ఒక మంచి కారణం కోసం పోరాటం చేస్తున్నా. అక్కడ ఎన్టీఆర్‌గారే కాదు, ఎవరున్నా అభ్యంతరం చెబుతా. ఎన్టీఆర్‌ నటనకు నేనూ అభిమానినే. ఆయన రూపంలో చాలా విగ్రహాలు ఉన్నాయి. ఆ రూపంలోనే విగ్రహం పెడదాం. ఇందుకోసం న్యాయపరంగా పోరాడితే కోర్టే రెండుసార్లు స్టేను పొడిగించింది. వాళ్లు పిటిషన్‌ దాఖలు చేస్తే మార్పులు చేర్పులూ చేయడానికి వీల్లేదని చెప్పింది. ఆ పర్మిషన్‌ చెల్లదని కోర్టు వెల్లడించింది. ఈ వ్యవహారంతో ‘మా’ అసోసియేషన్‌కు సంబంధం లేదు. ఒక సీనియర్‌ నటుడిపై వ్యాఖ్యలు చేశానని ఆరోపిస్తూ నోటీసులు పంపారు. నా ఆరోగ్యం బాగోలేక సమాధానం ఇవ్వలేకపోయా. మూడు రోజుల్లో సమాధానం ఇవ్వాలని ‘మా’ సూచించింది. కనీసం వారమైనా గడువు ఇవ్వమని కోరుతూ రిప్లై నోటీసు కూడా ఇచ్చా. వాళ్లు ఎలా భావించారో తెలియదు. నన్ను సస్పెండ్‌ చేస్తూ లేఖ పంపారు. నాకు ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదు. మా అసోసియేషన్‌ అంతా ఒక్కటే అని భావిస్తా. అసోసియేషన్‌ను కించపరచలేదు. నేను ఏ తప్పూ చేయలేదు. ‘మా’ తీసుకున్న నిర్ణయం చాలా బాధనిపించింది. బహుశా ఎవరి ఒత్తిడితోనైనా ఆ నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు’’ అని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని