Sardar: ఇక్కడ పవన్‌ కల్యాణ్‌, అక్కడ కార్తి.. అలా చేయటం తేలిక కాదు: నాగార్జున

కార్తితో తనకు మంచి అనుబంధం ఉందన్నారు అక్కినేని నాగార్జున. ‘సర్దార్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Updated : 19 Oct 2022 21:52 IST

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌, పునీత్‌ రాజ్‌కుమార్‌, కార్తి.. ఈ ముగ్గురు తాను చూసిన అరుదైన నటులని ప్రముఖ నటుడు నాగార్జున (Akkineni Nagarjuna) అన్నారు. ‘సర్దార్‌’ (Sardar) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తన మనసులో మాట పంచుకున్నారు. కార్తి (Karthi) హీరోగా దర్శకుడు పి.ఎస్‌. మిత్రన్‌ తెరకెక్కించిన చిత్రమిది. రాశీఖన్నా, రజిషా విజయన్‌ కథానాయికలు. ఈ నెల 21న సినిమాను విడుదల చేయనున్న సందర్భంగా చిత్ర బృందం నాగార్జున ముఖ్య అతిథిగా వేడుక నిర్వహించింది.

నాగార్జున మాట్లాడుతూ.. ‘‘నాకూ కార్తికి మంచి అనుబంధం ఉంది. ‘ఊపిరి’ సినిమాలో మేం కలిసి నటించిన సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ సమర్పణలో ‘సర్దార్‌’ విడుదలవటం ఆనందంగా ఉంది. కార్తి అన్నయ్య సూర్య సూపర్‌స్టార్‌. అలాంటి స్టార్‌ నటుడి తమ్ముడి ఇమేజ్‌ నుంచి బయటకు వచ్చి తమని తాము నిరూపించుకోవటం అంత తేలికైన విషయం కాదు. అలాంటి వారు అరుదు. తెలుగులో చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌, కన్నడలో శివరాజ్‌కుమార్‌ తమ్ముడు పునీత్‌ రాజ్‌కుమార్‌, తమిళంలో కార్తి నేను చూసిన అరుదైన నటులు. పలు విభిన్న పాత్రలు పోషించి, సూర్యలా కార్తి కూడా సూపర్‌స్టార్‌ అయ్యాడు. పాటలూ పాడతాడు. తెలుగులో బాగా మాట్లాడతాడు. అందుకే కార్తిని తెలుగు వారు విశేషంగా అభిమానిస్తారు’’ అని నాగార్జున అన్నారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

సవాలు విసిరిన ‘సర్దార్‌’: కార్తి

‘‘నాగార్జున అన్నయ్య నాకు స్ఫూర్తి. ‘మంచి వ్యక్తిగా ఉంటే గొప్ప నటుడుకావొచ్చు’ అని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటను నేను ఫాలో అవుతున్నా. ఆయనపై ఉన్న ఇష్టంతోనే ‘ఊపిరి’ చిత్రంలో నటించా. ఆ సినిమా చిత్రీకరణ రోజులను ఎప్పటికీ మర్చిపోలేను. నటుడిగా నాగార్జున చేసిన రిస్క్‌ ఎవరూ చేయలేదనుకుంటున్నా. జయపజయాలను ఆయన పట్టించుకోరు. ఆయన నేర్చుకున్న ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. ‘సర్దార్’ సినిమా నాకెంతో ప్రత్యేకం. సవాలుతో కూడిన పాత్రలు పోషించా. దర్శకుడు మిత్రన్‌ ‘అభిమన్యుడు’లో డిజిటల్‌ క్రైమ్‌ గురించి చూపించినట్టే.. మనం తేలికగా తీసుకునే ఓ విషయాన్ని ‘సర్దార్‌’లో చూపించబోతున్నారు’’ అని కార్తి వివరించారు.

‘‘గీతాంజలి’తో నాగార్జునగారికి అభిమానిగా మారా. ఆయన ఈ వేడుకకు రావటం సంతోషంగా ఉంది. నేను ఈ చిత్రంలో ఇందిరా అనే పాత్రలో కనిపిస్తా. ఈ సినిమాలో లవ్‌, కామెడీ, యాక్షన్‌.. ఇలా అన్ని అంశాలున్నాయి’’ అని రజిషా తెలిపారు. ‘‘గతంలో నేను నటించిన ‘శివపుత్రుడు’ సినిమా దీపావళికి విడుదలై ఘన విజయం అందుకుంది. ఇప్పుడు ‘సర్దార్‌’ అదే పండగకు రాబోతుంది’’ అని లైలా ఆనందం వ్యక్తం చేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని