Sardar review: రివ్యూ: స‌ర్దార్‌

Sardar review: కార్తి కీలక పాత్రలో నటించిన ‘సర్దార్‌’ఎలా ఉందంటే?

Published : 21 Oct 2022 15:12 IST

Sardar review: చిత్రం: సర్దార్‌; నటీనటులు: కార్తీ, రాశి ఖన్నా, చుంకీ పాండే, రజిషా విజయన్, లైలా, మునిష్కాంత్, అశ్విన్, యోగ్ జాపి, నిమ్మి, బాలాజీ శక్తివేల్, ఎలవరసు  తదితరులు; సంగీతం: జివి ప్రకాష్ కుమార్; ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియమ్స్; కూర్పు: రూబెన్; పోరాటాలు: దిలీప్ సుబ్బరాయన్; క‌ళ‌: కదిర్; నిర్మాత: ఎస్ లక్ష్మణ్ కుమార్; దర్శకత్వం: పిఎస్ మిత్రన్; సంస్థ‌: ప్రిన్స్ పిక్చర్స్, అన్నపూర్ణ స్టూడియోస్; విడుద‌ల‌: 21-10-2022

పండ‌గ సీజ‌న్ల‌లో అతిథులుగా త‌మిళ తార‌ల్నీ ఆహ్వానిస్తుంటుంది మ‌న బాక్సాఫీసు. తెలుగు సినిమాల‌తోపాటు... ఒక‌ట్రెండు త‌మిళ సినిమాలు త‌ప్ప‌నిస‌రిగా ప్రేక్ష‌కుల ముందుకొస్తుంటాయి. బాగుంటే చాలు...  అతిథి మ‌ర్యాద‌ల్ని త‌ల‌పించేలా  ఆ సినిమాల్ని ఆద‌రిస్తుంటారు మ‌న ప్రేక్ష‌కులు.  తెలుగులో బ‌ల‌మైన మార్కెట్‌ని సొంతం చేసుకున్న కార్తి, త‌మిళంలో త‌ను న‌టించే ప్ర‌తి సినిమానీ తెలుగులోనూ స‌మాంత‌రంగా విడుద‌ల చేస్తుంటారు. ‘ఖైదీ’ త‌ర్వాత మ‌రోసారి దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకొస్తున్న ఆయ‌న చిత్రం ‘స‌ర్దార్‌’. పోలీస్‌గా, గూఢ‌చారిగా  కార్తి ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్ర‌మిది. తెలుగులో అన్న‌పూర్ణ స్టూడియోస్ విడుద‌ల చేసింది. మ‌రి ‘స‌ర్దార్‌’ ఎలా ఉంది?   కార్తి మ‌రో విజ‌యాన్నిఅందుకున్న‌ట్టేనా?

క‌థేంటంటే: విజ‌య్ ప్ర‌కాశ్ (కార్తి) ఓ పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్. సోష‌ల్ మీడియాలో త‌ర‌చూ ట్రెండింగ్ అవుతుంటాడు. అత‌ని స‌మ‌య‌స్ఫూర్తి తెలివి తేట‌లు అలాంటివి.  ప‌ని కంటే ముందు చుట్టూ మీడియా ఉందో లేదో చూసుకుంటుంటాడు.  ఉంద‌ని తెలిశాకే త‌న ప‌ని మొద‌లు పెడ‌తాడు. ట్రెండింగ్‌లో ఉండ‌టమంటే అంత పిచ్చి.  ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఓ ముఖ్య‌మైన ఫైల్ మాయం అవుతుంది. అందులో సైనిక ర‌హ‌స్యాలు ఉన్నాయ‌ని తెలుస్తాయి.  ఆ ఫైల్ ఎక్క‌డుందో క‌నిపెట్టేందుకు సీబీఐ, రా అధికారులు రంగంలోకి దిగుతారు. విష‌యం తెలుసుకున్న విజ‌య్ ప్ర‌కాశ్ త‌నకి మ‌రింత ప్రాచుర్యం ల‌భిస్తుంద‌ని ఆ ఫైల్ క‌నుక్కునేందుకు న‌డుం బిగిస్తాడు.  ఆ క్ర‌మంలో విజయ్ ప్రకాష్‌కి తన తండ్రి సర్దార్ (కార్తి) గురించి, ఆయ‌న మిష‌న్ గురించి తెలుస్తుంది. దేశ‌ద్రోహిగా ముద్ర‌ప‌డిన స‌ర్దార్ ఎవ‌రు? ఎక్క‌డుంటాడు?  ఆయ‌న చేప‌ట్టిన మిష‌న్‌లో విజ‌య్ ప్ర‌కాశ్ ఎలా భాగం అయ్యాడు? త‌దిత‌ర విష‌యాల‌తో మిగ‌తా క‌థ సాగుతుంది.

ఎలా ఉందంటే: త‌న క‌థ‌ల‌తో  వర్త‌మాన అంశాల్ని, సామాజికాంశాల్ని  స్పృశించ‌డంలో దిట్ట ద‌ర్శ‌కుడు పి.ఎస్‌.మిత్ర‌న్‌. ఆయ‌న తీసిన ‘అభిమ‌న్యుడు’, ‘హీరో’ చిత్రాలు  తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి.  ఈసారి స‌మ‌స్త జీవ‌కోటి ప్రాణ‌ధారమైన నీటి  నిర్వ‌హ‌ణ ప్రైవేటీక‌ర‌ణ అంశాన్ని స్పృశిస్తూ ఓ గూఢ‌చారి క‌థ‌తో చిత్రాన్ని తీర్చిదిద్దాడు.  ఒక దేశం ఒక పైప్‌లైన్ పేరుతో కొంత‌మంది స్వార్థ‌ప‌రులు నీటిని త‌మ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఏం చేశారు?  దాని కోసం ఎక్క‌డో  అజ్ఞాతంలో, దేశ‌ద్రోహిగా అని ముద్ర‌ప‌డిన ఓ వ్య‌క్తి ఎలా బ‌య‌టికొచ్చి స్వార్థ‌ప‌రుల ఎత్తుల్ని చిత్తు చేశాడ‌న్న‌ది కీల‌కం.  ప‌క్కా ఫార్ములా క‌థ‌నంతోనే సినిమా మొద‌ల‌వుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌లో స‌ర్దార్ పాత్ర‌ని ప‌రిచ‌యం చేస్తూ, ఆ త‌ర్వాత హీరో విజ‌య్ ప్ర‌కాశ్‌ని రంగంలోకి దించాడు ద‌ర్శ‌కుడు.  ఆరంభం అంతా హీరోహీరోయిన్ల మ‌ధ్య స‌ర‌దా సన్నివేశాలతో సాగుతాయి. క‌థ‌లోకి వెళ్లేకొద్దీ సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డుతుంది.  ఈ క‌థ‌నం కూడా కొత్త‌దేమీ కాదు. కానీ ప్రేక్ష‌కుడిని మాత్రం ఎంగేజ్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు విజ‌య‌వంత‌మ‌య్యాడు. సామాజిక కార్య‌క‌ర్త స‌మీరా ( లైలా) మ‌ర‌ణం,  మాయమైన ఫైల్ చుట్టూ అన్వేష‌ణతో సినిమా  ఆస‌క్తిక‌రంగా సాగుతుంది.  ఇలాంటి క‌థ‌, క‌థ‌నాలు భార‌తీయ తెర‌కి కొత్తేమీకాదు.  యాక్ష‌న్ ప్ర‌ధానంగా సాగే ఈ  సినిమాకి పోరాట ఘ‌ట్టాల ప‌రంగా కూడా ప్ర‌త్యేక‌మైన హంగులేవీ జోడించ‌లేదు.  కానీ కార్తి  రెండుపాత్ర‌ల్లోని న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంటాడు.  ముఖ్యంగా స్పై పాత్ర‌ని తీర్చిదిద్దిన విధానం , దానికి స‌హ‌జ‌త్వాన్ని జోడించిన తీరు టికెట్టు ధ‌ర‌ని గిట్టుబాటు చేస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: క‌థానాయ‌కుడు కార్తి గూఢ‌చారి పాత్ర‌లో తండ్రిగా, పోలీస్ పాత్ర‌లో యువ‌కుడిగా చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. ఆయ‌న మేకోవ‌ర్ విష‌యంలో తీసుకున్న శ్ర‌ద్ధ బాగుంది. పోలీస్ పాత్ర‌లో కూడా స్టైలిష్‌గా క‌నిపిస్తాడు. షాలినిగా రాశిఖ‌న్నా న్యాయ‌వాది పాత్ర‌లో సంద‌డి చేస్తుంది. లైలా, రాజీషా విజ‌య‌న్ క‌థ‌లో కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపిస్తారు.  రాథోడ్ పాత్ర‌లో ప్ర‌తినాయ‌కుడిగా చంకీ పాండే న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. జీవీ ప్ర‌కాశ్ సంగీతం సినిమాకి ప్రాణం పోసింది.  కెమెరా, ఎడిటింగ్ విభాగాలు సినిమాకోసం ఏం కావాలో అదిప‌క్కాగా చేశాయి. ద‌ర్శ‌కుడు మిత్ర‌న్.. కార్తి ఇమేజ్‌కి, త‌న శైలికి త‌గ్గ‌ట్టుగా ఓ ప‌క్కా మాస్ క‌థ‌తో ఈ సినిమా చేశారు. నిర్మాణం బాగుంది.

బలాలు

+ కార్తి ద్విపాత్రాభిన‌యం

+ భావోద్వేగాలు

+ ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- అక్క‌డ‌క్క‌డా సాగ‌దీత‌గా స‌న్నివేశాలు

క‌థ‌నంలో వైవిధ్య‌త లోపించ‌డం

చివ‌రిగా: స‌ర్దార్...  ఇంట్రెస్టింగ్‌ స్పై థ్రిల్లర్‌ విత్‌ కార్తి సూపర్‌ యాక్టింగ్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు