ArdhaShathabdham review: రివ్యూ: అర్ధశతాబ్దం

అర్ధశతాబ్దం సినిమా ఎలా ఉందంటే?

Updated : 11 Jun 2021 10:20 IST

రివ్యూ: అర్ధశతాబ్దం; నటీనటులు: కార్తీక్‌ రత్నం, నవీన్‌ చంద్ర, సాయికుమర్‌, కృష్ణప్రియ, శుభలేఖ సుధాకర్‌, ఆమని తదితరులు; సంగీతం: నఫల్‌ రాజా; సినిమాటోగ్రఫీ: అఖేర్‌, వెంకట్‌ ఆర్‌ శాఖమూరి, ఈజే వేణు; ఎడిటింగ్‌: జె.ప్రతాప్‌ కుమార్‌; ఆర్ట్‌: సుమిత్‌ పటేల్‌; నిర్మాత: చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ; కథ, దర్శకత్వం: రవీంద్ర, పుల్లె; బ్యానర్‌: ఆర్‌ఎస్‌ క్రియేషన్స్‌; విడుదల: ఆహా

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యువ దర్శకులు చేస్తున్న ప్రయోగాలు మరెవరూ చేయడం లేదు. సరికొత్త కథలు, కొంగొత్త కాన్సెప్ట్‌లతో చిత్రాలను తెరకెక్కిస్తూ అలరిస్తున్నారు. స్టార్‌ హీరోలు, హీరోయిన్‌లు లేకపోయినా కథా బలంతోనే విజయాలను సొంతం చేసుకుంటున్నారు. టీజర్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘అర్ధశతాబ్దం’. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉంది. కరోనాతో ఆ పరిస్థితి లేకపోవడంతో ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో విడుదలైంది. కార్తీక్‌ రత్నం, నవీన్‌చంద్ర, సాయికుమార్‌లు నటించిన ‘అర్ధశతాబ్దం’ కథ ఏంటి? యువ దర్శకుడు రవీంద్ర ఎలా తెరకెక్కించాడు?

కథేంటంటే: కృష్ణ(కార్తీక్‌ రత్నం) చదువు పూర్తి చేసి, ఊళ్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా దుబాయ్‌ వెళ్లి బాగా సంపాదించి, తల్లి, చెల్లిని చూసుకోవాలని అనుకుంటాడు. చిన్నప్పటి నుంచి తనతో పాటు చదువుకున్న పుష్ప(కృష్ణ ప్రియ)ను ప్రేమిస్తుంటాడు. అయితే, ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి మాత్రం ధైర్యం చాలదు. మరోవైపు ఊళ్లో చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ఊరి పెద్దలు కులం, రాజకీయ రంగుపులుముతుంటారు. ఈ క్రమంలో పుష్పపై ఉన్న ప్రేమతో నిజానిజాలు తెలుసుకోకుండా కృష్ణ ఓ పని చేస్తాడు. అది కాస్తా ఊళ్లో గొడవలకు దారి తీస్తుంది. అసలు కృష్ణ చేసిన ఆ పని ఏంటి? దాని వల్ల ఆ ఊళ్లో ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు పుష్పకు తన ప్రేమను తెలియజేశాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: విప్లవ భావాలు, వర్గ పోరాటం, శ్రమదోపిడి, కులాల మధ్య గొడవలు ఇలాంటి కథలతో తెలుగు తెరపై ఎన్నో కథలు వచ్చాయి. వాటికి కమర్షియల్‌ హంగులు జోడించి విజయం అందుకున్న చిత్రాలూ ఉన్నాయి. అయితే, ఇలాంటి కథలను డీల్ చేయటం చాలా కష్టం. ఇక ఏ చిత్ర పరిశ్రమలోనైనా ప్రేమ కథలు ఎవర్‌గ్రీన్‌. అయితే వాటిని ఎంత హృద్యంగా, గుండెకు హత్తుకునేలా చూపించారనే దానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ఇలా ఈ రెండింటినీ మిళితం చేసిన చిత్రమే ‘అర్ధశతాబ్దం’. సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న కథ, పాయింట్‌ బాగానే ఉన్నా, దాన్ని బలంగా చూపించడంలో తడబడ్డాడు. ప్రథమార్ధమంతా పుష్పను కృష్ణ ఇష్టపడటం, అతని చిన్ననాటి జ్ఞాపకాలతో సాగుతుంది. ఇవన్నీ చాలా రొటీన్‌గా సాగుతాయి. కథానాయకుడు వన్‌సైడ్‌ లవ్‌ అనే థీమ్‌ను ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. ఇందులోనూ అవే సన్నివేశాలు, అదే కథనం. ఉన్న ఐదు పాటలు ప్రథమార్ధంలోనే చూపించారు. దీంతో నిడివి పెరిగిపోయింది. ‘ఏ కన్నులు చూడని’ పాట, దాన్ని తీర్చిదిద్దిన విధానం మాత్రం బాగుంది. ఇక తెరపై చాలా పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. కానీ, ఏదీ పెద్దగా ప్రభావం చూపదు. అలా వచ్చి వెళ్లిపోతుంటాయి. 

ద్వితీయార్ధంలోనైనా ఏవైనా ఇంట్రస్టింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయా? అని చూసే ప్రేక్షకుడికి నిరాశే ఎదురవుతుంది. కృష్ణ చేసిన పని కులం రంగు పులుముకుని ఊళ్లో గొడవలు, అల్లర్లు మొదలవుతాయి. అసలు నిజం చెబుతామని కృష్ణ.. పుష్ప ఇంటికి వెళ్లడం, తను కృష్ణతో కలిసి బయటకు రావడంతో ఊళ్లో జరిగే గొడవల నుంచి వీళ్లు తప్పించుకుని ఎలా బయటపడతారన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. కానీ, ఆ  సన్నివేశాలు పెద్ద ప్రభావం చూపించలేకపోయాయి. మరోవైపు ఊళ్లో జరిగే గొడవలను ఉద్దేశిస్తూ, మంత్రి అయిన శుభలేఖ సుధాకర్‌, ఎస్పీ అజయ్‌ల మధ్య నడిచే సబ్‌ ప్లాట్‌ ద్వారా ఏదో చెప్పాలనుకుని, ఇంకేదో చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి ‘అర్ధ శతాబ్దం’ దాటినా వ్యవస్థలో ఎలాంటి మార్పూలేదన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన దర్శకుడు.  దాన్ని బలమైన సన్నివేశాల రూపంలో చెప్పలేకపోయాడు. అసలు కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలతో ముగించాడంతే. వాటిని కథలో సన్నివేశాల ద్వారా ఎమోషనల్‌గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది. వాస్తవికత పేరుతో  అసభ్యపదజాలం పూర్తిగా వదిలేశారు. దర్శకుడు ఎంచుకున్న క్లైమాక్స్‌ కాస్త భిన్నంగా ఉంది. 

ఎవరెలా చేశారంటే: ‘కేరాఫ్‌ కంచరపాలెం’లో తన నటనతో ఆకట్టుకున్న కార్తీక్‌ రత్నం ఇందులోనూ తనదైన నటనతో మెప్పించాడు. కొత్త అమ్మాయి కృష్ణప్రియ అందంగా కనిపించింది. నవీన్‌చంద్ర, సాయికుమార్‌, శుభలేఖ సుధాకర్‌, అజయ్‌ వంటి నటులున్నా పెద్దగా వాడుకోలేదు. వ్యవస్థపై చిరాకు పడే పోలీస్‌గా  నవీన్‌ చంద్ర కనిపించాడు. అందుకు కారణం ఏంటో చూపించలేదు. నఫల్‌ రాజా సంగీతం బాగుంది. ఒకట్రెండు పాటలు వినడానికి, తెరపైనా బాగున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. అస్కర్‌, వెంకట్‌, ఈజే వేణుల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను, ప్రేమ సన్నివేశాలను చక్కగా చూపించారు. ప్రతాప్‌ కుమార్‌ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సిందే. ప్రథమార్ధంలో నిడివి పెరిగిపోయింది. దర్శకుడు రవీంద్ర పుల్లె ఎంచుకున్న పాయింట్‌ కాస్త భిన్నమైనదైనా దాన్ని ప్రభావవంతంగా చూపించలేకపోయాడు. సంభాషణల్లో మెరుపులు ఉన్నా, అవి ఇద్దరు వ్యక్తులు కూర్చొని టీ తాగుతూ చెప్పుకొనే ముచ్చట్లలా ముగించాడంతే. నిజ జీవితంలో జరిగే సంఘటనలు, పేపర్‌లో వచ్చే వార్తా కథనాల ఆధారంగా కొన్ని సన్నివేశాలను చూపించగలిగినా పూర్తి స్థాయిలో బలమైన సన్నివేశాలు రాసుకోలేకపోయాడు. 

బలాలు బలహీనతలు
+ దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ - ప్రధమార్ధం
+ పాటలు - బలమైన సన్నివేశాలు లేకపోవడం
  - పాత్రలను సరిగా ఉపయోగించులేకపోవటం

చివరిగా: అర్ధశతాబ్దం.. అభ్యుదయం+ప్రేమ అతకలేదు

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని