Karthikeya 2: ‘కార్తికేయ 2’ మరోసారి వాయిదా.. ఇండస్ట్రీ బాగుండాలనే ఇలా చేశాం: నిఖిల్‌

అన్ని సినిమాలు ఆడాలి, చిత్ర పరిశ్రమ బాగుండాలనే ఉద్దేశంతోనే ఆగస్టు 12న విడుదల కావాల్సిన తమ చిత్రం ‘కార్తికేయ 2’ని మరోసారి వాయిదా వేశామని నటుడు నిఖిల్‌ తెలిపారు.

Updated : 03 Aug 2022 18:34 IST

హైదరాబాద్‌: ‘అన్ని సినిమాలు ఆడాలి, చిత్ర పరిశ్రమ బాగుండాలి’ అనే ఉద్దేశంతోనే ఆగస్టు 12న విడుదల కావాల్సిన తమ చిత్రం ‘కార్తికేయ 2’ని (Karthikeya 2) మరోసారి వాయిదా వేశామని నటుడు నిఖిల్‌ (Nikhil Siddharth) తెలిపారు. పరిశ్రమలో ఆరోగ్యకర వాతావరణం ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. నిఖిల్‌ హీరోగా దర్శకుడు చందూ మొండేటి (Chandoo Mondeti) తెరకెక్కించిన చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameshwaran) కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సత్య, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. మీడియా సమావేశంలో ‘కార్తికేయ 2’ టీమ్‌ చెప్పిన వివరాలివీ..

* ఈ సినిమా పలుమార్లు వాయిదా పడటానికి కారణమేంటి?

నిఖిల్: అదొక మిస్టరీ. కొవిడ్‌ సమయంలో సినిమాలు వాయిదా పడటం సహజం. కానీ, మా చిత్రం ఆ తర్వాతా వాయిదా పడుతూనే వచ్చింది. అన్ని సినిమాలు ఆడాలి, చిత్ర పరిశ్రమ బాగుండాలనే ఉద్దేశంతో వాయిదా నిర్ణయం తీసుకున్నాం. సినిమాల మధ్య క్లాష్‌ రాకుండా ఉండాలనున్నాం. దాంతో, ప్రతిసారీ మా చిత్రమే వెనక్కి వెళ్లేది. ఈ విషయంలో నేను బాధపడ్డా.

* మీ గత చిత్రం ‘అర్జున్‌ సురవరం’ చాలా సార్లు వాయిదా పడి, హిట్‌ అయింది. ‘కార్తికేయ 2’ అలానే వాయిదా పడింది. దాన్ని సెంటిమెంట్‌ అనుకుంటున్నారా?

నిఖిల్: ఏదైనా గండం ఉంటేనో, ఇంకేదైనా అయితేనో చిత్రం విజయవంతమవుతుందనేది ఏ చిత్ర పరిశ్రమలో ఏ హీరోకీ జరిగిఉండదు (నవ్వుతూ..). మీరు చెప్పారు కాబట్టి అది నిజమవుతుందేమో అని అనిపిస్తోంది. 

* ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలకాబోతుంది. మీరు పాన్‌ ఇండియా హీరో అయిపోయాననుకుంటున్నారా?

నిఖిల్: గతంలోనే దీని గురించి చెప్పా. ఈ సినిమాలో హీరో నేను కాదు. మా కథే  హీరో. ఇలాంటి మంచి సబ్జెక్ట్‌ ఎక్కువ మందికి చేరాలనే ఉద్దేశంతోనే పలు భాషల్లో విడుదల చేస్తున్నాం. పాన్‌ ఇండియా కాదు.. దీన్ని మల్టీ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ అని మేం భావిస్తున్నాం.

* నటుడిగా 15 ఏళ్ల అనుభవం ఉన్న మీకే సినిమా విడుదల విషయంలో ఇలా జరిగితే కొత్తగా వచ్చే వారి పరిస్థితేంటి?

నిఖిల్: జీవితంలో మనం అనుకున్నది ఏదీ అంత తేలికగా అయిపోదు. సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఉంటేనే విజయం సాధిస్తాం. సినీ రంగమే కాదు ఏ ఫీల్డ్‌లోకైనా ధైర్యంగా అడుగుపెట్టండి. విజయం వరిస్తుంది.

* ‘కార్తికేయ’కి ‘కార్తికేయ 2’కి కనెక్షన్ ఉంటుందా? ‘కార్తికేయ’ హీరోయిన్‌ స్వాతి ఇందులో కనిపిస్తారా?

చందూ: ‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’.. రెండు వేర్వేరు అడ్వెంచర్‌ చిత్రాలు. రెండింటికీ కనెక్షన్‌ అని కాదుగానీ ఇంచుమించు ఒకే థీమ్‌లో సాగుతాయి. ఒకవేళ ‘కార్తికేయ’ సినిమా చూడకపోయినా సీక్వెల్‌ అర్థమవుతుంది. ‘కార్తికేయ 2’లో స్వాతి పాత్రను తీసుకొద్దామని ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. ఈ చిత్రానికి మరికొన్ని సీక్వెల్‌ తీయాలనే ఆలోచన ఉంది.

* ‘కార్తికేయ’లో యానిమల్‌ హిప్నాటిజం గురించి చూపించారు. సీక్వెల్‌లో ఆ కాన్సెప్ట్‌ ఉంటుందా?

చందూ: అది ఉంటుందా, లేదా? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

* బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ని ఎంపిక చేయడానికి కారణం?

చందూ: ఈ సినిమా స్టోరీ ఎక్కువగా హిమాచల్‌ ప్రదేశ్‌ చుట్టూ తిరుగుతుంది. సంబంధిత కీలక సన్నివేశాల కోసం ముగ్గురు ప్రముఖ నటులను అనుకున్నాం. చివరగా అనుపమ్‌ ఖేర్‌ని తీసుకున్నాం. మా నిర్మాత అభిషేక్‌ గారికి ఆయన బాగా పరిచయం. (అభిషేక్‌ నిర్మించిన ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంలో అనుపమ్‌ ప్రధాన పాత్ర పోషించారు).


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు