రివ్యూ: చావు కబురు చల్లగా

కార్తికేయ బస్తీ బాలరాజుగా నటించిన ‘చావు కబురు చల్లగా’ ఎలా ఉందంటే?

Updated : 19 Mar 2021 16:02 IST

చిత్రం: చావు క‌బురు చల్లగా; న‌టీన‌టులు:  కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని, ముర‌ళీ శ‌ర్మ‌, శ్రీకాంత్ అయ్యంగార్‌ త‌దిత‌రులు; సంగీతం:  జేక్స్ బిజోయ్; ఛాయాగ్రహ‌ణం:  కార్మ్ చావ్లా; క‌ళ‌: జి.ఎం. శేఖ‌ర్‌; కూర్పు: స‌త్య జి.; నిర్మాత‌: బ‌న్ని వాసు; ద‌ర్శ‌క‌త్వం:  కౌశిక్ పెగ‌ళ్లపాటి; నిర్మాణ సంస్థ‌:  గీతా ఆర్ట్స్ 2; విడుద‌ల తేదీ: 19-03-2021

‘RX 100’లో శివగా కనిపించి యువ‌త‌ను అమితంగా ఆక‌ట్టుకున్నాడు కార్తికేయ‌. ఆ త‌ర్వాత అంత‌టి స్థాయి విజ‌యాన్ని అందుకోలేక‌పోయాడు. ఆ లోటు ‘చావు క‌బురు చ‌ల్లగా..’తో తీరుస్తాన‌ని అభిమానుల‌కు మాటిచ్చాడు. ఇక‌పై శివ‌గా కాదు బ‌స్తీ బాల‌రాజుగా గుర్తుండిపోతాన‌ని చెప్పాడు. మ‌రి కార్తికేయకి అనుకున్న ఫ‌లితం ద‌క్కిందా?ఈ బస్తీబాలరాజు కథేంటి?

కథేంటంటే: బ‌స్తీ బాల‌రాజు  (కార్తికేయ) మార్చురీ వ్యాన్‌ నడిపే డ్రైవర్‌.  మ‌ల్లిక (లావ‌ణ్య త్రిపాఠి) ప్ర‌భుత్వాసుప‌త్రిలో న‌ర్సు.  ప‌‌నిలో భాగంగా ఓ రోజు శ‌వాన్ని తీసుకెళ్లేందుకు శేఖ‌ర్ స్యాముయేల్‌ ఇంటికి వెళ్తాడు బాల‌రాజు. అక్క‌డ మ‌ల్లికని చూసి ఆమెను ఇష్ట‌ప‌డ‌తాడు. బాల‌రాజు తీసుకెళ్లే శ‌వం ఎవ‌రిదో కాదు మ‌ల్లిక భ‌ర్త‌ది. ఈ విష‌యం తెలిసినా స‌రే మ‌ల్లిక వెంట‌ప‌డ‌టం మానడు బాల‌రాజు. ఎలాగైనా మ‌ల్లిక‌ మ‌న‌సుని గెలిచేందుకు స‌ర్వ ప్ర‌యత్నాలు చేస్తుంటాడు. అలా వితంత‌వుని ప్రేమించే కొడుకుని వాళ్ల‌మ్మ గంగ‌మ్మ (ఆమ‌ని), మ‌ల్లిక అత్తామామ‌లు (మురళీ శ‌ర్మ‌, ర‌జిత‌) అంగీక‌రిస్తారా?  బాల‌రాజు, మ‌ల్లిక ఒక‌ట‌వుతారా?  తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: వితంతు వివాహాలు సాంఘిక దురాచారమన్న మూఢనమ్మకాన్ని పోగొట్టడానికి ఎంతోమంది సంఘ సంస్కర్తలు విశేషంగా కృషి చేశారు. నేటి ఆధునిక కాలంలోనూ వితంతువుల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం దురదృష్టకరం. భర్తను కోల్పోయిన మహిళను ప్రేమించడం అనే కాన్సెప్ట్‌ తెలుగు తెర‌కు కొత్త కాకపోయినా, ఇలాంటి ప్రేమ క‌థ‌లు రావడం అరుదు. అవి ఎక్కువ‌గా ఎమోష‌న్ కోణంలో సాగితే ఈ ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ పూర్తిగా ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఇందులో శ‌వం ద‌గ్గ‌ర ప్రేమ పుట్ట‌డం అన్న పాయింటే ఆస‌క్తిక‌రం. ‘రోజూ బడికి పోయేటోడు బళ్లో పిల్లని చూసి ఇష్టపడతాడు.. రోజూ ఆఫీస్‌కు పోయేవాడు ఆఫీస్‌లో పిల్లను చూసి ఇష్టపడతాడు.. పొద్దున్న లేస్తే నాలా చావులకు పోయేటోడు చావుకాడ కాకపోతే ఇంకెక్కడ చూసి ఇష్టపడతాడు మల్లి’ అంటూ కథానాయకుడితోనే డైలాగ్‌ చెప్పించి ప్రేక్షకులను కథకు కనెక్ట్‌ అయ్యేలా చేశాడు దర్శకుడు. వితంతువు అయిన మల్లికను బాలరాజు ప్రేమించటం, ఆమె ఉన్న చోటుకు వెళ్లి తన ప్రేమను వ్యక్తం చేసే సన్నివేశాలు నవ్వులు పంచుతూ హాయిగా సాగిపోతాయి. ప్రథమార్ధం బాలరాజు అతని స్నేహితులు, మల్లికతో వచ్చే సన్నివేశాలతో సరదాగా సాగిపోతుంది.

ద్వితీయార్ధంలో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. నాయ‌కా నాయికకి, హీరోకి త‌న తల్లికి, హీరోకి హీరోయిన్ మామ‌య్య‌కి మ‌ధ్య ‌సన్నివేశాలు కాస్త సీరియస్‌గా సాగుతాయి. ఆయా సందర్భాల్లో వచ్చే సంభాషణలు భావోద్వేగానికి గురిచేస్తాయి.  తండ్రి ఉండ‌గానే క‌‌థానాయ‌కుడు త‌న త‌ల్లికి రెండో పెళ్లి చేయాల‌నుకోవ‌డం ప్రేక్ష‌కుల‌కి కాస్త ఇబ్బందిగా అనిపించొచ్చు. అయితే, ఇక్కడ కూడా బాల్య వివాహాల వల్ల మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారన్న సందేశాన్ని కథానాయకుడి తల్లి పాత్ర ద్వారా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. త‌న త‌ల్లి జీవితం గురించి నాయిక‌కీ, నాయిక మామ‌య్య‌కి క‌థానాయ‌కుడు వివ‌రించే తీరు ఓకే అనిపిస్తుంది.  ‘ప్రేమ అంటే ఇద్ద‌రు మ‌నుషుల మ‌ధ్య మాత్ర‌మే కాదు పుట్టుక‌కి, చావుకి మ‌ధ్య ఉండేది’ వంటి డైలాగ్‌లు అలరిస్తాయి. అందరూ ఊహించిన ముగింపుతోనే కథను సుఖాంతం చేశాడు దర్శకుడు.  ‘అనసూయ’ ప్ర‌త్యేక గీతం సినిమాకు అదనపు ఆకర్షణ.

ఎవ‌రెలా చేశారంటే:  కార్తికేయ త‌నని తాను పూర్తిగా మార్చుకుని న‌టించిన చిత్ర‌మిది. విశాఖ జిల్లా యాస‌తో బ‌స్తీ నేప‌థ్యంలో సాగే పాత్ర‌లో న‌టించ‌డం కొంచెం క‌ష్ట‌మే. ఈ ప్ర‌య‌త్నంలో మంచి మార్కులే ప‌డ్డాయి కార్తికేయ‌కు.  హాస్యం, భావోద్వేగాల ప‌రంగా మంచి ప్రతిభ‌ని ప్రద‌ర్శించాడు‌‌. డ్యాన్సుల్లోనూ మంచి జోరు చూపించాడు. అందానికి అంత‌గా ప్రాధాన్య‌త లేక‌పోయినా ఉన్నంత మేర  అందంగా కనిపించి, వితంతువు పాత్ర‌లో అభిన‌యం ప్ర‌ద‌ర్శించి మెప్పించింది లావ‌ణ్య‌. చ‌నిపోయిన వ్య‌క్తిగా వేషం వేసి క‌డుపుబ్బా న‌వ్వించాడు భ‌ద్రం. ఆచంట మ‌హేశ్ కొన్ని స‌న్నివేశాల్లో క‌నిపించి సంద‌డి చేశాడు. క‌థ‌లో భాగంగా కార్తికేయ‌, ఆమ‌ని మాట్లాడుకునే మాట‌లు న‌వ్వులు పంచుతాయి. కొడుకుని పోగొట్టుకున్న తండ్రిగా, కోడ‌లిని కూతురిగా చూసుకునే మామ‌య్య‌గా ముర‌ళీ శ‌ర్మ  ఆక‌ట్టుకున్నారు. ర‌జిత‌, శ్రీకాంత్ అయ్యంగార్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేర‌కు న‌టించారు. ప్ర‌త్యేక గీతంలో అన‌సూయ‌, ప్రత్యేక పాత్ర‌లో త‌నికెళ్ల భ‌ర‌ణి మెరిశారు. సాంకేతికంగానూ సినిమా బాగుంది. జేక్స్ బిజోయ్ అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం చిత్రానికి మ‌రింత బ‌లం చేకూర్చాయి.  కార్మ్ చావ్లా కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి. దర్శకుడు తాను చెప్పాల‌నుకున్న పాయింట్‌ని సూటిగా తెర‌పై ఆవిష్క‌రించడంలో విజ‌యం అందుకున్నారు. ఆయ‌న రాసిన మాట‌లు ఆక‌ట్టుకుంటాయి. అయితే, క‌థానాయ‌కుడి తల్లి పాత్ర కొంచెం మెరుగ్గా రాసుకుని ఉంటే బాగుండేది. తల్లీకొడుకుల మ‌ధ్య వ‌చ్చే కొన్ని మాట‌లు ఇబ్బందిగా అనిపిస్తాయి.

బలాలు బ‌ల‌హీన‌త‌లు
+ నాయ‌కానాయిక‌ల న‌ట‌న -హీరో, త‌ల్లి మ‌ధ్య సాగే సంభాష‌ణ‌లు
+ మాట‌లు - కథనం
+ కామెడీ  

చివ‌రిగా: ‘చావు కబురు చ‌ల్ల‌గా’ సాగిపోతుంది సరదా.. సరదాగా..!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని