Good Luck Sakhi review: రివ్యూ గుడ్‌లక్‌ సఖి

Good Luck Sakhi Movie review: కీర్తి సురేశ్‌, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించిన ‘గుడ్‌లక్‌ సఖి’ సినిమా ఎలా ఉందంటే?

Published : 28 Jan 2022 16:12 IST

చిత్రం: గుడ్‌లక్‌ సఖి; నటీనటులు: కీర్తి సురేష్‌, ఆది పినిశెట్టి, జగపతిబాబు, రమాప్రభ, రాహుల్‌ రామకృష్ణ; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; సినిమాటోగ్రఫీ: చిరంతన్‌ దాస్‌; ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌; నిర్మాత: సుధీర్‌ చంద్ర పదిరి; బ్యానర్‌: రాత్‌ ఎ షాట్‌ మోషన్‌ ఆర్ట్స్‌; రచన, దర్శకత్వం: నాగేశ్‌ కుకునూరు; విడుదల: 28-01-2022

‘మ‌హాన‌టి’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది న‌టి కీర్తి సురేష్‌(keerthy suresh). ఆ విజ‌య‌ స్ఫూర్తితో వ‌రుస‌గా నాయికా ప్రాధాన్య క‌థ‌లు ఎంచుకుంటూ జోరు చూపించింది. కానీ, వాటిలో ఏ ఒక్క‌టీ కీర్తికి ఆశించిన స్థాయిలో పేరు తీసుకురాలేక‌పోయాయి. ఇప్పుడీ క్ర‌మంలోనే ‘గుడ్‌ల‌క్ స‌ఖి’గా మ‌రోసారి అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది. కీర్తి సురేష్ న‌టించిన తొలి క్రీడా నేప‌థ్య చిత్ర‌మిది. న‌గేష్ కుకునూర్ తెర‌కెక్కించారు. క‌రోనా ప‌రిస్థితుల వ‌ల్ల  ప‌లుమార్లు వాయిదా ప‌డిన ఈ సినిమా.. ఎట్టకేల‌కు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.  దీనికి దిల్‌రాజు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తుండటం..  పాట‌లు, ప్ర‌చార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండ‌టంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డంలో ఈ చిత్రం స‌ఫ‌ల‌మైందా?  కీర్తి మ‌ళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిందా?

క‌థేంటంటే: ఒక‌ మారుమూల ప‌ల్లెటూరిలో పుట్టి పెరిగిన‌ బంజార యువ‌తి స‌ఖి (కీర్తి సురేష్‌). దుర‌దృష్టానికి చిరునామాగా నిలిచే ఆమెను.. ఊరి వారంతా బ్యాడ్ ల‌క్ స‌ఖి అని పిలుస్తుంటారు. ఆమె అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి చాలా ఇష్టం. వాళ్లిద్ద‌రూ చిన్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులు. స‌ఖి గురిపై రాజుకు మ‌హా న‌మ్మ‌కం. ఆమెలోని ఆ ప్ర‌తిభ‌ను గుర్తించే.. షూటింగ్ వైపు తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఇందుకోసం త‌మ ఊరికి వ‌చ్చిన క‌ల్న‌ల్ (జ‌గ‌ప‌తిబాబు) స‌హాయం తీసుకుంటాడు. ఆయ‌న ఓ రిటైర్డ్‌ ఆర్మీ అధికారి. దేశం గ‌ర్వ‌ప‌డేలా మంచి షూట‌ర్స్‌ను త‌యారు చేయాల‌న్న‌ది ఆయ‌న క‌ల‌. స‌ఖిలోని ప్ర‌తిభ న‌చ్చి ఆమెకు షూటింగ్‌లో శిక్ష‌ణ ఇస్తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? ఈ ఆటలో పైకి ఎదిగే క్ర‌మంలో స‌ఖికి ఎదురైన స‌వాళ్లేంటి? వాట‌న్నింటినీ దాటుకుని ఎలా విజ‌యం సాధించింది? త‌న పేరును గుడ్ ల‌క్ స‌ఖిగా ఎలా మార్చుకుంది?  స‌ఖి - గోలిరాజుల ప్రేమ‌క‌థ ఏమైంది? అన్న‌ది తెర‌పై చూడాలి.

ఎలా సాగిందంటే:  తెలుగు తెర‌పై ఇప్ప‌టి వ‌ర‌కూ అనేక క్రీడా నేప‌థ్య చిత్రాలు మెరిసినా.. షూటింగ్ ఆట నేప‌థ్యంలో సాగే సినిమాలు పెద్ద‌గా రాలేద‌నే చెప్పాలి. ఇప్పుడా లోటును ‘గుడ్‌ల‌క్ స‌ఖి’ తీర్చేసింది. నిజానికి ఇలాంటి క్రీడలను ఆధారం చేసుకుని.. ర‌స‌వ‌త్త‌ర‌మైన క‌థ‌ను సిద్ధం చేసుకోవ‌డం ఏ ద‌ర్శ‌కుడికైనా క‌త్తిమీద సాము అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్క‌డ క‌థ మొత్తం ఒక ఆట‌గాడి చుట్టూనే తిరుగుతుంటుంది. ఎలాంటి భావోద్వేగాలైనా.. సంఘ‌ర్ష‌ణ అయినా ఆ ఒక్క పాత్ర నుంచే స‌మ‌ర్థ‌ంగా రాబ‌ట్టుకోవాల్సి ఉంటుంది. అదే క్రికెట్‌, హాకీ లాంటి బృంద ఆట‌ల్లో అయితే.. తెర‌పై క‌నిపించే ప్ర‌తీ ఆట‌గాడి నుంచి ఎమోష‌న్స్ పిండుకోవ‌చ్చు. అవ‌న్నీ ప్రేక్ష‌కుల్ని క‌థ‌లో లీనం చేయ‌డంలో ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఒకే వ్యక్తి పాల్గొనే ఆట‌ల విష‌యంలో ఇలాంటి వెసులు బాటు ఉండ‌దు కాబ‌ట్టి.. ఉన్న ఒక్క ఆట‌గాడి పాత్రనే భావోద్వేగ‌భ‌రితంగా.. చ‌క్క‌టి సంఘ‌ర్ష‌ణ‌తో తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది. కానీ, ‘గుడ్‌ల‌క్ స‌ఖి’ విష‌యంలో ఈ అల్లిక స‌రిగ్గా కుద‌ర్లేదు. 

సినిమా ఆరంభం నుంచే స‌ఖి పాత్ర‌కు స‌రైన ల‌క్ష్యం ఉందా? అన్న అనుమానం ప్రేక్ష‌కుల్ని వెంటాడుతుంటుంది. ఊరంతా ఆమెని బ్యాడ్‌ల‌క్ స‌ఖి అంటుంటే.. ఆ పేరును మార్చాల‌న్న ఆశ‌యం గోలిరాజు పాత్ర‌లో క‌నిపిస్తుందే త‌ప్ప‌, స‌ఖి పాత్ర‌లో క‌నిపించ‌దు. మ‌రోవైపు  ప‌ల్లెటూరిలోని యువ‌తను దేశం గ‌ర్వించే షూట‌ర్స్‌గా త‌యారు చేయాల‌న్న క‌ల్న‌ల్ ల‌క్ష్యం వెన‌కున్న కార‌ణ‌మేంటో ఎక్క‌డా చూపించ‌లేదు. నిజానికి ఇలాంటి క‌థ‌ల్లో ఎవ‌రో ఒక‌రి క‌థ‌లో బ‌ల‌మైన సంఘ‌ర్ష‌ణ క‌నిపించాలి. కానీ, ఈ మూడు పాత్ర‌ల్లో వేటిలోనూ అది క‌నిపించ‌లేదు.  దీంతో తెర‌పై క‌థ క‌దిలిపోతుంటుంది త‌ప్ప‌.. ప్రేక్ష‌కులు ఏ మాత్రం ఆ క‌థ‌తో ప్ర‌యాణం చేసే ప‌రిస్థితులు క‌నిపించ‌వు. ఆరంభంలో కీర్తి ప‌రిచ‌య స‌న్నివేశాలు ఎంత సాదాసీదాగా ఉంటాయో.. ముగింపు వ‌ర‌కు సినిమా అదే టెంపోలో సాగుతుంటుంది. ప్ర‌ధ‌మార్ధం మ‌ధ్య‌లో స‌ఖి, గోలిరాజుల ప్రేమ‌క‌థ కాస్త కాల‌క్షేపాన్నిచ్చినా.. అదంత భావోద్వేగ‌ంగా ఉండ‌దు. క‌ల్న‌ల్ పాత్ర ఎంట్రీ త‌ర్వాతే క‌థ‌లో కాస్త వేగం పెరుగుతుంది. స‌ఖిని షూట‌ర్‌గా మార్చే క్ర‌మంలో క‌ల్న‌ల్ చేసే ప్ర‌య‌త్నాల‌న్నీ సినిమాటిక్‌గా అనిపిస్తాయి. విరామానికి ముందు స‌ఖి హైద‌రాబాద్‌లో షూటింగ్ టోర్న‌మెంట్‌ను గెల‌వడం కూడా చాలా సాదాసీదాగా అనిపిస్తుంది త‌ప్ప ఆట‌లో ఏమాత్రం  సంఘ‌ర్ష‌ణ క‌నిపించ‌దు. 

నిజానికి ఏ స్పోర్ట్స్ డ్రామా చిత్రాల‌కైనా ద్వితీయార్ధం వెన్నెముక‌లా నిలుస్తుంది. ఆట‌లో ఓ బ‌ల‌మైన స‌వాల్ ఎదుర‌వ‌డం.. వాటిని ఎదుర్కొనే క్ర‌మంలో ఎదురొచ్చే అడ్డంకులు.. ఫ‌లితంగా ఎదురయ్యే వ‌రుస ప‌రాజ‌యాలు.. వాట‌న్నింటినీ దాటొచ్చి ఆఖ‌రికి ఎలా విజ‌యం సాధించార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా అనిపిస్తుంది. ఇలాంటి ఎత్తుప‌ల్లాలు, స‌వాళ్లు స‌ఖి ఆట చుట్టూ ఏమాత్రం క‌నిపించ‌వు. దీనికి తోడు ద్వితీయార్ధానికి వ‌చ్చే స‌రికి స‌ఖి త‌న గురువు క‌ల్న‌ల్‌పై  ప్రేమ పెంచుకున్న‌ట్లు చూపించారు. ఇది మ‌రీ ఎబ్బెట్టుగా అనిపిస్తుంది.  మ‌రోవైపు గోలిరాజు - స‌ఖిల ప్రేమ‌క‌థ మ‌రీ పేల‌వంగా త‌యార‌వ‌డం.. షూటింగ్ ఆట చుట్టూ సాగే క‌థ మ‌రీ సంఘ‌ర్ష‌ణ రహితంగా మారిపోవ‌డంతో సినిమా ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష‌లా మారుతుంది. ఇక ముగింపులో వ‌చ్చే షూటింగ్ పోటీ మ‌రీ సిల్లీగా అనిపిస్తుంది. ఆ ఎపిసోడ్‌లో ఓ కోచ్ పాత్ర ‘‘ఇదేం మ్యాచ్ ఇంత చిత్ర విచిత్రంగా సాగుతుంది’’ అని ఓ డైలాగ్ చెబుతుంది. ఆ  క్లైమాక్స్ మ్యాచ్ చూశాక‌.. ప్రేక్షకుల అనుభూతికి కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది.

ఎవ‌రెలా చేశారంటే:  బంజారా యువ‌తిగా స‌ఖి పాత్ర‌లో కీర్తి సురేష్ ఎంతో చ‌క్క‌గా ఒదిగిపోయింది. ఆ యాస‌లో ఆమె ప‌లికిన సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకుంటాయి. ప్ర‌ధ‌మార్ధంలో కొన్ని చోట్ల ఆదితో ఆమె కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటుంది. అలాగే ద్వితీయార్ధంలో జ‌గ‌ప‌తిబాబుతో ఆమె పోటీ ప‌డి న‌టించింది. నాట‌కాలు వేసుకునే వ్య‌క్తిగా గోలిరాజు పాత్ర‌లో ఆది చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌ర్చాడు. అయితే ఆ పాత్ర‌ను మ‌రింత శ‌క్తిమంతంగా తీర్చిదిద్దుకోలేక‌పోయారు. క‌ల్న‌ల్ పాత్ర‌కు జ‌గ‌ప‌తిబాబు నిండుత‌నం తెచ్చారు. ఆ పాత్ర సినిమాకి బ‌లాన్నిచ్చింది. ఆరంభంలో క‌థ‌ను మ‌లుపు తిప్పేలా క‌నిపించిన రాహుల్ రామ‌కృష్ణ పాత్ర... ఆ త‌ర్వాత పూర్తిగా తేలిపోయింది. ర‌ఘుబాబు, ర‌మాప్ర‌భ త‌దిత‌రులు ప‌రిధి మేర న‌టించారు. న‌గేష్ కొత్త స్పోర్ట్స్‌  డ్రామాను తెలుగుకు చూపించే ప్ర‌య‌త్నం చేసినా.. దాన్ని ఆక‌ట్టుకునేలా ఆవిష్క‌రించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. క‌థ‌లో ఎక్క‌డా స‌రైన రీతిలో భావోద్వేగాలు, సంఘ‌ర్ష‌ణ పండ‌క‌పోవ‌డం సినిమాకి ప్ర‌ధాన లోపం.  ఫ‌లితంగా సినిమా ఆద్యంతం నెమ్మ‌దిగా సాగుతున్న అనుభూతినిచ్చింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం ఫ‌ర్వాలేద‌నిపించింది. పాట‌లు విన‌సొంపుగా ఉన్నా.. మ‌ళ్లీ మ‌ళ్లీ పాడుకునేలా అయితే లేవు.  నేప‌థ్య సంగీతం మెప్పిస్తుంది. చిరంత‌న్ దాస్ ఛాయాగ్ర‌హ‌ణం క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా చ‌క్క‌గా కుదిరింది. నిర్మాణ విలువ‌లు ఫ‌ర్వాలేద‌నిపించాయి.

బ‌లాలు

+ కీర్తి, ఆది, జ‌గ‌ప‌తిబాబుల న‌ట‌న

+ షూటింగ్ ఆట నేప‌థ్యం

బల‌హీన‌త‌లు

- పేల‌వ‌మైన స్క్రీన్‌ప్లే

- ఆట‌లో క‌నిపించ‌ని సంఘ‌ర్ష‌ణ‌

చివ‌రిగా:  స‌ఖి.. బెట‌ర్ ల‌క్ నెక్ట్స్‌ టైమ్‌.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని