Keerthy Suresh: ఛాలెంజ్‌ అంటే ఇదే కదా?

‘నటిగా నాకు ఇది పండగ తరహా సమయం’ అంటోంది కీర్తిసురేష్‌. చిత్రసీమలో అవకాశమే కీలకమని, అది వచ్చాక మనం ఏం చేయగలమో అవన్నీ చూపించాల్సిందే అంటోందామె. ‘సర్కారు వారి

Updated : 12 May 2022 09:08 IST

‘నటిగా నాకు ఇది పండగ తరహా సమయం’ అంటోంది కీర్తిసురేష్‌. చిత్రసీమలో అవకాశమే కీలకమని, అది వచ్చాక మనం ఏం చేయగలమో అవన్నీ చూపించాల్సిందే అంటోందామె. ‘సర్కారు వారి పాట’ సినిమాతో కీర్తిసురేష్‌లో మరో కోణాన్ని చూస్తారని చెబుతోంది. ఆ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొస్తున్న విషయం తెలిసిందే. కళావతిగా ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన కీర్తి బుధవారం విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...

‘‘కళావతి పాత్ర నాకు నిజంగానే ఓ పెద్ద బహుమతి. ఇలాంటి పాత్రలు తెలుగులో ఇంతకు ముందు చేయలేదు. నాటీగా కనిపిస్తూ నవ్వించే ఓ వైవిధ్యమైన పాత్ర. నేను తెరపైన కనిపించే సమయమూ ఎక్కువే. ఓ వాణిజ్య సినిమాలో ఇంత ప్రాధాన్యమున్న పాత్ర రావడం అరుదు కదా. తెలుగులో నేను చేసిన సినిమాలూ తక్కువే. ‘మహానటి’ నా నాలుగో చిత్రం. తమిళంలోనే ఎక్కువ చేశాను. ‘మహానటి’ తర్వాత నాకు వాణిజ్య ప్రధానమైన సినిమా రావడానికి కొంచెం సమయం పట్టింది. అంతకుముందు ‘అజ్ఞాతవాసి’ చేశాను కానీ, అందులో ఇలాంటి మాస్‌ పాత్ర కాదు. ఈ పాత్ర కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది’’.

* ‘‘మహేష్‌, నేను కలిసి నటించడం ఇదే తొలిసారి. ఆయన ఇలాంటి ఓ మాస్‌ పాత్ర చేసి చాలా రోజులైంది. వాణిజ్య సినిమాల్లో లవ్‌ట్రాక్‌ అనేది ఎప్పుడూ విడిగానే ఉంటుంది. ఇందులో కథలో భాగంగానే ఉంటుంది. ప్రేక్షకుల్ని ఏడిపించడం, నవ్వించడం అంత సులభం కాదు. పైగా ఇందులో నా పాత్రకి సంభాషణలు ఓ ప్రత్యేకమైన యాసలో రాశారు దర్శకుడు’’.

* ‘‘మహేష్‌బాబు చాలా స్వీట్‌. మంచి సహనటుడు. సెట్లో చాలా సాధారణంగా ఉంటారు. సైలెంట్‌గా పంచ్‌లు వేస్తుంటారు. సినిమా, పరిశ్రమ గురించి ఆయనకి చాలా విషయాలు తెలుసు. పక్కనున్న నటులకి  మంచి స్పేస్‌ ఇస్తారు. మ మ మహేషా పాటని నేను మహేష్‌ అభిమానిగానే చేశా. ఆ పాట నా జీవితాంతం గుర్తుండిపోతుంది’’.

* ‘‘నా కెరీర్‌లో ఈ దశలో ఓ వైవిధ్యం కనిపిస్తోంది. అది నాకు బాగా నచ్చింది. ‘చిన్ని’ సినిమాలో డీ గ్లామర్‌ పాత్ర, ఇందులో గ్లామర్‌ పాత్ర. నటులకి ఇదే కదా ఛాలెంజ్‌ అంటే. ఒకే  సమయంలో ఇలాంటి   వైవిధ్యమైన పాత్రలు చేసినందుకు నటిగా నాకు ఇదొక పండగ సమయంలా ఉంటుంది. నాలో అన్ని కోణాలూ ఉన్నాయి. ‘మహానటి’కి ముందు అందరూ నన్ను బబ్లీగా సాగే అందమైన పాత్రల కోసమే సంప్రదించారు. అనుకోకుండా ‘మహానటి’ అవకాశం వచ్చింది. ఇప్పుడేమో మళ్లీ నాకు పూర్తిస్థాయి మాస్‌ పాత్రలొస్తున్నాయి. మాస్‌ అంటే నాకు ఇష్టం. అవకాశం వస్తే అన్నీ చేస్తా’’.


‘‘చిరంజీవి, రజనీకాంత్‌లతో కలిసి నటించే అవకాశం అరుదుగా వస్తుంది. వాళ్ల సినిమాల్లో చెల్లెలి పాత్ర చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నానితో కలిసి ‘దసరా’ సినిమాలో నటిస్తున్నా. అదీ నాలోని నటికి సవాల్‌ విసిరే పాత్ర’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని