Ketika Sharma: ‘ఖుషి’లోని భూమికను గుర్తు చేస్తా: కేతిక శర్మ

ఫలితం గురించి ఆలోచించుకుండా పని చేస్తానంటోంది కేతికశర్మ. ‘రొమాంటిక్‌’తో యువతకు అందాల ట్రీట్‌ ఇచ్చిన కథానాయిక ఈమె. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ద్వితీయ ప్రయత్నంగా ‘లక్ష్య’ను ఎంపిక చేసుకుంది.

Updated : 29 Aug 2022 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఫలితం గురించి ఆలోచించకుండా పని చేస్తానంటోంది కేతిక శర్మ. ‘రొమాంటిక్‌’తో యువతకు అందాల ట్రీట్‌ ఇచ్చిన కథానాయిక ఈమె. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ద్వితీయ ప్రయత్నంగా ‘లక్ష్య’ను ఎంపిక చేసుకుని, ఆకట్టుకుంది. ఇప్పుడు.. ‘రంగ రంగ వైభవంగా’ సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రం సెప్టెంబరు 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా కేతిక శర్మ విలేకరులతో పంచుకున్న విశేషాలివీ..

* హీరోయిన్‌గా మూడు చిత్రాల్లో నటించారు.. ఏం నేర్చుకున్నారు?

కేతిక: రొమాంటిక్‌, లక్ష్య.. ఈ రెండు సినిమాలు నాకు చాలా నేర్పించాయి. రెండు చిత్ర బృందాలు నాకు చాలా సపోర్ట్‌ చేశాయి. అందుకే సినీ పరిశ్రమ నాకు కొత్త అయినా నేను కంగారు పడలేదు. కెరీర్‌ ప్రారంభంలోనే మంచి వ్యక్తుల పరిచయం నాలో స్ఫూర్తినింపింది. ఆయా చిత్రాల నటులు, సాంకేతిక నిపుణుల నుంచి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. నా మూడో సినిమా ‘రంగరంగ వైభవంగా’ వాటికి కాస్త భిన్నం. ఇందులో ఎక్కువమంది సీనియర్‌ నటులతో కలిసి నటించే అవకాశం లభించింది. ప్రభు, నరేశ్‌, తులసి, ప్రగతిలాంటి వారితో కలిసి తెరను పంచుకోవటం మరిచిపోలేని జ్ఞాపకం. నటిగా వారి దగ్గర ఎంతో నేర్చుకున్నా.

* మొదటి రెండు సినిమాలు మిశ్రమ ఫలితాన్నివ్వడం ఎలా అనిపించింది?

కేతిక: నేనసలు సినిమా ఫలితం గురించి ఆలోచించను. నా పాత్రకు ఎంతవరకు న్యాయం చేశాను? అని మాత్రమే ప్రశ్నించుకుంటా. అలా నా తొలి రెండు సినిమాలు నాకు నటిగా సంతృప్తి ఇచ్చాయి. ఏ సినిమాకైనా నా పూర్తి స్థాయి నటన అందించడానికి కృషి చేస్తా.

* ఎలాంటి కథలను ఎంపిక చేసుకోవాలనుకుంటారు?

కేతిక: ‘రొమాంటిక్‌’ పూర్తిగా యూత్‌ ఓరియెంటెడ్ సినిమా. ‘లక్ష్య’ క్రీడా నేపథ్యంలో వచ్చింది. ‘రంగ రంగ వైభవంగా’.. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. నేనెప్పుడూ ఒకే రకమైన కథలను ఎంపిక చేసుకోవాలనుకోను. సినిమా సినిమాకీ వైవిధ్యం ఉండేలా చూసుకుంటా. అందుకే నేను నటించిన మూడు సినిమాలు మూడు నేపథ్యాల్లో ఉంటాయి.

* ‘రంగ రంగ వైభవంగా’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?

కేతిక: ఈ సినిమాలో నా పాత్ర పేరు రాధ. పక్కింటమ్మాయిలా కనిపిస్తా. తెలుగు ప్రేక్షకులకు నన్ను మరింత దగ్గర చేసే పాత్ర ఇది. ఇంతకుముందు సినిమాల్లో గ్లామర్‌ రోల్స్‌ చేశా. రాధ పాత్ర వాటికి భిన్నంగా సంప్రదాయంగా ఉంటుంది. నటనకు ఎక్కువ ఆస్కారం ఉంది. ‘ఖుషి’ సినిమాలోని కథానాయిక భూమిక పాత్రను గుర్తుచేస్తుంది.

* వైష్ణవ్‌ తేజ్‌ గురించి చెప్తారా?

కేతిక: వైష్ణవ్‌ తేజ్‌ చాలా సింపుల్‌గా ఉండే నటుడు. నాకు బెస్ట్‌ ఫ్రెండ్‌ కూడా. నేనూ వైష్ణవ్, నవీన్‌ చంద్ర సెట్స్‌లో ఎక్కువ అల్లరి చేసేవాళ్లం. వైష్టవ్‌ క్రమశిక్షణ నాకు బాగా నచ్చుతుంది. ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమాలో నటించాం. మాకు షూటింగ్ అంటే ఓ పిక్నిక్‌కి వెళ్లినంత సరదాగా ఉండేది.

* తెలుగమ్మాయిగా నటించారు. తెలుగు ఎంతవరకు నేర్చుకున్నారు?

కేతిక: తెలుగు పూర్తిగా అర్థమవుతోంది. కొంతవరకు మాట్లాడగలుగుతున్నా. నా తొలి రెండు సినిమాల నుంచి ‘రంగరంగ  వైభవంగా’ చిత్రానికి వచ్చేసరికి ఆశించిన స్థాయిలో భాషను నేర్చుకున్నా. త్వరలోనే పూర్తి స్థాయిలో నేర్చుకుంటా. ఎందుకంటే నటిగా నా తొలి ప్రాధాన్యం తెలుగు సినిమాలకే.

* సోషల్‌ మీడియాలో మీరు చురుకుగా ఉంటారు. అభిమానుల కామెంట్లు చదువుతారా?

కేతిక: అభిమానులు, నెటిజన్లు పెట్టిన కామెంట్లను అప్పుడప్పుడూ చూస్తుంటా. కావాలని విమర్శించే వారిని పట్టించుకోను. సద్విమర్శలను మనస్ఫూర్తిగా స్వీకరిస్తా. ఏ విషయంలో నేను వెనకున్నానో చెక్‌ చేసుకుని మరింత మెరుగ్గా నటించేందుకు అవి ఉపయోగపడతాయి. 

* తదుపరి ప్రాజెక్టులు?

కేతిక: నా దృష్టంతా సినిమాలపైనే ఉంది. ఓటీటీ కంటెంట్‌లో నటించాలనే ఆలోచన ప్రస్తుతానికి లేదు. కొన్ని సినిమా కథలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తా. బయోపిక్‌ చిత్రాల్లో నటించాలనేది నా డ్రీమ్‌.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts