KGF Avinash: కేజీయఫ్‌ విలన్‌కు రోడ్డు ప్రమాదం... మీ ప్రేమ వల్ల బతికా: అవినాశ్‌

కేజీయఫ్‌’  సిరీస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ బాగా దగ్గరైన కన్నడ నటుడు బి.ఎస్‌. అవినాష్‌. ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన క్షేమం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

Published : 02 Jul 2022 02:15 IST

బెంగళూరు: ‘కేజీయఫ్‌’ (KGF) సిరీస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన కన్నడ నటుడు బి.ఎస్‌. అవినాష్‌ (BS Avinash). ఇటీవల ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన క్షేమం కోరిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘బుధవారం ఉదయం 6: 05 గం.ల సమయంలో నా జీవితంలో ఎప్పుడూలేని భయాన్ని చూశా. ఊహించలేని ఘటన ఇది. సెకన్ల వ్యవధిలో అంతా తారుమారైనట్టుంది. అనిల్‌ కుంబ్లే కూడలి వైపు వెళ్తుండగా రెడ్‌ సిగ్నల్‌ క్రాస్‌ చేసిన ఓ కంటైనర్‌ నా కారును ఢీ కొట్టింది. కారు ధ్వంసమైంది కానీ, మీ ప్రేమాభిమానాల వల్ల నాకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటన నుంచి తేరుకునేలా నాకు సహకరించిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీసు, ఆర్టీవో అధికారులు, ‘సుందరం మోటార్స్‌’ మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ ఆశీస్సుల వల్లే నేనిలా ఉన్నాను’’ అని అవినాష్‌ భావోద్వేగానికి గురయ్యారు.

విలాసవంతమైన ఆ కారును అవినాషే నడిపారు. ఆ సమయంలో ఆయన జిమ్‌కు వెళ్తున్నారు. రెడ్‌ సిగ్నల్‌ను పట్టించుకోకుండా కంటైనర్‌ డ్రైవరు ముందుకు వచ్చినట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో గుర్తించారు. కంటెయినర్‌ డ్రైవరు శివనగౌడను కబ్బన్‌పార్కు ట్రాఫిక్‌ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఈ ఘటన చోటుచేసుకోగా గురువారం వెలుగులోకి వచ్చింది. యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’లో ఆండ్రూస్‌ అనే పాత్ర పోషించారు అవినాష్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని