Hombale Films: ‘సలార్‌’ తర్వాతే ‘కేజీయఫ్-‌3’.. హోంబలే నిర్మాత అప్‌డేట్‌

Hombale Films on KGF-3: కేజీయఫ్‌-3పై ఓ అప్‌డేట్‌ ఇచ్చారు హోంబలే ఫిల్స్మ్‌ అధినేత విజయ్‌ కిరంగదూర్‌‌. ‘సలార్‌’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దీనిపై పనిచేయనున్నారని చెప్పారు. 

Published : 23 Dec 2022 14:49 IST

ముంబయి: ‘కేజీఎఫ్’‌ (KGF), ‘కాంతారా’ (Kantara) వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో ఈ ఏడాది భారీ వసూళ్లు అందుకున్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్స్మ్‌ (Hombale Films).. ఇప్పుడు దక్షిణాదిలోని ఇతర భాషా చిత్రాలపైనా దృష్టి పెట్టింది. దక్షిణాదిలో అన్ని భాషల్లో చిత్రాలు నిర్మించడంతో పాటు రాబోయే ఐదేళ్లలో రూ.3వేల కోట్లు చిత్ర పరిశ్రమలో పెట్టుబడిగా పెట్టనున్నట్లు హోంబలే ఫిల్మ్స్‌ నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ (Vijay Kiragandur) వెల్లడించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేజీయఫ్‌‌-3 (KGF-3) గురించీ ఓ అప్‌డేట్‌ ఇచ్చారు.

‘‘రాబోయే ఐదేళ్లలో రూ.3వేల కోట్ల మేర భారత వినోద పరిశ్రమలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించాం. మున్ముందు వినోద పరిశ్రమ మరింత వృద్ధి చెందబోతోంది. ఏటా కనీసం ఐదారు చిత్రాలు మా బ్యానర్‌ కింద నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందులో ఒక హిట్‌ సినిమాకు సీక్వెల్‌ ఉండబోతోంది. ప్రస్తుతానికి దక్షిణాదిలోని అన్ని భాషల్లో చిత్రాలు నిర్మించాలనుకుంటున్నాం’’ అని విజయ్‌ కిరంగదూర్‌ చెప్పారు.

హిందీలోనూ చిత్రాలు..

‘‘మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉన్న కథలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకుంటున్నాం. మన తర్వాతి తరాలకు వాటిని తెలియజేయాలన్నదే మా లక్ష్యం. హిందీలోనూ చిత్రాలు నిర్మించనున్నాం. ప్రస్తుతానికి ఇద్దరు హిందీ కథా రచయితలతో కలిసి పనిచేస్తున్నాం. ఒకసారి కథ సిద్ధమయ్యాక డైరక్టర్‌, నటులను అన్వేషిస్తాం. ముందుగా మంచి కథను సిద్ధం చేయాలనే లక్ష్యంతో ఉన్నాం’’ అని విజయ్‌ అన్నారు.

రాజ్‌కుమార్‌ మనవడితో..

ఈ సందర్భంగా తమ బ్యానర్‌లో రాబోతున్న చిత్రాల గురించి విజయ్‌ మాట్లాడారు. ప్రస్తుతం తమ బ్యానర్‌లో ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సలార్‌’ పనులు జరుగుతున్నాయని.. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న విడుదల కానుందని చెప్పారు. ‘దూమమ్‌’ పేరిట ఓ మల్టీ లాంగ్వేజ్‌ చిత్రాన్ని, ‘భగీర’ అనే ఓ కన్నడ చిత్రాన్ని, కీర్తి సురేశ్‌తో కలిసి ‘రఘుతాత’ అనే తమిళ చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. త్వరలో రాజ్‌కుమార్‌ మనవడు యువ రాజ్‌కుమార్‌ను తమ బ్యానర్‌లో  చిత్ర పరిశ్రమకు పరిచయం చేయబోతున్నామన్నారు. వచ్చే ఏడాది తమ బ్యానర్‌ నుంచి నాలుగైదు చిత్రాలు.. ఆ తర్వాత రెండేళ్లలో 12 నుంచి 14 చిత్రాలు రాబోతున్నాయని చెప్పారు. 2024లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘టైసన్‌’, రక్షిత్‌ శెట్టి ‘రిచర్డ్‌ ఆంటోనీ’ చిత్రాలతో పాటు సుధా కొంగర దర్శకత్వంలో మరో చిత్రం రాబోతుందని వివరించారు.

‘సలార్‌’ తర్వాతే..

2018లో కన్నడ చిత్రంగా వచ్చి భారీ విజయం అందకున్న చిత్రం కేజీయఫ్‌. దీనికి కొనసాగింపుగా ఈ ఏడాది కేజీయఫ్‌ చాప్టర్‌-2 వచ్చింది. అది కూడా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో కేజీయఫ్‌-3 ఎప్పుడు వస్తుందా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపైనా నిర్మాత అప్‌డేట్‌ ఇచ్చారు. ‘సలార్‌’ పూర్తయ్యాక ‘కేజీయఫ్‌-3’పై నీల్‌ దృష్టి పెట్టనున్నారని విజయ్‌ కిరంగదూర్‌ చెప్పారు. సలార్‌ పూర్తయ్యక.. కేజీయఫ్‌-3 స్క్రిప్ట్‌ పనులు మొదలు పెట్టనున్నారని తెలిపారు. నీల్‌ వద్ద ఇప్పటికే స్టోరీ లైన్‌ ఉందని, వచ్చే ఏడాది గానీ, ఆ మరుసటి ఏడాదిగానీ సాకారం కావొచ్చని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు