KFG Chapter 3: రాఖీ అభిమానులకు శుభవార్త.. ‘కేజీయఫ్‌3’ షూటింగ్‌ మొదలయ్యేది అప్పుడే!

పాన్‌ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాస్తోంది ‘కేజీయఫ్‌2’. ఇప్పటికే రూ.1000కోట్ల కలెక్షన్లు దాటి ‘ఆర్ఆర్ఆర్‌’ను

Updated : 14 May 2022 16:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: పాన్‌ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాస్తోంది ‘కేజీయఫ్‌2’(KGF chapter 2). ఇప్పటికే రూ.1000కోట్ల కలెక్షన్లు దాటి ‘ఆర్ఆర్ఆర్‌’ను దాదాపు బీట్‌ చేసేసింది. సినిమా విడుదలై నెల రోజులు అయినా ఇప్పటికీ బాలీవుడ్‌లో రాఖీభాయ్‌కు ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ఈ క్రమంలో ‘కేజీయఫ్‌’ అభిమానులకు మరో తీపి కబురు. ఈ ఏడాదిలోనే ‘కేజీయఫ్‌3’ (KGF chapter 3)షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ తెలిపారు. ‘మార్వెల్‌ యూనివర్స్‌’ తరహాలో ‘కేజీయఫ్‌3’(KGF chapter 3)ని ప్లాన్‌ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

‘‘ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్‌ ‘సలార్‌’ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. దాదాపు 30-35శాతం షూటింగ్‌ పూర్తయింది. వచ్చే వారం మొదలయ్యే తర్వాతి షెడ్యూల్‌లో సింహభాగం షూటింగ్‌ పూర్తి చేస్తాం. అక్టోబరు లేదా నవంబరు నాటికి సినిమా పూర్తవుతుంది. ఈ క్రమంలో ‘కేజీయఫ్‌3’ను అక్టోబరు నుంచి మొదలు పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ప్రీప్రొడక్షన్‌ వర్క్‌, షూటింగ్‌ ఇలా మొత్తం పూర్తవడానికి ఏడాది పైనే పడుతుంది. 2024లో ‘కేజీయఫ్‌3’ (KGF chapter 3)ని విడుదల చేయాలని భావిస్తున్నాం’’ అని విజయ్‌ కిరంగదూర్‌ తెలిపారు.

‘‘కేజీయఫ్‌3’(KGF chapter 3)ను మార్వెల్‌ యూనివర్స్‌ తరహాలో డిజైన్‌ చేసుకున్నాం. అంటే వివిధ చిత్రాల్లోని హీరోలు ఇందులో భాగస్వాములు అవుతారు. అంటే డాక్టర్‌ స్ట్రేంజ్‌, స్పైడర్‌ మ్యాన్‌ ఇలా ఆ పాత్రలన్నీ ఒక సినిమాలో కలిసినట్లే ఇందులోనూ వేర్వేరు సినిమాల్లో ఉన్న హీరోలు కలుస్తారు. దాని వల్ల మేము ప్రేక్షకులను చేరే పరిధి మరింత విస్తృతమవుతుంది’’ అని చెప్పుకొచ్చారు.

‘కేజీయఫ్‌:చాప్టర్‌-1’కి కొనసాగింపుగా ‘కేజీయఫ్‌: చాప్టర్‌2’ ఏప్రిల్‌ 14 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకూ అన్ని భాషల్లో కలిపి రూ.1180కోట్లకు పైగా వసూలు చేసింది. యశ్‌ నటన, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌ ఇలా ప్రతిదీ సినిమాను ఉన్నతస్థానంలో నిలిపాయి.  ‘కేజీయఫ్‌2’ చివరిలో తరువాయి భాగం ఉంటుందని దర్శకుడు హింట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. బంగారం నిండిన ఓడతో సహా రాఖీ సముద్రంలో మునిగిపోయినట్లు చూపించారు. మరి రాఖీ బతికాడా? లేక ఆ బంగారాన్ని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? కథా నేపథ్యం కేజీయఫ్‌ నుంచి విదేశాలకు వెళ్లిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని