KGF Chapter 2: ‘కేజీయఫ్‌’ 8 ఏళ్ల కష్టం.. అభిమానులారా అలా చేయకండి

సినిమాను ఫోన్లలో చిత్రీకరించి పైరసీని ప్రోత్సహించవద్దని ‘కేజీయఫ్‌’ చిత్ర బృందం సినీ అభిమానులకు విన్నవించింది. తెరపై సినిమా చూస్తున్నప్పుడు వీడియోలు, ఫొటోల తీసి వాటిని నెట్టింట  పోస్ట్‌ చేయొద్దని కోరింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది.

Published : 13 Apr 2022 23:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాను ఫోన్లలో చిత్రీకరించి పైరసీని ప్రోత్సహించవద్దని ‘కేజీయఫ్‌’ చిత్ర బృందం ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. తెరపై సినిమా చూస్తున్నప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి వాటిని నెట్టింట పోస్ట్‌ చేయొద్దని కోరింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ‘‘మా 8 ఏళ్ల కష్టానికి ప్రతిరూపం ‘కేజీయఫ్‌’. కేజీయఫ్‌ ఛాప్టర్‌ 2ను థియేటర్లలో చూస్తూ.. వీడియోలు చిత్రీకరించి, వాటిని ఆన్‌లైన్‌లో పెట్టకండి. సినిమాను చూడాలనుకునే వారిలో ఆసక్తిని తగ్గించకండి. మనమంతా థియేటర్లలోనే ‘కేజీయఫ్‌’ను ఎంజాయ్‌ చేద్దాం’’ అని పేర్కొంది. ఎవరైనా ఇలాంటి పని చేస్తే సంబంధిత వాట్సాప్‌ నంబర్లు, మెయిల్‌కు సమాచారం ఇవ్వవలసిందిగా కోరింది. ‘కేజీయఫ్‌’.. కన్నడ నటుడు యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందింది. తొలి అధ్యాయం 2018లో విడుదలై ఘన విజయం అందుకుంది. ‘ఛాప్టర్‌ 2’ గురువారం విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే పైరసీని అరికట్టాలని పిలుపునిచ్చింది. కిరంగదూర్‌ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్‌దత్‌, రవీనా టాండన్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీనిధి శెట్టి కథానాయిక.

ముంబయిలో కటౌట్‌

సినిమా విడుదల నేపథ్యంలోయశ్‌ అభిమానులు వేడుకలు ప్రారంభించారు. బ్యానర్లు, కటౌట్లతో సందడి చేస్తున్నారు. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ కేజీయఫ్‌ హంగామా షురూ అయింది. 100 అడుగుల యశ్‌ కటౌట్‌ ముంబయిలో దర్శనమిచ్చి, సినీ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

10వేలకు పైగా స్క్రీన్‌లలో కేజీయఫ్‌2 విడుదల

‘కేజీయఫ్‌2’ విడుదలతోనే మరో రికార్డు సృష్టించింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 10వేలకు పైగా స్క్రీన్‌లపై ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. నార్త్‌ ఇండియాలో 4400+, సౌతిండియాలో 2600+ ఓవర్సీస్‌(హిందీ)లో 1100, ఓవర్సీస్‌ (దక్షిణాది భాషలు) 2900 స్క్రీన్‌లపై ‘కేజీయఫ్‌2’ ను విడుదల చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని