Khakee: The Bihar Chapter Review: రివ్యూ: ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌

Khakee: The Bihar Chapter: పోలీస్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ ఎలా ఉందంటే?

Updated : 26 Nov 2022 10:00 IST

వెబ్‌సిరీస్‌: ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌; నటీనటులు: కరణ్‌ టక్కర్‌, అవినాష్‌ తివారి, అభిమన్యుసింగ్‌, నీరజ్‌ కశ్యప్‌, జతిన్‌ శరణ్‌, రవి కిషన్‌, అశుతోష్‌ రానా తదితరులు; సంగీతం: అద్వైత్‌ నిమేల్కర్‌; సినిమాటోగ్రఫీ: హరి నాయర్‌; ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కతికులోత్‌; నిర్మాత: శీతల్‌ భాటియా; రచన: నీరజ్‌ పాండే; దర్శకత్వం: భవ్‌ దులియా; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

సాధారణ కథలతో పోలిస్తే పోలీసు కథా చిత్రాలను వెండితెరపై చూస్తే వచ్చే మజానే వేరు. మనం చేయలేని పనుల్ని పోలీస్‌గా హీరో అదరగొడుతుంటే బాగుంటుంది. సమాజంలోని వాస్తవ సంఘటనల ఆధారంగానే ఎన్నో పోలీస్‌ కథలు వెండితెరపై మెరిశాయి. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెబ్‌ సిరీస్‌ ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’(Khakee: The Bihar Chapter). నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది?

కథేంటంటే: చందన్‌ మాతో (అవినాష్‌ తివారి) కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌. ఒక సాధారణ గ్రామస్థుడిగా జీవితం మొదలు పెట్టి  భూకబ్జాలు, అక్రమ మైనింగ్‌, ఇసుక మాఫియా ఒక్కటేంటి.. అతడు చేయని నేరం అంటూ ఉండదు. బిహార్‌లోనే మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఎదుగుతాడు. పోలీసులు కూడా అతడిని ఎప్పుడెప్పుడు పట్టుకుందామా? ఎన్‌కౌంటర్‌ చేద్దామా? అని ఎదురు చూస్తుంటారు. కానీ, రాజకీయ నేతలు, కొందరు పోలీస్‌ ఉన్నతాధికారుల అండదండలతో తప్పించుకుని తిరుగుతుండటమే కాదు, తనకు వ్యతిరేకంగా పనిచేసే వారిని దారుణంగా హత్యలు చేస్తాడు. ఈ క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న అమిత్‌లోథా (కరణ్‌ థాకర్‌) అనే యువ ఐపీఎస్‌ అధికారి బిహార్‌ వస్తాడు. తన శక్తి సామర్థ్యాలతో సమస్యలను పరిష్కరించడంతో.. చందన్‌ మాతోను పట్టుకునే బాధ్యత ప్రభుత్వం అతడికి అప్పగిస్తుంది. మరి చందన్‌ను.. అమిత్‌ ఎలా పట్టుకున్నాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరకు చందన్‌ దొరికాడా?

ఎలా ఉందంటే: ఒకప్పుడు బిహార్‌ అంటే.. రౌడీలు, గుండాలు, గ్యాంగ్‌స్టర్‌ల అడ్డాగా ఉండేది. వారి ఆగడాలను కట్టడి చేయడం అక్కడి పోలీసులకు కూడా సాధ్యమయ్యేది కాదు. కొన్ని చోట్ల ఈ గ్యాంగ్‌స్టర్స్‌ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతారంటే ఆశ్చర్యపడాల్సిన విషయమేమీ కాదు. అలాంటి ఒక క్రిమినల్‌కు, ఉడుకురక్తం కలిగిన ఐపీఎస్‌ అధికారికి మధ్య జరిగిన పోరు ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’.  2000 నుంచి 2010 మధ్యలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు. చందన్‌ మాతోను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించే సన్నివేశంతో సిరీస్‌ను మొదలు పెట్టాడు దర్శకుడు. ఉన్నతాధికారుల స్వార్థ ప్రయోజనాల కోసం  చివరి నిమిషంలో అలాంటి ఆపరేషన్స్‌ ఎలా ఆగిపోతాయో చాలా ఉత్కంఠగా చూపించారు.  అమిత్‌ లోథా బిహార్‌ రావడం, అక్కడ ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ వెళ్లడం ఇలా అతడి పరిచయంతో మొదటి ఎపిసోడ్‌ ముగుస్తుంది. అసలు చందన్‌ మాతో గ్యాంగ్‌స్టర్‌గా ఎలా ఎదిగాడు? ఎలాంటి కూర్రమైన నేరాలు చేశాడన్న విషయాలతో రెండో ఎపిసోడ్‌ను తీర్చిదిద్దారు. నాయకుడు, ప్రతినాయకుడి పాత్రను ఎస్టాబ్లిష్‌ చేయడానికి కాస్త ఎక్కువ నిడివి తీసుకున్నారేమో అనిపిస్తుంది. బిహార్‌లో సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం కథలో భాగంగా ప్రస్తావించడంతో సన్నివేశాలు సుదీర్ఘంగా సాగుతాయి.

పోలీస్ ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నారని తెలిసిన వారిని చందన్‌ మాతో దారుణంగా హత్య చేయడంతో అతడిని పట్టుకునే బాధ్యత అమిత్‌ లోథాకు అప్పగిస్తుంది ప్రభుత్వం. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇద్దరి మధ్యా పోలీస్‌ vs గ్యాంగ్‌స్టర్‌ పోరు సాగుతుంది. చందన్‌ను పట్టుకునేందుకు అమిత్‌ సాగించే ఇన్వెస్టిగేషన్‌ కొత్తగా అనిపించినా.. గతంలో ఒకట్రెండు సినిమాల్లో మనం చూసిందే. ఫోన్‌ ట్యాపింగ్‌ టెక్నాలజీ ఇప్పుడు సర్వ సాధారణం. కానీ, 2005 నాటికి అది చాలా మందికి తెలియదు. ఆయా సన్నివేశాలు అలరిస్తాయి. పోలీసులకు దిలిప్‌ సాహు(జతిన్‌ శరణ్‌)ల మధ్య సాగే సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి. ఈ కథా, నేపథ్యం పూర్తిగా వేరైనా అక్కడక్కడా కార్తి ‘ఖాకీ’ను గుర్తు చేస్తుంది. మొదటి మూడు ఎపిసోడ్లలో కథను ఎస్టాబ్లిష్‌ చేసుకుంటూ వెళ్లిన దర్శకుడు.. నాలుగో ఎపిసోడ్‌ నుంచే అసలు ట్విస్ట్‌లు మొదలుపెడతాడు. అక్కడి నుంచి సాగే ఇన్వెస్టిగేషన్‌ ఎపిసోడ్స్‌ ఆసక్తికరంగా ఉంటాయి. అయితే, చివరిలో ఛేజింగ్‌ ఎపిసోడ్‌, ముగింపు మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది. పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ డ్రామాలను చూసే ఆసక్తి ఉన్నవారు ఈ వీకెండ్‌లో ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ ప్రయత్నించవచ్చు. తెలుగులో ఆడియో కూడా అందుబాటులో ఉంది. అయితే, నిడివి ఒక్కటే కాస్త ఇబ్బంది.

ఎవరెలా చేశారంటే: ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ (Khakee: The Bihar Chapter) లో ప్రతి నటుడు ఆయా పాత్రలకు చక్కగా సరిపోయారు. ఐపీఎస్‌ అధికారి అమిత్‌ లోథాగా కరణ్‌ చాలా బాగా నటించారు. దాదాపు ఆరున్నర గంటల నిడివి కలిగిన ఈ వెబ్‌సిరీస్‌లో ఈయన స్క్రీన్‌ ప్రెజెన్స్‌ ఎక్కువ. అందుకు తగినట్లు ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా బాగుంది. నాటి వ్యవస్థల పనితీరు నచ్చకపోయినా, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఆ పాత్ర నడుచుకునే తీరు బాగుంది. ప్రతినాయకుడు చందన్‌ మాతోగా అన్వేష్‌ తివారి ఓకే. ఆ పాత్రను, ఇంకాస్త బలంగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.  మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా వెబ్‌సిరీస్‌ ఓకే. 2000 నాటి పరిస్థితులను చూపించటానికి ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ బాగానే కష్టపడింది. చాలా సన్నివేశాలకు కత్తెర వేసే అవకాశం ఉన్నా.. వాస్తవికత కోసం వదిలేశారు. అవన్నీ ప్రేక్షకుడికి విసిగిస్తాయి. నీరజ్‌ పాండే స్క్రిప్ట్‌ను ఇంకాస్త గ్రిప్పింగ్‌గా రాసుకుని ఉంటే బాగుండేది. పాత్రలు, వాటి పరిచయం, అసలు పాయింట్‌కు రావడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. అలాగే చాలా పాత్రలను త్వరగా ముగించినట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా ట్విస్ట్‌లు మినహా సన్నివేశాలు కూడా సాధారణంగా సాగుతాయి.

బలాలు

+ నటీనటులు, + కథా నేపథ్యం, + కొన్ని ట్విస్ట్‌లు

బలహీనతలు

- నిడివి, - పాత్రలను ముగించిన తీరు

చివరిగా: ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌.. సూపర్‌ పోలీస్‌ వర్సెస్‌  గ్యాంగ్‌స్టర్‌ పోరు..

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని