Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్‌

నటుడు కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep) ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 28 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో తాను  ఈ స్థాయికి రావడానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పారు.

Published : 02 Feb 2023 01:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన సతీమణి ప్రియ (Priya Sudeep) చేసిన ఎన్నో త్యాగాల వల్లే తాను నటుడిగా ఇంత దూరం ప్రయాణించగలిగానని నటుడు కిచ్చా సుదీప్‌ (Kichcha Sudeep) అన్నారు. అందుకు ఆమెకు ధన్యవాదాలు చెప్పారు. నటుడిగా తన ప్రయాణం మొదలై నేటితో 28 ఏళ్లు అయిన సందర్భంగా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చెబుతూ సుదీప్‌ తాజాగా వరుస ట్వీట్లు చేశారు.

‘‘28 ఏళ్ల నా సినీ ప్రయాణానికి తొలి అడుగు ఇదే రోజున పడింది. నా సతీమణి ప్రియా సుదీప్‌ చేసిన ఎన్నో త్యాగాల వల్లే ఇది సాధ్యమైంది. ఆమె సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం ప్రయాణం చేసేవాడిని కాదు. ప్రియా.. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. నన్ను నాలా ఉంచి, నా ప్రయాణాన్ని గౌరవించినందుకు నీకు ఎన్నో సందర్భాల్లో కృతజ్ఞతలు చెప్పాలనుకుని విఫలమయ్యాను. నా విషయంలో నువ్వు చేసిన ప్రతిదానికి ధన్యవాదాలు. అలాగే, విషయం ఏదైనా సరే.. తన అభిప్రాయాన్ని బయటపెట్టే నా కుమార్తె శాన్వీకి, నాకు ఈ జీవితాన్ని అందించిన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు’’ అని సుదీప్‌ రాసుకొచ్చారు.

సీరియల్‌ నటుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన సుదీప్‌ ‘తాయవ్వ’తో వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆయన సహాయ నటుడిగా పనిచేశారు. ‘స్పర్శ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ ఆయన నటించారు. ‘ఈగ’తో తెలుగువారికీ సుపరిచితులయ్యారు. ఇటీవల ఆయన నటించిన ‘విక్రాంత్‌ రోణ’తో విజయాన్ని అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని