King Of Kotha OTT Release: ఓటీటీలోకి దుల్కర్‌ సల్మాన్‌ కొత్త చిత్రం.. ఆ విషయంలో నో క్లారిటీ..!

దుల్కర్‌ సల్మాన్‌ నటించిన సరికొత్త చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King Of Kotha OTT Release) ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Published : 25 Sep 2023 18:39 IST

హైదరాబాద్‌: దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ కథా చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ (King Of Kotha). దుల్కర్‌ స్నేహితుడు అభిలాష్‌ జోషి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గ్యాంగ్‌స్టర్‌ కథాంశంతో ఇది సిద్ధమైంది. ఎన్నో అంచనాల మధ్య ఆగస్టు నెలాఖరులో విడుదలై ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. దుల్కర్‌ నటన బాగున్నప్పటికీ కథ, దానిని తెరకెక్కించిన విధానం బాగోలేదని పలువురు విమర్శలు చేశారు. ఇప్పుడీ చిత్రం ఓటీటీలోకి ప్రవేశించనుంది. డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబర్‌ 29 నుంచి ఇది ప్రసారం కానుంది. కేవలం మలయాళంలోనే ఇది స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ వెర్షన్‌లో ఇది అందుబాటులో ఉంటుందా? లేదా? అనే విషయంపై క్లారిటీ లేదు.

రివ్యూ: ఆర్‌డీఎక్స్‌.. మలయాళంలో రూ.80 కోట్లు వసూలు చేసిన మూవీ ఓటీటీలో వచ్చేసింది!

కథేంటంటే: స్వాతంత్య్రానికి పూర్వం ఎలాంటి విచారణ లేకుండా నేరస్థుల్ని శిక్షించడానికి బ్రిటిషర్లు ఎంచుకున్న ఊరు కోతా. ఆ ఊరు తర్వాతి కాలంలో అన్యాయాలకు.. అక్రమాలకు నిలయంగా మారుతుంది. ఆ నేర సామ్రాజ్యాన్ని మకుటం లేని చక్రవర్తిలా ఏలుతుంటాడు రాజు (దుల్కర్‌ సల్మాన్‌). తనకు స్నేహితుడు కన్నా (షబీర్‌) అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడే తల్లిదండ్రులు రాజును దూరం పెడితే.. అండగా నిలిచింది కన్నానే. అలాగే రాజుకు తార (ఐశ్వర్య లక్ష్మీ) అంటే ప్రేమ. వీళ్లిద్దరి జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశించడంతో సమస్యలు మొదలవుతాయి. తార వల్ల మోసపోయానన్న బాధతో రాజు మద్యానికి బానిసవుతాడు. అదే సమయంలో కోతాను హస్తగతం చేసుకోవడానికి ప్రత్యర్థి రంజిత్‌ (చెంబన్‌ వినోద్‌ జోస్‌)తో కలిసి కుట్ర పన్నుతాడు కన్నా. ఓవైపు ప్రేయసి చేతిలో.. మరోవైపు స్నేహితుడి చేతిలో మోసపోయిన రాజు అకస్మాత్తుగా కోతాను వదిలి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కోతాను కన్నా తన చేతుల్లోకి తీసుకొని రావణ కాష్ఠంలా మార్చేస్తాడు. అయితే కొన్నాళ్లకు ఆ ఊరిలోకి అడుగు పెట్టిన సీఐ షాహుల్‌ (ప్రసన్న).. కన్నా ఆట కట్టించేందుకు మళ్లీ రాజును కోతాకు తిరిగి రప్పిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రాజు తిరిగి వచ్చాక కన్నాకు ఎలా బుద్ధి చెప్పాడు? తారతో అతని ప్రేమ కథ ఏమైంది? కోతాలో తన జెండా పాతాలనుకున్న రంజిత్‌ ఏమయ్యాడు?తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని