Kiran Abbavaram: అలా నటించటం ఇదే తొలిసారి: కిరణ్‌ అబ్బవరం

‘రాజావారు రాణిగారు’, ‘ఎస్‌. ఆర్‌. కల్యాణ మండపం’, ‘సమ్మతమే’ తదితర చిత్రాలతో యువతను ఆకర్షించిన నటుడు కిరణ్‌ అబ్బవరం.

Published : 14 Sep 2022 23:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్‌. ఆర్‌. కల్యాణ మండపం’, ‘సమ్మతమే’ తదితర చిత్రాలతో యువతను ఆకర్షించిన నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram). ఆయన నటించిన తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’ (Nenu Meeku Baaga Kavalsinavaadini) ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివీ..

డైలాగ్స్‌ రాశా..

‘‘మా (దర్శకుడు శ్రీధర్‌ గాదె) కాంబినేషన్‌లో రెండో సినిమా చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. కానీ, సాధ్యపడలేదు. చివరకు మా కాంబో దివ్యగారి నిర్మాణంలో సెట్‌ అయింది. ఈ సినిమాలోని సంభాషణలు నేనే రాశా. నేనూ బాబా భాస్కర్‌ కనిపించే సన్నివేశాలు మంచి వినోదం పంచుతాయి. సంగీత దర్శకుడు మణిశర్మ నా సినిమాకు పని చేయటం మంచి జ్ఞాపకం’’

చెప్పలేని ఆనందం..

‘‘దర్శకుడు కోడి రామకృష్ణగారంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాన్నేను. ఆయనతో పనిచేసే అవకాశం లేకపోయినా తన కూతురు దివ్య దీప్తి గారితో పని చేయడం ఆనందంగా ఉంది. పైగా ఈ సినిమా ట్రైలర్‌ను పవన్ కల్యాణ్‌ అన్న విడుదల చేయటం పట్టరాని సంతోషాన్నిచ్చింది’’

ఆ నమ్మకం ఉంది

‘‘ఈ చిత్రం చాలా సహజంగా ఉంటుంది. ‘ఇది మన కథ’ అని సినిమా చూసిన వారంతా అనుకుంటారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఓ మంచి పాయింట్‌ను చెప్పబోతున్నాం. ఎస్‌. వి. కృష్ణారెడ్డిగారి పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇందులోని తండ్రీ కూతుళ్ల ఎమోషన్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. అందరి హృదయాలను హత్తుకుంటుంది. నా విషయానికొస్తే.. ఇప్పుడిప్పుడే నటుడిగా స్థిరపడుతున్న సమయంలో ఈ సినిమా నన్ను మరో మెట్టు ఎక్కిస్తుందనుకుంటున్నా. ఇందులో నేను విభిన్న షేడ్స్‌ ఉండే రెండు పాత్రల్లో కనిపిస్తా. ఒకే చిత్రంలో రెండు క్యారెక్టర్లు ప్లే చేయటం ఇదే తొలిసారి. ఈ సినిమాతో ఇంకొంత మంది ప్రేక్షకులకు దగ్గరవుతాననే నమ్మకం ఉంది’’

తదుపరి చిత్రాలు..

‘‘గీతా ఆర్ట్స్‌ సంస్థలో ‘వినరో భాగ్యము విష్ణుకథ’, మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో ‘మీటర్’ చిత్రాలు షూటింగ్‌ పూర్తి చేసుకున్నాయి. ఎ. ఎం. రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రూల్స్‌ రంజన్‌’ చిత్రం సగభాగం పూర్తయింది. దర్శకుడు శ్రీధర్‌ గాదెతో మరో చిత్రం చేసే అవకాశం ఉంది’’ అని కిరణ్‌ తెలిపారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts