Kisi Ka Bhai Kisi Ki Jaan Review: రివ్యూ: కిసీ కా భాయ్‌.. కిసీ కి జాన్‌

Kisi Ka Bhai Kisi Ki Jaan Review: సల్మాన్‌ఖాన్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 21 Apr 2023 17:37 IST

Kisi Ka Bhai Kisi Ki Jaan Review: చిత్రం: కిసీ కా భాయ్‌ కిసి కి జాన్‌; నటీనటులు: సల్మాన్‌ఖాన్‌, వెంకటేశ్‌, పూజాహెగ్డే, జగపతిబాబు, భూమిక తదితరులు; నేపథ్య సంగీతం: రవి బస్రూర్‌ (పాటలు: హిమేశ్‌ రేష్మియా, షాజిద్‌ ఖాన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ తదితరులు); సినిమాటోగ్రఫీ: వి.మణికందన్‌; ఎడిటింగ్‌: మయూరేష్‌ సావంత్‌; నిర్మాత: సల్మాన్‌ఖాన్‌; రచన, దర్శకత్వం: ఫర్హద్‌ సమ్జీ; విడుదల: 21-04-2023

బాలీవుడ్‌ నటీనటులు, దర్శక-నిర్మాతలు దక్షిణాది చిత్రాలపై మనసు పారేసుకుంటున్నారు. ఇటీవల విజయవంతమైన చిత్రాలనే కాదు.. కొన్నేళ్ల కిందట విడుదలైన సినిమాలను సైతం రీమేక్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా పేరు తెచ్చుకున్న సల్మాన్‌ఖాన్‌కు రీమేక్‌లు కొత్తేమీ కాదు. ఇప్పుడు ఆయన ఖాతాలో మరో సినిమా వచ్చి చేరింది. అదే అజిత్‌ నటించిన ‘వీరమ్‌’. తెలుగులో ఇదే సినిమాను ‘కాటమరాయుడు’గా పవన్‌కల్యాణ్‌ తీస్తే, పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. (Kisi Ka Bhai Kisi Ki Jaan Review) ఇప్పుడు అదే సబ్జెక్ట్‌ను తీసుకుని సల్మాన్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ అంటూ తీసుకొచ్చారు. తెలుగు నటుడు వెంకటేశ్‌ ఇందులో కీలక పాత్ర పోషించడంతో సినిమాపై ఇక్కడి వారికీ ఆసక్తి నెలకొంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను అలరించిందా? సల్మాన్‌ ఈద్‌ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అయిందా?

కథేంటంటే: భాయిజాన్‌ (సల్మాన్‌ఖాన్‌) ఆత్మరక్షణలో యువకులకు శిక్షణ ఇస్తుంటాడు. ఆ ప్రాంతంలో ఎవరికి కష్టం వచ్చినా.. భాయిజాన్‌ సాయం చేస్తాడు. అవసరమైతే కొట్టి మరీ సమాధానం చెబుతాడు. భాయిజాన్‌కు ముగ్గురు సోదరులు. మంచి అమ్మాయిని చూసి తమ అన్నకు పెళ్లి చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే తెలుగమ్మాయి భాగ్యలక్ష్మి (పూజాహెగ్డే) తమ అన్నకు సరైన జోడీగా భావిస్తారు. అయితే, ఆమెకు రౌడీలు, గూండాగిరి చేసేవారంటే నచ్చదు. భాగ్యలక్ష్మి కోసం భాయిజాన్‌ కూడా మంచివాడిలా నటిస్తుంటాడు. పాత కక్షల కారణంగా భాగ్యలక్ష్మి కుటుంబానికి రౌడీ అన్న (జగపతిబాబు) నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది. (Kisi Ka Bhai Kisi Ki Jaan Review) మరి రౌడీ అన్న నుంచి భాగ్యలక్ష్మి కుటుంబానికి తెలియకుండా భాయిజాన్‌ ఎలా కాపాడుతూ వచ్చాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? చివరికి భాగ్యలక్ష్మిని భాయిజాన్‌ వివాహం చేసుకున్నాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరొక భాషలో రీమేక్‌ చేస్తున్నారంటే అక్కడి ప్రేక్షకుల అభిరుచి, అందులో నటించే స్టార్‌ స్టామినాను బట్టి కథలో మార్పులు చేయాలి. అవసరమైతే అదనపు సన్నివేశాలూ జోడించాలి. ఈ విషయంలో ఏమాత్రం బ్యాలెన్స్‌ తప్పినా ప్రేక్షకులను ఆ సినిమా మెప్పించదు. ‘కిసీ కా భాయ్‌ కిసి కా జాన్‌’ విషయానికొస్తే తమిళంలో విజయం సాధించిన ‘వీరమ్‌’ను హిందీ ప్రేక్షకుల అభిరుచి మేరకు స్క్రీన్‌ప్లేలో పూర్తిగా మార్పులు చేశారు దర్శక-రచయితలు. అంతవరకూ బాగానే ఉన్నా.. సల్మాన్‌ఖాన్‌ స్టార్‌డమ్‌ను దృష్టిలో పెట్టుకుని తమిళ, తెలుగు కమర్షియల్‌ సినిమాల్లాగానే ఈ చిత్రాన్ని చుట్టేశారు. మాతృకతో పోలిస్తే సినిమా చూస్తున్నంత సేపు నటీనటులు మారతారు తప్ప, ఏ సన్నివేశంలోనూ కొత్తదనం కనిపించదు.

ప్రథమార్ధమంతా సల్మాన్‌-పూజాల మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌, హాస్య సన్నివేశాలతో పాటు, మధ్య మధ్యలో యాక్షన్‌ సన్నివేశాలతో నింపేశారు. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఇలాంటి సన్నివేశాలను చాలా సినిమాల్లోనే చూసేశాం. అయితే, సల్మాన్‌ తనదైన బాడీ లాంగ్వేజ్‌, టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేశారు. అభిమానులను మాత్రమే అవి అలరిస్తాయి. విరామ సన్నివేశాలకు గానీ సినిమా అసలు పాయింట్‌కు రాదు. అక్కడ ట్విస్ట్‌ ఇచ్చి సినిమాపై ఆసక్తి పెరిగేలా చేశారు. (Kisi Ka Bhai Kisi Ki Jaan Review) ద్వితీయార్ధంలోనైనా సినిమా గాడిన పడుతుందనుకుంటే భాయిజాన్‌ ముగ్గురి సోదరుల ప్రేమకు సంబంధించిన సబ్‌ప్లాట్స్‌తో దారి తప్పింది. వెంకటేశ్‌ పాత్ర కూడా సినిమాపై పెద్దగా ప్రభావమేమీ చూపించదు. ఇక మధ్యలో వచ్చే పాటలు సినిమాకు స్పీడ్‌ బ్రేకర్స్‌లా ఇబ్బంది పెడతాయి. ఒక రొటీన్‌ క్లైమాక్స్‌తో సినిమాను ముగించాడు దర్శకుడు. ‘వీరమ్‌’ను సల్మాన్‌ వెర్షన్‌లో తీసి చేతులు దులుపుకొన్నాడు దర్శకుడు.

ఎవరెలా చేశారంటే: ‘వీరమ్‌’ చూసి మనసుపడి, సల్మాన్‌ ఈ సినిమాను తీసినట్టు ఇట్టే అర్థమైపోతోంది. అయితే, ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అన్నట్లు అదేదో అప్పుడే తీసి ఉంటే, బాగుండేది. భాయిజాన్‌గా సల్మాన్‌ అలవాటైన పాత్రలో చేసుకుంటూ వెళ్లిపోయారు. తనదైన బాడీ లాంగ్వేజ్‌, టైమింగ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో అభిమానులను మాత్రం అలరిస్తారు. అయితే, ఇంకా ఇలాంటి పాత స్టోరీస్‌ జోలికి వెళ్లి సల్మాన్‌ తన స్టార్‌డమ్‌ను వృథా చేసుకోవడం అనవసరం. కథానాయికగా పూజాహెగ్డే ఓకే. అందంగా కనిపించింది. అయితే, సల్మాన్‌తో కలిసి తొలిసారి తెరపై చూసినప్పుడు కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్‌ కాలేదనిపిస్తుంది. వారిని తెరపై చూసి ఆస్వాదించడానికి కాస్త సమయం పడుతుంది. (Kisi Ka Bhai Kisi Ki Jaan Review) వెంకటేశ్‌, భూమిక, సల్మాన్‌కు సోదరులుగా నటించిన వారు తమ పరిధి మేరకు మెప్పించారు. రౌడీ అన్నలాంటి ప్రతినాయకుడి పాత్రలు జగపతిబాబుకు కొత్తేమీ కాదు. చొక్కా తొడుక్కున్నంత ఈజీగా చేసేస్తారు. సాంకేతికంగా సినిమా ఓకే. సినిమాను రిచ్‌గా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫ్రీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. రవి బస్రూర్‌నేపథ్య సంగీతం బాగుంది. మొత్తం 8మంది సంగీత దర్శకులు ఈ సినిమాకు పాటలు అందించారు. అవి కాస్తా కిచిడీ అయ్యాయి. చివరిగా దర్శకుడు ఫర్హద్‌ సమ్జీ అజిత్‌ ‘వీరమ్‌’ చొక్కాను తీసుకుని, ‘కాటమరాయుడు’ గుండీలు, దారాలు తీసుకుని, సల్మాన్‌ కొలతలతో ‘కిసీ కా భాయి కిసీ కి జాన్‌’ కుట్టాడు.

బలాలు: + సల్మాన్‌ఖాన్‌; + యాక్షన్‌ సన్నివేశాలు

బలహీనతలు: - రీమేక్‌ కథ కావడం; - ద్వితీయార్ధం; - పతాక సన్నివేశాలు

చివరిగా: వీరమ్‌+కాటమరాయుడు+సల్మాన్‌= కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌ (Kisi Ka Bhai Kisi Ki Jaan Review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని