Cinema News: తెలుగు తంబీలు

క్రమంగా తన స్థాయిని పెంచుకుంటున్న తెలుగు సినిమా ఇప్పుడు పక్కనే ఉన్న తమిళ తంబీలను ఆకర్షిస్తోంది. ఎప్పుడో కమల్‌ హాసన్‌ కొన్ని తెలుగు సినిమాలలో ఇక్కడి ప్రేక్షకులను పలకరించినా..

Updated : 11 Apr 2022 09:16 IST

క్రమంగా తన స్థాయిని పెంచుకుంటున్న తెలుగు సినిమా ఇప్పుడు పక్కనే ఉన్న తమిళ తంబీలను ఆకర్షిస్తోంది. ఎప్పుడో కమల్‌ హాసన్‌ కొన్ని తెలుగు సినిమాలలో ఇక్కడి ప్రేక్షకులను పలకరించినా.. మిగిలిన హీరోలు ఇక్కడ పెద్దగా సినిమాలు తీయలేదు. రీలు గిర్రున తిరిగింది. పాన్‌ ఇండియా సినిమాలతో జోరు మీదున్న తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి తమిళ హీరోలు ప్రస్తుతం సంకోచించడం లేదు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా షూటింగ్‌లలో ప్రస్తుతం బిజీగా ఉన్న కథా నాయకులు ఎవరనేది ఇప్పుడు చూద్దాం..


వంశీ పైడిపల్లితో దళపతి

కోలీవుడ్‌లో అగ్ర కథానాయకుడు విజయ్‌ టాలీవుడ్‌లో వంశీ పైడిపల్లితో జట్టు కట్టాడు. ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. రష్మిక మందన్న కథానాయిక, దిల్‌ రాజు నిర్మాత. గతంలో విజయ్‌ నటించిన ‘3 ఇడియట్స్‌’, ‘సర్కార్‌’ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న ‘బీస్ట్‌’ పై తెలుగులోనూ భారీ అంచనాలున్నాయి.


‘సార్‌’గా ధనుష్‌

‘కొలవెరి’ పాటతో దశాబ్దం కిందటే తెలుగు రాష్ట్రాల యువతకు దగ్గరైన ధనుష్‌ ‘రఘువరన్‌ బి.టెక్‌’, ‘మారి’ లాంటి చిత్రాలతో అలరించాడు. మంచి కథ కోసం ఎదురు చూసిన ధనుష్‌ ‘సార్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఎస్‌ నాగ వంశీ నిర్మిస్తున్నారు. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో మరో సినిమాకూ తన అంగీకారం తెలిపాడు. ఇది ఇంకా సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది.


‘జాతి రత్నం’తో శివకార్తికేయన్‌  

తమిళ పరిశ్రమలో సహజ నటుడిగా పేరున్న శివ కార్తికేయన్‌కు తెలుగులోనూ అలాంటి గుర్తింపే ఉంది. ‘జాతిరత్నాలు’ ఫేం అనుదీప్‌ దర్శకత్వంలో నటిస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో ప్రకటించాడు. ఆసియన్‌ సినిమాస్‌, శాంతి టాకీస్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ హీరో నటించిన ‘డాన్‌’ సినిమా ఈ ఏడాది మే నెలలో రానుంది.

* వీరే కాకుండా తెలుగులో అభిమానుల్ని సంపాదించుకున్న సూర్య, కార్తీలు తెలుగు సినిమాలు చేయడానికి మేం ఎప్పుడూ సిద్ధమే అని చెబతున్నారు. తెలుగులో భారీ విజయాల ఒరవడి కొనసాగుతుంటే.. మిగిలిన తమిళ అగ్రహీరోలూ తెలుగు తంబీలుగా మారడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చేమో!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని