Published : 25 Apr 2022 09:50 IST

Kajal: అందుకే కాజల్‌ని ‘ఆచార్య’ నుంచి తొలగించాం: కొరటాల శివ

హీరోయిన్‌ రోల్‌పై దర్శకుడు క్లారిటీ

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి సతీమణి సురేఖ కలల ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. దేవాలయాల నేపథ్యంలో సిద్ధమైన ఈ సినిమా కోసం తొలిసారి చిరంజీవి, రామ్‌చరణ్‌ ఫుల్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. వేసవి కానుకగా ఏప్రిల్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ ప్రమోషన్స్‌ పనుల్లో కొరటాల శివ బిజీగా ఉన్నారు. సినిమాలోని కీలకపాత్రలు, ‘ధర్మస్థలి’, ‘పాదఘట్టం’.. ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటూ తరచూ శివ ప్రత్యేక వీడియోలను నెట్టింట్లో షేర్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ‘ఆచార్య’లో కాజల్‌ పాత్రపై స్పందించారు.

చిరంజీవితో ‘ఆచార్య’ ప్రాజెక్ట్‌ని అనౌన్స్‌ చేసిన సమయంలోనే.. కాజల్‌ కథానాయికగా నటిస్తున్నారని చిత్రబృందం ప్రకటించింది. ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత చిరు-కాజల్‌ కాంబోలో సినిమా అనే సరికి అభిమానులు కూడా ఆసక్తి కనబరిచారు. ‘ఆచార్య’ షూట్‌లో కాజల్‌ పాల్గొన్న ఫొటోలు, ‘లాహే లాహే’ సాంగ్‌లో సంగీతతో కలిసి కాజల్‌ డ్యాన్స్‌ చేసిన పలు వీడియోలు గతంలో బయటకు వచ్చాయి. అయితే, తాజాగా విడుదల చేసిన టీజర్‌, ట్రైలర్‌లలో కాజల్‌ ఎక్కడా కనిపించలేదు. సినిమా ప్రమోషన్స్‌లోనూ ఆమె పేరు వినిపించడం లేదు. ఈ విషయంపై కొరటాల శివ తాజాగా స్పందించారు. ‘ఆచార్య’ నుంచి కాజల్‌ని తొలగించినట్లు తెలిపారు. ‘‘మొదట సినిమా అనుకున్నప్పుడు హీరోకి జోడీగా హీరోయిన్‌ ఉంటే బాగుంటుందనిపించింది. ధర్మస్థలిలో ఉండే ఓ అమ్మాయిగా కాజల్‌ పాత్ర క్రియేట్‌ చేశాం. నాలుగు రోజులు షూట్‌ చేశాం. పాత్ర రాసుకున్నాం, షూట్‌ చేశాం కానీ, ‘ఆచార్య’ పాత్రకు లవ్‌ ఇంట్రస్ట్‌ ఉంటే బాగుంటుందా? లేదా? అనే విషయంపై నాకు సందేహం కలిగింది. అదే సమయంలో కరోనా రావడంతో కొన్నిరోజులపాటు ఆలోచించాను. నక్సలిజం సిద్ధాంతాలున్న వ్యక్తికి లవ్‌ ఇంట్రస్ట్‌ పెడితే బాగోదని, సినిమాలో హీరోయిన్‌ పాత్ర ఉండాలి కాబట్టి ఏదో ఒక పాత్రను సృష్టించి అంత పెద్ద హీరోయిన్‌తో చేయిస్తే బాగోదనిపించింది. అలాగే ఆ పాత్రకు పాటలు కూడా లేవు, సరైన ముగింపు కూడా లేదు.. ఇవన్నీ ఆలోచించి ఓసారి చిరంజీవితో ఇదే విషయాన్ని చెప్పాను. ‘కథకు ఏది అవసరమో అదే చెయ్‌. నీకున్న సందేహాన్ని అందరితో పంచుకో’ అని చిరు చెప్పారు. అదే విషయాన్ని కాజల్‌కి అర్థమయ్యేలా చెప్పాను. ఆమె అర్థం చేసుకుని.. ‘నేను మీ అందర్నీ మిస్‌ అవుతున్నా. భవిష్యత్తులో తప్పకుండా సినిమా చేద్దాం’ అని చెప్పారు. అలా, ఆమెను ఈ చిత్రం నుంచి తొలగించాం’’ కొరటాల శివ వివరించారు. అయితే, ‘లాహే లాహే’ సాంగ్‌లో కాజల్‌ కనిపిస్తారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని శివ అన్నారు.Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని