Koratala: హీరోయిజం లెక్కలు మార్చిన డైరెక్టర్‌

కమర్షియల్‌ అంశాలకు సందేశాన్ని జోడించి సక్సెస్‌ సాధించిన కొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.  హీరో అంటే వందమందిని ఒక్కవేటుతో నరికేవాడు కాదు. ఒక్కమాటతో గొడవను శాశ్వతంగా చల్లార్చేవాడేనని తన పాత్రల ద్వారా తెరపై చూపించాడు.

Updated : 15 Jun 2021 09:25 IST

కమర్షియల్‌ అంశాలకు సందేశాన్ని జోడించి సక్సెస్‌ సాధించిన కొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు.  హీరో అంటే వందమందిని ఒక్కవేటుతో నరికేవాడు కాదు. ఒక్కమాటతో గొడవను శాశ్వతంగా చల్లార్చేవాడేనని తన పాత్రల ద్వారా తెరపై చూపించారు. పగ, ప్రతీకారంతో రగిలేవాడు హీరో ఎలా అవుతాడు? ప్రకృతిని, సొంత ఊరిని, సాటి మనిషిని ప్రేమించేవాడే కదా.! హీరో  అని అంటాడు కొరటాల. అదే కదా అసలైన హీరోయిజం అని వెండితెరపై బలంగా బల్లగుద్ది చెబుతాడు. మనుషుల్లోని తడిని, మనసుల్లో జరిగే రాపిడిని, ప్రేక్షకుల నాడిని పట్టుకున్నవాడు గనుకే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు. ఈ రోజు కొరటాల శివ పుట్టిన రోజు. ఈ సందర్భంగా కొరటాల శివ మలిచిన కథానాయకుల తీరుతెన్నులపై ఓ కథనం.

వీలైతే ప్రేమిద్దాం.. డ్యూడ్‌

మొదటి చిత్రం ‘మిర్చి’ నుంచే హీరోయిజానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారు కొరటాల శివ. ‘మీ ఊరి మీదకి రావాలంటే నువ్వు స్కెచ్ వేసుకురావాలి. నేను హ్యాంగర్‌కున్న షర్ట్‌ వేసుకొచ్చేస్తా’ అనే  ఉడుకునెత్తురు మరిగే అచ్చ తెలుగు హీరోలాంటోడే జై. అలాంటి యువకుడు గొడవల్లో కన్నతల్లి మరణిస్తే, రెగ్యులర్‌ సినిమాల్లో లాగా ప్రతీకారం కోసం పాకులాడడు. పగ, ప్రతీకారాలతో సాధించేది లేదని, ‘వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్‌, పోయేదేముంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు’ అని మనిషి తత్వాన్ని బోధిస్తాడు.  మనుషుల్ని కొట్టడం చంపడం కాదు. ప్రేమగా దగ్గరికి తీసుకోవడమే అసలైన మగతనం అని పౌరుషానికి అసలైన నిర్వచనం ఇస్తాడు. పగ కన్న ప్రేమ గొప్పదని ‘మిర్చి’ సినిమాతో చెప్పి అటు ప్రభాస్‌ అభిమానులను, సాధారణ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. 

ఊరి నుంచి చాలా తీసుకున్నాం తిరిగి ఇచ్చేయాలి

గ్రామాలను దత్తత తీసుకోవడం అనే గొప్ప ఆలోచనను ‘శ్రీమంతుడు’ ద్వారా జనాల్లోకి తీసుకెళ్లాడు దర్శకుడు. ఎన్ఆర్‌ఐలు, నటులు, రాజకీయ నాయకులు ఇలా ఎంతో మంది గ్రామాలను దత్తత తీసుకొనేందుకు స్ఫూర్తి కలిగించింది ఈ సినిమా. దత్తత తీసుకొనే వారి సంఖ్య శ్రీమంతుడు వచ్చాక గణనీయంగా పెరిగింది. ప్రజలను అంతగా ప్రభావితం చేసిన సినిమా ఇది. రౌద్రం, వీరత్వానికి ప్రతీకగా ఉండే తెలుగు హీరోను సమాజ సేవ వైపు తిప్పి  సూపర్‌ సక్సెస్‌ సాధించారు కొరటాల.  కోటీశ్వరుడైన హర్షవర్ధన్ తన కుటుంబాన్ని, సమస్తాన్ని వదిలేసి తండ్రి పుట్టిన గ్రామాన్ని దత్తత తీసుకొనేందుకు బయలుదేరతాడు.  గ్రామంతో పాటు, అక్కడి మనుషుల్లోనూ మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. ‘ఊరి నుంచి చాలా తీసుకున్నాం తిరిగి ఇచ్చేయాలి. లేదంటే లావైపోతాం’ అనే డైలాగ్‌తో పుట్టిన నేలకు రుణం తీర్చుకోవాలనే సందేశాన్నిచ్చాడు దర్శకుడు.  హీరోయిన్‌ పాత్రను పాటలకు, సన్నివేశాలకే పరిమితం చేయకుండా స్వతంత్రంగా జీవించాలనుకునే బలమైన యువతిగా రాసుకున్నారు. సినిమా సూపర్‌ హిట్‌ అవడమే కాదు, సామాజిక మార్పునకు కారణమైంది.

ప్రకృతి ఆరాధకుడు..ఆనంద్‌

‘మొక్కలు, గాలి, నీరు వీటిని కాపాడుకోవడమే నా పని’ అంటూ ఓ ప్రకృతి ప్రేమికుడు అనంద్‌ను హీరోగా చూపించారు ‘జనతా గ్యారేజ్‌’లో. భూమి, ప్రకృతి అంటే అమితంగా ఇష్టపడే హీరో వాటిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు, పలికే సంభాషణలు సగటు ప్రేక్షకుడిని  ప్రకృతి ప్రేమలో పడేస్తాయి. ‘మనమంతా ఈ భూమ్మీదకు టెనెట్స్‌లా వచ్చిన వాళ్లమే. వచ్చే తరానికి ఉన్నది ఉన్నట్లుగా ఇచ్చేద్దామ’ని ముందుచూపుతో హితబోధ చేస్తాడు. ఇదే సినిమాలో సత్యం అనే మరో పవర్‌ఫుల్‌ పాత్రను రాసుకున్నారు. ఎన్టీఆర్‌ మొక్కలను, ప్రకృతిని కాపాడుతుంటే, మనుషులను సంరక్షించుకొనే బాధ్యతను మీదేసుకుంటాడు మోహన్‌లాల్‌. ఆ ఇద్దరు కలిసి సమాజాన్ని రిపేర్‌ చేసే తీరు కమర్షియల్‌గా విజయం సాధించేందుకు దోహదం చేసింది.  మొక్కలతో పాటు మనుషులను కాపాడితే భూమి ఇంకా అందంగా ఉంటుందని చెబుతూనే, ‘ప్రకృతికి కోపం రాకూడదు. వస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆగదు. దాని ముచ్చటంతా తీర్చుకుని , దానంతట అది ఆగాల్సిందేన’ని  సృష్టి కోపం గురించి హెచ్చరికలు జారీ చేస్తారు. బాణసంచా వెలుగుల్లో నిత్యమేనన్‌ కనిపిస్తే సగటు తెలుగు హీరోగా మురిసిపోకుండా, బాణాసంచా కాల్చడం ద్వారా ఎంత కాలుష్యం జరుగుతుందో చెబుతూ క్లాస్‌ తీసుకుంటాడు. హీరోయిజాన్ని ఇంత సున్నితంగా ఆవిష్కరించడం ఎవరికి సాధ్యం అవుతుంది. ఇదే కదా అసలు సిసలైన హీరోయిజం.

నాయకుడు అవసరం లేని సమాజం

మహేశ్‌ బాబుతో తీసిన రెండో చిత్రం ‘భరత్‌ అనే నేను’. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కి ఘనవిజయం సాధించింది. రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాల్లో ఇది కచ్చితంగా ప్రత్యేకమైనదే. మహేశ్‌బాబు ముఖ్యమంత్రిగా నటించాడు. నాయకుడు అవసరం లేని సమాజం నిర్మించడమే అసలైన రాజకీయ నాయకుడి లక్షణం అనే డైలాగ్స్‌తో నాయకత్వానికి సిసలైన నిర్వచనాన్నిచ్చారు.  సమసమాజ శ్రేయస్సు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనకాడని నాయకుడిగా మహేశ్‌ బాబు పాత్ర ఆకట్టుకుంటుంది. ఇది పొలిటికల్‌ చిత్రమే అయినే సమాజంలో పేరుకుపోయిన నిర్లక్ష్యం, అవినీతి, బాధ్యత రాహిత్యంతో పాటు స్థానిక పాలన, విద్య, ఆరోగ్యం ఇలా చాలా అంశాలను చర్చలోకి తీసుకొచ్చారు. వ్యక్తిగత బాధ్యతను గుర్తుచేసే సినిమా ఇది. 

ఆచార్యతో పాఠాలు.. గుణపాఠాలు..

కొరటాల శివ చిత్రాల్లో హీరోలు ఎక్కడి నుంచో ఊడిపడరు. వాళ్లేమీ సూపర్‌ హీరోల్లా కనిపించరు.  మన చుట్టూ తిరిగే సాధారణ కుర్రాళ్లలాగే ఉంటారు.  తన చుట్టూ ఉండే ప్రపంచం బాగుండాలని కోరుతూ.. మార్పు కోసం పాటుపడే సిసలైన హీరోలు. మంచికి, సుగుణాలకు కేరాఫ్‌ అడ్రస్‌ లాంటి పాత్రలవి. కమర్షియల్‌ హంగులతో కలిపి చెప్పడం ద్వారా  సరికొత్త ఒరవడిని సృష్టించిన క్యారెక్టర్లవి. మంచి సందేశానికి కమర్షియాలిటీని జోడించారు గనుకే అటు థియేటర్లలో ఈలలు, ఇటు నిర్మాతల గల్లా పెట్టెలో కాసులు పడుతున్నాయి.  ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవితో ‘ఆచార్య’ తీస్తున్నారు. చిరుతో కొరటాల చెప్పించే పాఠాలు.. గుణపాఠాలు చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.  ఇక చిరులోని హీరోయిజాన్ని ఏ స్థాయిలో చూపిస్తారో ప్రేక్షకుడి ఊహకైనా అందుతుందో లేదో  తెలియాలంటే  సినిమా వచ్చే దాకా ఎదురు చూడాల్సిందే. మరోసారి హ్యాపీ బర్త్‌డే టు క్లాసికల్‌ మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని