Krishna: మూడో సినిమాతోనే ప్రభంజనం.. ఒకటా రెండా కృష్ణ సాహసాలెన్నో

తెలుగు తెరపై కృష్ణ చేసిన సాహసాల సమాహారం. ఏ సినిమాతో దేన్ని పరిచయం చేశారంటే..

Published : 16 Nov 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమాల్లో సాహసం చేయడం వేరు.. సినిమా పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించేందుకు సాహసించడం వేరు. అలాంటి సాహసాలెన్నో చేసి ‘అసాధ్యుడు’ అని అనిపించుకున్నారు కృష్ణ. ఆయన నట ప్రస్థానంలో చోటు చేసుకున్న పలు కీలక మలుపులను చూద్దాం... 

ఆరంభం అదిరింది..

నటుడిగా కృష్ణ తొలి అడుగులోనే సాహసం చేశారు. అగ్ర హీరోల సినిమాలే రాణిస్తోన్నరోజుల్లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కొత్త వారితో ఓ సినిమా చేయాలకున్నారు. పైగా కలర్‌ ప్రింట్‌లో. ఎంతోమంది సినీ పెద్దలు దానిపై పెదవి విరిచారు. అటు దర్శకుడు, ఇటు కృష్ణ వారి మాటలేం పట్టించుకోకుండా తమ పని తాము చేశారు. ‘తేనె మనసులు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసును దోచారు. (కలర్‌లో చిత్రీకరించిన తొలి సోషల్‌ ఫిల్మ్‌ ఇది). 

జేమ్స్‌బాండ్‌గా..

అక్కడో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ప్రేక్షకులు ‘బసవరాజు’ పాత్ర పోషించిన కృష్ణ కంటే ‘చిట్టిబాబు’ క్యారెక్టర్‌ ప్లే చేసిన రామ్‌ మోహన్‌పై ప్రశంసలు కురిపించారు. ‘ఆంధ్రా దేవానంద్‌’లా ఉన్నాడంటూ కీర్తించారు. కట్‌ చేస్తే, నిర్మాత డూండీ మాత్రం కృష్ణ ఆ సినిమాలో చేసిన ఓ రిస్కీషాట్‌కి ఫిదా అయ్యారు. వెండితెర మీద ట్రిగ్గర్‌ పేల్చే శక్తి అతనికే ఉందని కనిపెట్టారు. ‘మా సినిమాలో నటిస్తావా?’ అని అడగడమే ఆలస్యం కృష్ణ ఓకే చెప్పేశారు. అలా వచ్చిందే ‘గూఢచారి 116’. దీంతోనే కృష్ణ ‘ఆంధ్రా జేమ్స్‌బాండ్’గా మారారు. కృష్ణకు ఇది మూడో సినిమా. కెరీర్‌ ప్రారంభంలోనే ఇంతటి విజయాన్ని అందుకోవడం ఆయనకే చెల్లింది. (తెలుగులో వచ్చిన తొలి స్పై చిత్రమిది).

అరుదైన ఫిల్మ్‌మేకర్‌..

‘నట శేఖర’ అనేది కృష్ణ బిరుదు. కానీ, డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ హీరోగా పిలుచుకోవడంలోనే అభిమానులకు ఆనందం. అందుకు కారణం కూడా లేకపోలేదు. ‘సింహాసనం’ సినిమాని తీసుకుంటే.. 70 ఎం.ఎం.లో వచ్చిన తొలి చిత్రంగా రికార్డుకెక్కింది. బాలీవుడ్‌ ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీ లహరి, నటి మందాకిని, నటుడు అంజాద్‌ ఖాన్‌లు ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఒకే సమయంలో తెలుగు, హిందీ సినిమాలకు దర్శకత్వం వహించిన అరుదైన మేకర్స్‌లో కృష్ణ ఒకరు.

జోస్యం విఫలం..

1960ల్లో ‘గుడ్‌ బ్యాడ్‌ అండ్‌ అగ్లీ’, ‘మెకానస్‌ గోల్డ్‌’ వంటి చిత్రాలు విడుదలై హాలీవుడ్‌లో ప్రభంజనం సృష్టించాయి. అలాంటి కౌబాయ్‌ ప్రపంచాన్ని తెలుగు ప్రేక్షకులకు చూపించాలనుకున్న కృష్ణ ఎన్ని సమస్యలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ‘కౌబాయ్‌ సినిమాలంటే గుర్రపు స్వారీలు, భారీ బడ్జెట్‌’ అంటూ పలువురు సూచించగా ఏం ఫర్వాలేదంటూ కృష్ణ ముందుకుసాగారు. ‘తెలుగులో కౌబాయ్‌ సినిమానా?’ సినీ పండితుడిగా, సినీ మాంత్రికుడిగా పేరు గడించిన ఓ నిర్మాత ఆ సినిమా విజయం సాధించదని జోస్యం చెప్పారట. కానీ, ‘మోసగాళ్లకు మోసగాడు’ ఎవరూ ఊహించని హిట్‌గా నిలిచింది. విశేషం ఏంటంటే.. హాలీవుడ్‌ సినిమాల ప్రేరణతో తీసిన ఈ చిత్రాన్ని అక్కడి ప్రేక్షకులు సబ్‌టైటిల్స్‌తో చూడడం. ఈ సినిమా నుంచి కృష్ణ ‘ఆంధ్రా కౌబాయ్‌’గా గుర్తింపు పొందారు.

వెనకడుగేయలేదు..

నటుడిగా ఎన్ని ప్రయోగాలు చేసినా కృష్ణ సంతృప్తి పడలేదు. ఇంకా ఏదో చేయాలని పరితపిస్తూనే ఉన్నారు. ఆ సమయంలోనే విప్లవ వీరుడి అల్లూరి సీతారామరాజు జీవితాధారంగా ఓ సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు. అప్పటికే అల్లూరి కథను తెరపైకి తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్‌ సన్నద్ధమవుతున్నారు. ‘ఒకే కథను ఇద్దరు చేస్తే ఎలా?’ ఇదే అప్పట్లో అందరి నోళ్లలో నానిన ప్రశ్న. ఎట్టకేలకు కృష్ణనే అల్లూరి సీతారామరాజుగా మారారు. ఏదో చేశామంటే చేశామని కాకుండా తెలుగు జాతి కీర్తించేలా, తెలుగు సినిమా ఉన్నంత కాలం గుర్తుండిపోయేలా తీయాలనుకున్నారు. కృష్ణ అనుకున్న విధంగా చిత్రం రావాలంటే దానికి ‘సినిమా స్కోప్‌’ కావాల్సిందే. అప్పటికి ఈ నేపథ్యంలో హిందీలో రెండు సినిమాలు వచ్చి ఉంటాయి. అదెంత పెద్ద వ్యవహారం అయినా కృష్ణ ఊరుకోలేదు. సినిమా స్కోప్‌ విధానంలోనే సినిమాని పూర్తి చేశారు. 1974లో విడుదలైన ఈ సినిమా కనీవినీ ఎరగని విజయాన్ని దక్కించుకుంది. (సినిమా స్కోప్‌లో దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన తొలి చిత్రమిది). ఈ సినిమాతో కృష్ణ ‘వెండితెర విప్లవజ్యోతి’గా అవతరించారు.‘తెలుగు వీర లేవరా’తో ‘డి.టి.ఎస్‌’ని, ‘ఈనాడు’ చిత్రంతో ‘ఈస్ట్‌మన్‌ కలర్‌’ ఫార్మాట్‌ను కృష్ణ తెలుగు తెరకు పరిచయం చేశారు.

అవే కాదు వీటిలోనూ..

‘సాహసం అంటే తనకు నచ్చిన నేపథ్య కథల్లో నటించడమేనా?’ అని ఎవరైనా అనుకుంటారని కృష్ణ భావించారో ఏమో భావోద్వేగభరిత, రైతు పాత్రలు, పౌరాణికాల్లోనూ తన మార్క్‌ చూపించారు. ‘దేవదాసు’, ‘కురుక్షేత్రం’, ‘పాడిపంటలు’, ‘పండంటి కాపురం’ తదితర చిత్రాలు ఇందుకు మంచి ఉదాహరణ. రాజకీయ నేపథ్య సినిమాల్లోనూ కృష్ణది అందవేసిన చెయ్యి. ‘ముఖ్యమంత్రి’, ‘నా పిలుపే ప్రభంజనం’, ‘రాజకీయ చదరంగం’, ‘సాహసమే నా ఊపిరి’ తదితర సినిమాలు అప్పట్లో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాయి.

ఆ పాట కోసం కొత్త గాయకుడు..

‘తెలుగు ప్రేక్షకులు ఘంటసాల గొంతు మాత్రమే విన్నారు. రామకృష్ణ గానాన్నే ఆస్వాదించారు. బాలసుబ్రహ్మణ్యం గాన మాధుర్యానికి తరించారు. మరి అలాంటి వారు కొత్త గొంతు నుంచి వచ్చే పాటను వింటారా? ‘శ’ను ‘స’గా పలికితే అంగీకరిస్తారా?’ అనేది అప్పట్లో చాలామంది అభిప్రాయం. ఎస్పీ బాలుతో కృష్ణకు అప్పట్లో మనస్పర్థలు వచ్చాయి. దాంతో ‘కొత్త గాయకుడు పాడినా వింటారు’ అన్న ధోరణిలో రాజ్‌ సీతారామ్‌ను పరిచయం చేశారు. ఆ పాటే 1986లో విడుదలై సంచలనం సృష్టించిన ‘ఆకాశంలో ఒక తార నాకోసమొచ్చింది ఈ వేళ’ (సింహాసనం). బాలుకు అవకాశాలు లేనప్పుడు తన ఇతర సినిమాల్లో పాటలు పాడించుకున్నారంటే కృష్ణ వ్యక్తిత్వం  ఎలాంటిదో అర్థంచేసుకోవచ్చు.Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు