Krishna Vamsi: ‘రంగమార్తాండ’ ఆ నైతిక స్థైర్యాన్ని అందించింది!

‘‘రంగమార్తాండ’ (Rangamarthanda) విజయం ఇలాంటి మరిన్ని ప్రయోగాలు చేయడానికి కావాల్సిన నైతిక స్థైర్యాన్ని అందించింద’’న్నారు దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi).

Updated : 25 Mar 2023 07:11 IST

‘‘రంగమార్తాండ’ (Rangamarthanda) విజయం ఇలాంటి మరిన్ని ప్రయోగాలు చేయడానికి కావాల్సిన నైతిక స్థైర్యాన్ని అందించింద’’న్నారు దర్శకుడు కృష్ణవంశీ (Krishna Vamsi). మరాఠీలో విజయవంతమైన ‘నటసామ్రాట్‌’కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. ప్రకాష్‌రాజ్‌ (Prakash Raj), రమ్యకృష్ణ (Ramyakrishna), బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు కృష్ణవంశీ. ఆ విశేషాలివి..  

‘‘ప్రకాష్‌ రాజ్‌ సలహాతో తొలిసారి ‘నటసామ్రాట్‌’ చిత్రం చూశా. అది చూసినప్పుడే భావోద్వేగాల్ని నియంత్రించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా. అందులోని ఫ్యామిలీ ఎమోషన్స్‌ నాకు అంత బాగా నచ్చాయి. దీనికి తోడు ఇటీవల కాలంలో కుటుంబ బంధాల మధ్య దూరం పెరుగుతోంది. కాబట్టి ఇలాంటి తరుణంలో ఈ కథ చెబితే బాగుంటుందనిపించింది. ప్రకాష్‌ కూడా ఈ కథ నువ్వు డైరెక్ట్‌ చేస్తేనే బాగుంటుందని చెప్పడంతో ఈ చిత్రం భుజానికెత్తుకున్నా. మాతృకతతో పోల్చితే ఈ సినిమాలో చాలా మార్పులు చేశాం. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు పెద్ద పీట వేశాం. తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పాం. సమాజంలోని అనేక సమస్యల్ని చర్చించాం. సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరూ ‘మా అమ్మ గుర్తొంచ్చింది. నాన్న గుర్తొచ్చారు’ అంటూ చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది’’.

‘‘ఈ సినిమాలో ప్రకాష్‌ రాజ్‌ పాత్రను ‘నువ్వు చెత్త నటుడివి’ అని తిట్టాలన్నా.. చెంప దెబ్బ కొట్టాలన్నా ఆ స్థాయి ఉన్న నటుడు కావాలి. అలాగే ఆ పాత్ర ప్రేక్షకులకు ఓ మంచి సర్‌ప్రైజ్‌గా ఉండాలి. వీటన్నింటికీ న్యాయం చేయాలంటే నాకు ముందుగా మనసులో మెదిలిన రూపం బ్రహ్మానందమే. నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే ‘చక్రపాణి పాత్రను బ్రహ్మానందంతో చేయించాలనుకుంటున్నా’ అని ప్రకాష్‌తో చెప్పా. తను కూడా వెంటనే చాలా బాగుంటుందని ఒప్పుకున్నాడు. ఈ చిత్రంలో వచ్చే ఆస్పత్రి సీన్‌ను బ్రహ్మానందం మూడు నెలల పాటు బట్టీపట్టారు. ప్రకాష్‌ను చెంప దెబ్బ కొట్టే సీన్‌ చేసే సమయంలో ఆయన భోజనం కూడా మానేశారు. ఆ చక్రపాణి పాత్ర కోసం బ్రహ్మానందం అంత కష్టపడ్డారు. త్వరలో ‘అన్నం’ అనే సినిమా చేయనున్నా. అదొక విభిన్నమైన సినిమా. అదెప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది.. ఏ నిర్మాణ సంస్థలో ఉంటుందన్నది త్వరలో తెలియజేస్తా’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని