Krishna Vrinda Vihari review: రివ్యూ:కృష్ణ వ్రింద విహారి

Krishna Vrinda Vihari review: నాగశౌర్య, షెర్లీ జంటగా నటించిన రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘కృష్ణ వ్రింద విహారి’ ఎలా ఉందంటే?

Updated : 23 Sep 2022 13:47 IST

Krishna Vrinda Vihari review: చిత్రం: కృష్ణ వ్రింద విహారి; నటీనటులు: నాగశౌర్య, షెర్లీ సేథియా, రాహుల్‌ రామకృష్ణ, సత్య, వెన్నెల కిషోర్‌, రాధిక, బ్రహ్మాజీ తదితరులు; సంగీతం: మహతి స్వర సాగర్‌; సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్‌; ఎడిటింగ్‌: తమ్మిరాజు; నిర్మాత: ఉషా ముల్పూరి; దర్శకత్వం: అనిష్‌ ఆర్‌ కృష్ణ; విడుదల: 23-09-2022

కొద్దిమంది కథానాయకులకి  కొన్ని కథలు బాగా నప్పుతాయి. నాగశౌర్య - రొమాంటిక్‌ కామెడీ కథ. ఈ కాంబినేషన్‌ చూడటానికి చాలా బాగుంటుంది. మరోసారి తనకి అచ్చొచ్చిన కథనే ఎంచుకుని సొంత నిర్మాణ సంస్థలో ‘కృష్ణ వ్రింద విహారి’ చేశారు. ఈ సినిమా కోసం ఆయన పాదయాత్ర కూడా చేశారు. మరి సినిమా ఎలా ఉంది? నాగశౌర్య ఎలా నటించారు? అనీష్‌ కృష్ణ మేకింగ్‌ ఆకట్టుకుందా?

కథేంటంటే: కృష్ణాచారి (నాగశౌర్య) సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన కుర్రాడు. ఇంట్లో కట్టుబాట్లు ఎక్కువ. కృష్ణాచారి తల్లి అమృతవల్లి (రాధికా శరత్‌కుమార్‌) అంటే ఆ ఊళ్లో తెలియనివాళ్లు ఉండరు. పల్లెటూరి నుంచి ఉద్యోగం కోసమని హైదరాబాద్‌ చేరుకుంటాడు కృష్ణాచారి. ఐటీ కంపెనీలో టెక్నికల్‌ ట్రైనర్‌గా చేరతాడు. అక్కడే మేనేజర్‌గా పనిచేసే వ్రిందా (షిర్లే సేథియా)ని చూడగానే ప్రేమలో పడతాడు. ఎలాగైనా ఆమెతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటాడు. కానీ, వ్రిందా ఓ సమస్యతో బాధపడుతుంటుంది. అందుకే పెళ్లికి నిరాకరిస్తుంది. ఆ సమస్యని దాచిపెట్టి పెళ్లికి పెద్దల్ని ఒప్పించేందుకు కృష్ణ ఎన్ని అబద్ధాలు ఆడాడు? పెళ్లి తర్వాత ఎలాంటి కష్టాల్ని ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే?: ఒక అబ్బాయి... అమ్మాయి మధ్య ప్రేమకథని కుటుంబంతో ముడిపెట్టిన సినిమా ఇది. కథ కంటే కూడా ద్వితీయార్ధంలో సంఘర్షణ, హాస్యం బాగా పండింది. దాంతో ఓ మంచి కాలక్షేపాన్నిచ్చే చిత్రంగా నిలిచింది. ప్రథమార్ధంలో కథానాయకుడి ఐటీ ఉద్యోగం, అమ్మాయిని చూడగానే గుండెల్లో మోగే గంట, తర్వాత ఒకరినొకరు ప్రేమించుకోవడం తదితర సన్నివేశాలు చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది. కుటుంబ నేపథ్యం మినహా మిగతా అంతా మూమూలే. విరామానికి ముందు వచ్చే మలుపు, ద్వితీయార్ధమే  సినిమాకి కీలకం. కథానాయకుడు అబద్ధం చెప్పి కుటుంబ సభ్యుల్ని నమ్మించడం, ఆ క్రమంలో పండే వినోదం, ఆ అబద్ధం తీసుకొచ్చే కొత్త కష్టాలు, సంఘర్షణ సినిమాకి కీలకం. సెకండాఫ్‌లో అత్తాకోడళ్ల మధ్య వైరం కూడా మంచి వినోదాన్ని పంచుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో వెన్నెల కిషోర్‌, సత్య, రాహుల్‌ రామకృష్ణ కలిసి చేసిన హంగామా బాగా నవ్వించింది. సున్నితమైన ఓ సాధారణ కథని కొత్త రకమైన సన్నివేశాలతోనూ, వినోదంతోనూ తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. నటుల బలం తోడు కావడంతోపాటు, ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం.

ఎవరెలా చేశారంటే: నాగశౌర్య, షిర్లే సేథియా, రాధికా శరత్‌ కుమార్‌ చక్కటి అభినయం ప్రదర్శించారు. వాళ్లు ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన విధానం చాలా బాగుంది. నాగశౌర్య, షిర్లే సేథియా ట్రెండీగా కనిపిస్తూనే పాత్రల్ని పండించారు. రాధికా శరత్‌కుమార్‌ పాత్రని డిజైన్‌ చేసిన తీరు బాగుంది. అందులో ఆమె అంతే బలంగా ఒదిగిపోయారు. వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, సత్య, రాహుల్‌ రామకృష్ణ నవ్వించే బాధ్యతని తీసుకున్నారు. ద్వితీయార్ధంలో వీళ్లు పంచిన హాస్యం కీలకం. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మహతి స్వరసాగర్‌ పాటలు గుర్తుంచుకునేలా కాకపోయినా తెరపై  చూస్తున్నప్పుడు ప్రభావం చూపిస్తాయి.  కెమెరా పనితనం బాగుంది. కథని అల్లిన విధానంలోనూ, హాస్యం జోడించడంలోనూ దర్శకుడు తనదైన ప్రభావం చూపించారు. నిర్మాణం బాగుంది.

బలాలు

+ కథలో సంఘర్షణ

+ నటులు... హాస్యం

+ ద్వితీయార్ధం

బలహీనతలు

- ప్రథమార్ధం

కొత్తదనం లేని కథ

చివరిగా: కాలక్షేపానికి... ‘కృష్ణ వ్రింద విహారి’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు